Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్రజారాజ్యం ఎమ్మెల్యే మృతి.. 'చిరు' సంతాపం లేదా?

ప్రజారాజ్యం ఎమ్మెల్యే మృతి.. 'చిరు' సంతాపం లేదా?

2009లో చిరంజీవి ప్రజారాజ్యం తరపున నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి కాన్సర్ తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కనీసం ఆయన గురించి చిరంజీవి ఓ ట్వీట్ వేయలేదు, సంతాప ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఆయన్ని చిరంజీవి గుర్తు పెట్టుకుంటారని అనుకోలేం కానీ, కనీసం చనిపోయిన తర్వాతైనా ఓ సంతాప ప్రకటన విడుదల చేసి ఉంటే బాగుండేది. ప్రజారాజ్యం తరపున గెలిచిన ఎమ్మెల్యేలు వందల్లో లేరు కదా. చిరంజీవితో సహా గెలిచింది 18 మంది. కనీసం వారిని అయినా చిరు గుర్తు పెట్టుకోకపోవడం బాధాకరమైన విషయం.

చిరంజీవి ప్రతి ఒక్కరి పుట్టినరోజుని గుర్తు పెట్టుకుని మరీ ట్వీట్లు వేస్తుంటారు. ఫలానా నాయకుడికి కరోనా వచ్చింది, ఫలానా హీరో నా సోదర సమానుడు.. వారంతా కరోనా నుంచి కోలుకోవాలంటూ తన ఆకాంక్షను వెలిబుచ్చుతుంటారు. మరి అలాంటి చిరంజీవి తనతోపాటు రాజకీయాల్లో నడిచి, తన పార్టీ గుర్తుపై గెలిచి.. ఏపీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చిన ప్రజారాజ్యం ఎమ్మెల్యేలలో ఒకరిని గుర్తుంచుకోకపోవడం నిజంగా బాధపడాల్సిన విషయమే.

ఇలాంటి వాటిని ఎవరూ గుర్తు చేయరు, ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను రాజకీయాల్లో లేను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు అంటే.. రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్ని కూడా మర్చిపోతారని కాదు. కనీసం ఇలాంటి సందర్భాల్లో అయినా చిరంజీవి ఆ కుటుంబానికి సంతాపం తెలిపి ఉంటే.. ఆయన పెద్దమనసు మరోసారి బయటకు తెలిసేది.

జనసేన ఆదరింపు..

ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుల్లో ఒకరు. అనారోగ్యంతో ఆయన రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన చనిపోయాక టీడీపీ కంటే ముందు జనసేన రియాక్ట్ అయింది. మా ప్రజారాజ్యం ఎమ్మెల్యే, మా నాయకుడు అంటూ స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. 

చిరంజీవిని, చిరంజీవి పెట్టిన పార్టీని, ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను జనసేన ఇంకా గుర్తు పెట్టుకుంది కానీ, అసలు చిరంజీవి గుర్తించకపోవడం మాత్రం విశేషం. ఇదే నెల్లూరు జిల్లాలో గతంలో ఓ పెద్దాయన చనిపోతే రామ్ చరణ్ హుటాహుటిన వచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అలాంటి ప్రతిస్పందన ఆశించలేం కానీ, సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం మరీ దారుణం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?