చాలామందికి నంబర్ల పిచ్చి ఉంటుంది. కారుకు తమకు నచ్చిన నంబర్ ప్లేట్ కోసం లక్షల్లో ఖర్చు పెట్టే వాళ్లున్నారు. ఫలానా నంబరు ప్లేటు భారీ ధరకు అమ్ముడుపోయిందంటూ కథనాలు చూస్తూనే ఉన్నాం.
న్యూమరాలజీని నమ్మేవాళ్లు ఇలా నంబర్ల కోసం భారీగా ఖర్చుపెడుతుంటారు. ఇప్పుడు దీనికి పరాకాష్ట లాంటి ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. కేవలం ఇంటి నంబర్ నచ్చిందని 5 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాడు ఓ వ్యక్తి.
సిడ్నీలో ఓ ఇల్లు అమ్మకానికొచ్చింది. 3 బెడ్ రూమ్స్ తో అందంగా ఉన్న ఆ ఇల్లును అమ్మేందుకు వెబ్ సైట్ లో పెట్టారు. పెట్టిన 4 రోజుల్లోనే ఓ వ్యక్తి ఆ ఇంటిని సొంతం చేసుకున్నాడు. అది కూడా చెప్పిన ధర కంటే 5 కోట్ల 15 లక్షల రూపాయలు అదనంగా చెల్లించి మరీ దక్కించుకున్నాడు. ఇంత ఖర్చు పెట్టింది ఆయనకు ఇల్లు నచ్చి కాదు, ఇంటితో పాటు, ఆ ఇంటి నంబర్ నచ్చింది.
ఆ ఇంటి నంబర్ 65. అలాంటి నంబర్ ఉన్న ఇంటి కోసం ఏడాదిగా వెదుకున్నాడు ఆ బయ్యర్. దీంతో సైట్ లో ఇంటిని చూసిన వెంటనే వ్యక్తిగతంగా వెళ్లి ఓసారి చూశాడు. లొకేషన్ కూడా నచ్చడంతో వేలం పాట కంటే ముందే 5 కోట్ల 15 లక్షలు అదనంగా చెల్లించి ఇల్లు సొంతం చేసుకున్నాడు.
న్యూమరాలజీ ప్రకారం తనకు కలిసొచ్చిన నంబర్ కలిగి ఉన్న ఇంటిని దక్కించుకున్నందుకు ఆ ఓనర్ చాలా సంతోషంగా ఉన్నాడు. త్వరలోనే తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి మారబోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. న్యూమరాలజీని నమ్మే వాళ్లు ఇంతే. కలిసొచ్చే సంఖ్య కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి సైతం వెనకాడరు.