Advertisement

Advertisement


Home > Politics - Telangana

చెమటోడుస్తున్న కాంగ్రెస్ మంత్రులు

చెమటోడుస్తున్న కాంగ్రెస్ మంత్రులు

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అధికారంలో ఉన్నాం కదా అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను తేలిగ్గా తీసుకోలేదు. పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకి బలం లేదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి.

రాజకీయ చాణక్యుడు కేసీఆర్ ఏదో విధంగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తాడనే భయం ఉంది. అందులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటి మెజారిటీతో ఉంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేసీఆర్ బీజేపీతో చేతులు కలపవచ్చనే ప్రచారమూ సాగుతోంది.

ఎన్నికల తరువాత పరిస్థితి ఎలా ఉన్న ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. వారిని నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియమించింది. వారికి అప్పగించిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ఒక్క కోమటిరెడ్డి వెంక‌ట‌ రెడ్డి మీదనే అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మిగతా మంత్రులు బాగానే పని చేస్తున్నారని అంటున్నారు. సికింద్రాబాద్‌కు ఇంఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి అక్కడ దానం నాగేందర్ గెలుపునకు సరిగా కృషి చేయడంలేదని అధిష్టానం అసంతృప్తిగా ఉందట. ఆయన గత ఎన్నికల్లో తాను గెలిచిన భువనగిరి మీదనే దృష్టి పెట్టాడని అంటున్నారు. మిగతా మంత్రులు ఓకే. రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే అని చెప్పొచ్చు.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడిగా ఆయన ఇమేజ్ అధిష్టానం దృష్టిలో ఆకాశమంత ఎత్తు పెరిగిపోయింది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పిల్లోడే అయినా ఆయన రేంజ్ ను పార్టీలోని సీనియర్లు అందుకోలేకపోయారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డే కనిపిస్తున్నాడు. సర్వం తానై ప్రచారం చేస్తున్నాడు.

అత్యధిక స్థానాలు అంటే కనీసం 14 సీట్లు  గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అధిష్టానం కూడా ఇదే నిర్దేశించింది. అన్ని స్థానాల్లో  కాంగ్రెస్ గెలిస్తేనే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ ఉంటుంది. పార్టీలో కూడా సీనియర్లు తోక జాడించకుండా ఉంటారు. నామమాత్రపు సీట్లు వస్తే పార్టీలో లుకలుకలు బయలుదేరతాయి. పార్టీలోకి వలస వచ్చిన నాయకులు కూడా తట్టా బుట్టా  సర్దుకునే ప్రమాదం ఉంది.

పార్టీలోని సీనియర్లు అంటే అసలు సిసలు కాంగ్రెస్ నాయకులు కావొచ్చు, వలస నాయకులు కావొచ్చు వారు మంత్రి పదవులు, ఇతర పదవులు ఆశిస్తున్నారు.  ఎన్నికల్లో పార్టీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతేనే వీరి ఆశలు నెరవేరుతాయి. ప్రధానంగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న నాయకులు అభ్యర్థులను గెలిపిస్తే తమకు పదవులు ఇవ్వాలని షరతు పెట్టారు. అందుకు హైకమాండ్ ఒప్పుకుంది.

ఉదాహరణకు.. భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాడు. అక్కడ అభ్యర్థి గెలిస్తే తనకు మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెట్టాడు. ఇలాంటివారు ఇంకా కొందరు ఉన్నారు. వారు ప్రభుత్వంలో పదవుల్లో, పార్టీలో కీలక పదవుల్లో ఆశిస్తున్నారు. ఏది ఏమైనా తమకు గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు.

ఇది జరగాలంటే అభ్యర్థులు గెలవాలి. కొందరు నాయకులు సరిగా పనిచేయడంలేదని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అభ్యర్థులను గెలిపించకపోతే భవిష్యత్తు ఉండదని చెప్పేసింది. అందుకే నాయకులు చెమటోడుస్తున్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేంగానీ ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే తెలంగాణలో వచ్చే సీట్లు దోహదం చేసే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లు సాధిస్తే కేంద్రంలో మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణ ఓటర్లు ఏం నిర్ణయిస్తారో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?