Advertisement

Advertisement


Home > Articles - Mohana Makaranadam

మోహన : జోర్డాన్‌ యువరాజు బహుమతి వద్దన్నా తంటానే...

మోహన : జోర్డాన్‌ యువరాజు బహుమతి వద్దన్నా తంటానే...

అనుభవాలూ - జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా 

జోర్డాన్‌ యువరాజు బహుమతి వద్దన్నా తంటానే...

భారత ఉపాధ్యకక్షుడిగా వున్న హిదాయతుల్లా గారి వద్ద నేను పని చేసే రోజుల్లో జోర్డాన్‌ యువరాజు వచ్చారు. ఆయన భార్యకు హిదాయతుల్లా బాబాయి అవుతారు. హిదాయతుల్లా గారి అన్నగారు అక్రముల్లా గారు దేశవిభజన సమయంలో పాకిస్తాన్‌కి వెళ్లారు. ఈయన ఇండియాలో చీఫ్‌ జస్టిస్‌ అయితే, అక్కడ ఆయన పాకిస్తాన్‌లో ఫారిన్‌ సెక్రటరీ అయ్యారు. ఆయన భార్య పార్శీ. కూతురు ప్రిన్స్‌ ఆఫ్‌ జోర్డాన్‌ను చేసుకుంది. హిదాయతుల్లాగారు కూడా అన్నగారిలాగానే పరమతస్తురాలిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ జైన్‌. వాళ్లకు పుట్టిన అబ్బాయిని ముస్లిమ్‌గాను, అమ్మాయిని క్రిస్టియన్‌గా పెంచారు. ఇలా హిదాయతుల్లా గారింట్లో అన్ని మతాల వారినీ మనం చూడవచ్చు. 

జోర్డాన్‌ యువరాజు భారతదేశ పర్యటనకు వచ్చినపుడు తన పినమామగారి వద్ద కొన్ని రోజులు వుండి వెళ్లారు.  వెళుతూ వెళుతూ వైస్‌ ప్రెసిడెంట్‌ వద్ద పని చేసే స్టాఫ్‌ కోసం కొన్ని బహుమతులు వదిలి వెళ్లారు. ఇదొక ఆచారం. 

నేను శారదా ముఖర్జీగారి వద్ద పని చేసినపుడు ప్రిన్స్‌ ఆగాఖాన్‌ వచ్చి హైదరాబాదులో రాజ్‌భవన్‌లో అతిథిగా వున్నారు. వెళ్లిపోతూ గవర్నరుగారి సిబ్బంది అంతటికి రకరకాల బహుమతులు వుంచి వెళ్లారు. నాకోసం ఒక చిన్న వాచీ అందచేశారు. 'హోటల్‌లో మనం బేరర్‌కు టిప్స్‌ వదిలినట్టు వీళ్లు మనకు యిలాటివి వదులుతున్నారు. తీసుకోవాల్సిన ఖర్మ మనకేమిటి?' అని నేను వద్దన్నాను.

'తీసుకోవాలి, లేకపోతే బహుమతి యిచ్చిన అతిథిని అమర్యాద పరిచిట్టే..' అన్నారు.

ఆ వాచీ అప్పట్లో రెండుమూడు వందల రూపాయలుంటుంది. 

పెద్దవాళ్ల మాట కొట్టేయలేక సరేనని తీసుకున్నాను. 

ఇప్పుడు ఈ జోర్డాన్‌ యువరాజు  కూడా ఆగాఖాన్‌ లాగానే ఓ వాచీ.. యీసారి పెద్దది.. నాకోసం యిచ్చాడు. 

ఇలాటి బహుమతుల స్వీకరణకోసం ఒక రూలుంది. తోష్‌ ఖానా (ప్రభుత్వ ఖజానా) అని ఓ ప్రభుత్వశాఖ వుంది. అక్కడకు యీ బహుమతుల విషయం తెలియపరచాలి. ఎవరు ఏమిచ్చినా తీసుకునేముందు వారికి ఆ బహుమతి పంపించి దాని విలువ కట్టించాలి. ఒక పరిమితి కంటె తక్కువ వుంటే వారు సరే, తీసుకోమంటారు. అంతకంటె ఎక్కువ అయితే రుసుము లాటిది కట్టి అప్పుడు ఆ బహుమతి స్వీకరించవచ్చు. 1983లో ఆ పరిమితి పదివేల రూపాయలు. 

ఆగా ఖాన్‌ బహుమతి పంపించినట్లే దీన్నీ వేల్యుయేషన్‌కి పంపిస్తే ఈ జోర్డాన్‌ యువరాజు యిచ్చిన బహుమతి విలువ పదిహేను వేల రూపాయలుగా తోష్‌ ఖానావాళ్లు లెక్కకట్టారు. పరిమితి కంటె ఐదువేల రూపాయలు ఎక్కువ కాబట్టి నేను అయిదు వేల  రూపాయలు కట్టాలన్నారు.

అప్పట్లో అయిదువేల రూపాయలంటే మాటలా? 'నేను కట్టలేను, నాకు ఆ వాచీ అక్కరలేదు' అన్నాను.

'అబ్బే వద్దనకూడదు, దేశానికి విచ్చేసిన విశిష్ట అతిథి బహుమతి యిచ్చినపుడు దానిని తిరస్కరించడం మర్యాద కాదు.' అన్నారు ప్రభుత్వం వారు.

ఇదెక్కడి తంటా? వద్దు మొర్రో అంటే బహుమతి చేతిలో పెడతారట. మళ్లీ దానికి నా దగ్గర డబ్బు వసూలు చేస్తారట.

ప్రొటోకాల్‌ వ్యవహారాలు యిలాగే వుంటాయి.

xxxxxx

హిదాయతుల్లా గారి దగ్గ సెక్రటరీగా పనిచేయడం వలన నాకు వృత్తిపరంగా లాభం కలిగిందో లేదో తెలియదు కానీ వ్యక్తిగతంగా చాలా లాభపడ్డాను. ఒక అరిస్టోక్రాటిక్‌ వాతావరణానికి నేను ఎక్స్‌పోజ్‌ అయ్యాను. ఎందరో ఉన్నతవిద్యావంతులు, సంస్కారులు అక్కడ నాకు తారసపడ్డారు. వాళ్లలోని ఔన్నత్యంతో బాటు చిన్నచిన్న బలహీనతలు కూడా నాకు తెలిసివచ్చాయి. బలహీనత ఏమిటంటే వాళ్లు చదువుకున్న కాలేజీల పట్ల వుండే పక్షపాతం ! 

ఒకసారి ప్రిన్స్‌ ఛార్లెస్‌ భారతదేశానికి వచ్చారు. రాజ్యాంగపరంగా ఇంగ్లండ్‌ దేశానికి ఆయన నెంబర్‌ 2. భారతదేశంలో హిదాయతుల్లాగారు నెంబర్‌ 2. అందువలన ఈయన ఛార్లెస్‌కు ఆతిథ్యం యిచ్చారు. 

వీళ్లిద్దరికీ యిది కాక మరో సామ్యం కూడా వుంది. ఇద్దరూ ఇంగ్లండులోని కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలోని ట్రినిటీ కాలేజీ పూర్వ విద్యార్థులు. అది తలచుకుని యిద్దరూ మురిసిపోయారు. 

ఆయనను వెంటబెట్టుకుని వచ్చిన బ్రిటిష్‌ హై కమీషనర్‌ కాస్సేపుండి లేచి అటూ యిటూ అసహనంగా తిరుగుతున్నాడు. నేను అడిగాను ''అదేమిటివాళ్లతో కూర్చోరా?'' అని.

''వాళ్లిద్దరూ కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ వాళ్లు. నేను ఆక్స్‌ఫర్డ్‌ వాడిని. వాళ్ల మధ్య నేనెందుకు?'' అన్నాడాయన.

ప్రతీ దేశంలో రెండు యూనివర్శిటీల మధ్య, నగరంలో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య స్పర్ధ, పోటీ వుండడం సహజంగా చూస్తూ వుంటాం. ఢిల్లీలో చదివేటప్పుడు చూశాను - హిందూ కాలేజీ వాళ్లకు, స్టీఫెన్స్‌ కాలేజీ వాళ్లకు పడేది కాదు. ఒకే యూనివర్శిటీలోని రెండు కాలేజీల మధ్య కూడా పడదు. ఇంగ్లండ్‌లో కేంబ్రిడ్జ్‌ లాగే మరో ప్రఖ్యాత యూనివర్శిటీ ఆక్స్‌ఫర్డ్‌. హై కమీషనర్‌ ఆ యూనివర్శిటీకి చెందినవాడు. తమ కాలేజీకి చెందినవాడు కనబడితే యిక అవతలివాడి మొహం కూడా చూడరన్నమాట వీళ్లు అనుకున్నాను.

ఛార్లెస్‌ యువరాజు వీడ్కోలు తీసుకుంటూ హిదాయతుల్లా గారి వద్దకు వచ్చి ''మీకు ఏం బహుమతి యివ్వాలా అని చాలా ఆలోచించాను. ఆఖరికి యిదైతే మీకు బాగా నచ్చుతుందని అనుకున్నాను.'' అంటూ ఓ పెయింటింగ్‌ చేతిలో పెట్టాడు.

అది వాళ్ల ట్రినిటీ కాలేజీని చిత్రీకరించిన పెయింటింగ్‌. ఇహ చూడాలి, హిదాయతుల్లా గారి మొహం. రెండింతలైంది. పొంగిపోయారు. ఛార్లెస్‌ను అభినందించడం మొదలుపెట్టారు. 

అన్ని అభినందనలు స్వీకరించడానికి ఛార్లెస్‌ కాస్త మొహమాటపడ్డాడు. ఏదో తప్పు చేసినవాడిలా మొహం పెట్టి ''వైస్‌ ప్రెసిడెంట్‌, ఆ పెయింటింగ్‌లో చిన్న లోపం వుంది...'' అన్నాడు.

హిదాయతుల్లా గారు భృకుటి ముడివేశారు.

''.. దానిలో దూరం నుండైనా కింగ్స్‌ కాలేజీ కనబడుతోంది.'' అన్నాడు ఛార్లెస్‌ క్షమాపణ చెప్తున్నట్లు.

వాళ్ల యూనివర్శిటీకే చెందిన కింగ్స్‌ కాలేజీ నదికి అవతల వుంటే వీళ్ల ట్రినిటీ కాలేజీ యివతల వుంది. అందువలన చిత్రకారుడు దూరంగా నదికి అవతల కాస్తకాస్తగా కనబడుతున్న కింగ్‌ కాలేజీని కూడా బొమ్మలో కవర్‌ చేశాడు. అది వీళ్లకు పెద్ద లోపంగా కనబడింది!

ఏమాట కామాట చెప్పుకోవాలి. మా ఢిల్లీ కాలేజీల్లో కూడా గొడవలుండేవి కానీ మరీ యింత అసమదీయ-తసమదీయ ఫీలింగ్స్‌ వుండేవి కావు.. అదీ ఆ వయసులో!

xxxxxx

హిదాయతుల్లా గారి దగ్గర వుండగానే 1981లో కెనడా వెళ్లవలసి వచ్చింది. జి 7 దేశాల ఆర్థిక శిఖరాగ్రసమావేశం జరుగుతోంది. అక్కడ మన ఇండియన్‌ హై కమీషనర్‌గా జి యస్‌ ధిల్ల్లాన్‌ గారు వుండేవారు. 

పశ్చిమ క్విబెక్‌లో షాతో ద మోఁ బ్లా ఁ  అనే రిసార్టులో అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌ యిత్యాది దేశాధినేతలతో సమావేశంలో పాల్గొని లంచ్‌ ముగించుకుని తిరిగి వస్తున్నాం. కార్లన్నీ వరుసగా ఒక పంట్‌ (ఫెర్రీ) మీదుగా నది దాటి యివతలివైపుకి వస్తున్నాయి. 

మేం కారులో వస్తుండగా ధిల్లాన్‌ గారు మా కారు వద్దకు వచ్చి తలుపు తీసి 'వైస్‌ ప్రెసిడెంట్‌ సెక్రటరీ ఎవరు?' అని అడిగారు.

''నేనే'' అన్నాను. 

''నీకు ప్రొటోకాల్‌ గురించి బొత్తిగా ఏమీ తెలిసినట్టు లేదే!'' అని కోపంగా అనేసి టప్పుమని తలుపు మూసేశారు.

నేను ఆశ్చర్యపడ్డాను. మాట పడి వూరుకోవడం లక్షణం కాదు కాబట్టి కారు దిగి ఆయన వద్దకు వెళ్లి అడిగాను - ''ఏమైంది సార్‌?'' అని.

''నువ్వు చూశావో లేదో, మన కార్ల వరుసలో వైస్‌ ప్రెసిడెంట్‌ కారు ముందు వెళుతోంది. దాని వెనక్కాల కెనడా దేశం వారి ప్రొటోకాల్‌ వెళుతోంది. నా కారు దాని వెనక్కాల పెట్టారు. నా కారుకి మన దేశపు జండా పెట్టాలి. కెనడియన్‌ ప్రొటోకాల్‌ కారు నాకు ముందు వుంటే జండా ఎగరవేయకూడదు. జండా లేకుండా హై కమీషనర్‌ కారు నడిపిస్తే ఎంత అమర్యాద! ఎంత తప్పు! ప్రొటోకాల్‌కి విరుద్ధం కదా! వైస్‌ ప్రెసిడెంటు కారుకి, నా కారుకి మధ్య కెనడియన్‌ ప్రొటోకాల్‌ కారు వస్తూ వుంటే నువ్వు చూస్తూ ఎలా వూరుకున్నావ్‌? అభ్యంతరపెట్టలేదేం? ఇదేనా పద్ధతి'' అంటూ ఆయన ఎగిరాడు.

''చూడండి, ఈ దేశంలో మేం మీకు అతిథులం. ఇక్కడ ప్రొటోకాల్‌ ఏమిటి, కార్ల వరుస ఎలా వుండాలి, ఏ రూట్లో వెళ్లాలి అన్నది చూసుకోవాలసినది మీరు, మీ స్టాఫ్‌. కెనడియన్‌ కారు మీకంటె ముందు వుండడం నచ్చకపోతే కార్ల వరుస మార్చేయండి. నాకేం అభ్యంతరం? ఈ మాత్రం దానికి నన్ను తప్పుపట్టడం దేనికి?'' అని సూటిగా అడిగాను.

ఆయనకు జవాబు ఏం చెప్పాలో తెలియదు. కాస్సేపు మౌనంగా వున్నాడు. 

అది అవకాశంగా తీసుకుని నేను యింకాస్త కలిపాను - 

''ఇంకో చిన్నమాట... నాకు తెలిసినంత వరకు యిలా నాలుగైదు దేశాల కేవల్కేడ్‌ (ఊరేగింపు)లు వున్నపుడు ఒక దేశానికి ఒక జండా మాత్రమే అనుమతిస్తారు. వైస్‌ ప్రెసిడెంట్‌ గారి కారుకి జండా వున్నపుడు యితరుల కార్లకు జండాలు పెట్టనీయరు. ప్రస్తుత సందర్భంలో మన దేశం తరఫున యిక్కడ వైస్‌ ప్రెసిడెంటుగారిదే పెద్ద హోదా. ఆయన కారుపై జండా ఎగురుతున్నంతసేపు ఆ కేవ(కార్‌)ల్కేడ్‌లో యింకే కారుపైనా జండా ఎగరడం భావ్యం కాదు. నాకు తెలిసినంతవరకు యిదీ విషయం. దీనిలో తప్పొప్పులు ఏమైనా వుంటే మీరు చెక్‌ చేసుకుని ఆ ప్రకారం జరిపించుకోండి.'' అని చెప్పాను

xxxxxx

ఓ సారి ఒక మంత్రిగారు విజయవాడ రైల్వే స్టేషన్‌లో దిగారు. ఘనస్వాగతం యిచ్చినా రుసరుస లాడుతున్నారు. 

ఎస్‌పి (సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌) అడిగాడు - ''ఏం జరిగింది సార్‌?'' అని. 

''నువ్వు సెల్యూట్‌ చేశావు గానీ నీ వెనక్కాల వున్న డియస్‌పి (డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌) సెల్యూట్‌ చేయలేదయ్యా'' అని ధుమధుమలాడారు మంత్రిగారు.

''నేను చేస్తే నా క్రింద పనిచేసేవాళ్లందరూ సెల్యూట్‌ చేసినట్టే లెక్కండి. అదీ ప్రొటోకాల్‌'' అన్నాడు ఎస్‌పి. అది గుర్తుకు వచ్చింది నాకు - వచ్చి నా కారులో కూర్చూంటుంటే!

నేనిలా చెప్పడం ధిల్లాన్‌ గారికి అవమానకరంగా తోచిందేమో. జవాబివ్వలేదు.

తర్వాత హిదాయతుల్లా గారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆయన నన్ను పిలిచి ఏమీ అడగలేదు.

హై కమీషనర్‌ వాదనలో తప్పున్నా, నేను వెళ్లి ఆయనను నిలదీయడం హిదాయతుల్లా గారికి రుచించి వుండదు. ఏదో మాట పడినా వూరుకోవచ్చు కదా అని అనుకుని వుంటారు. అది బాహాటంగా చెప్పనూ లేదు.

మర్నాడు ధిల్లాన్‌ గారు వైస్‌ ప్రెసిడెంటుకు, ఆయన స్టాఫ్‌కు కలిపి లంచ్‌ యిచ్చారు. వైస్‌ ప్రెసిడెంట్‌ వెళ్లారు కానీ మేం స్టాఫంతా వెళ్లలేదు. అదే హోటల్లో పైన పేకాడుకుంటూ కూర్చున్నాం. 

హై కమీషనర్‌ స్థాయి వ్యక్తి లంచ్‌కు పిలిచినా ఎందుకు రాలేదని హిదాయతుల్లాగారు మమ్మల్ని కోప్పడలేదు.

అది ఆయన ప్రొటోకాల్‌!

xxxxx

1982/83. రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సంజీవరెడ్డిగారు రిటైరవుతున్నారు. హిదాయతుల్లా గారు ఉపరాష్ట్రపతి కాబట్టి ఆయన స్థానంలో రాష్ట్రపతి చేస్తారో లేదో అన్న వూహాగానాలు వచ్చాయి. ఉపరాష్ట్రపతిగా వున్నవారిని రాష్ట్రపతి చేసిన సందర్భాలూ వున్నాయి, చేయని సందర్భాలూ వున్నాయి. అందుకని ఉత్కంఠ.

హిదాయతుల్లా గారు వివాదరహితుడు కాబట్టే అన్ని పార్టీలు కలిసి ఆయనను ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. అది గతం. ఇప్పుడు దేశాధ్యకక్షుడిగా కూడా ఎన్నుకుంటారా లేదా?

అధికారపక్షంగా వున్న కాంగ్రెసు ఆయన పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించకూడదని నిర్ణయం తీసుకుందని బయటకు తెలిసింది. అది తెలియగానే ప్రతిపక్ష నాయకులు నడుం బిగించారు. అధికారపక్షం వారు నిలబెట్టే అభ్యర్థికి ప్రతిగా యీయన్ను పతిపక్షాల తరపున ప్రత్యర్థిగా నిలబెట్టి గట్టి పోటీ యివ్వాలని వారి ఉద్దేశం. గతంలో అన్ని పార్టీల ఆమోదాన్ని పొంది పదవి అలంకరించిన హిదాయతుల్లా గారిని యిలాటి పోటీకి నిలబడడానికి ఒప్పించాలంటే గట్టి ఒత్తిడి తేవాల్సిందే. 

అందుకని ప్రతిపక్షంలో వున్న అప్పటి పెద్ద పెద్ద నాయకులందరూ - చరణ్‌సింగ్‌, బహుగుణ, వాజ్‌పేయి.. వీళ్లందరూ వచ్చారు.  ఆ సమావేశంలో హిదాయతుల్లా గారు నన్ను కూడా కూర్చోమన్నారు.

అది మర్యాద, సంప్రదాయం కాదనిపించింది నాకు.

''ఇది బొత్తిగా రాజకీయసమావేశం. మీ విధులకు సంబంధించిన విషయం కాదు. ఇంత పెద్దవాళ్లు వచ్చి మీతో ఏవో రహస్యవిషయాలు మాట్లాడతారు. మీకు ఏవో హామీలిస్తారు. మీ నుండి ఏవో హామీలు తీసుకుంటారు. ఇలాటి సమావేశంలో నేను వుంటే వాళ్లకూ యిబ్బంది, మీకూ యిబ్బంది కలగవచ్చు'' అని అభ్యంతరం తెలిపాను.

''ప్రొటోకాల్‌ విషయాలు యిప్పుడు మాట్లాడకు. వాళ్లంతా రాజకీయనాయకులు. నన్ను కలిసి బయటకు వెళ్లి వాళ్లకు అనువుగా వుండేలా ఏదో చెప్పేసుకుంటారు. ఈ పదవిలో వుండి నేను వారిని ఖండించలేను. వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియకుండా పోతుంది. కనీసం నువ్వు ఒకడివి సాక్షిగా వుంటావు.'' అంటూ ఆయన నన్ను ఆ మీటింగులో కూర్చోబెట్టారు.

ప్రతిపక్షనాయకులు తామనుకున్నట్టుగానే ప్రతిపాదన చేశారు.

''ఎహ్‌ ముఝే జేబ్‌ నహీ దేతా(నాకు నప్పదు), నా వంటి వ్యక్తిత్వం, నేపథ్యం వున్న వ్యక్తి పోటీ చేయడమనేది బాగుండదు. అందరూ కావాలనుకుంటేనే ఆ పదవికి సరే నంటా. కొందరైనా అక్కర లేదనుకుంటే దానికీ సరే అనుకుంటా. అంతే తప్ప నేను పోటీ చేసే ప్రశ్నే ఉదయించదు'' అని చెప్పారు.

xxxxxx

మొదట్లో చెప్పిన కథ పర్యవసానం ఏమయిం దనుకుంటున్నారా?

నాకు యిప్పటికే వాచీలున్నాయి, బహుమతిగా వచ్చిన వాచీలంటారా, ఆగా ఖాన్‌ యిచ్చినది వుంది. ఇది వద్దు మొౖర్రో అన్నా ప్రభుత్వం వారు ఒప్పుకోలేదు. ఐదువేలూ కట్టాల్సిందే జోర్డాన్‌ యువరాజు వాచీ తీసుకోవాల్సిందే అని పట్టుబట్టారు. 

ఇంకేం చేయలేక, బలవంతపు బ్రాహ్మణార్థం.. అని యిటువంటి వాటినే అంటారు కాబోలు అనుకుని, చచ్చినట్టు బ్యాంకులో ఐదువేల రూపాయలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ తీసుకుని, ఆ వాచీని బహుమతిగా (!!) తీసుకున్నాను.

అది యిప్పటికీ నా దగ్గర వుంది, భద్రంగా! బోల్డంత పోసి కొనుక్కున్నది.. తప్పుతప్పు.. బహుమతిగా తీసుకున్నది మరి!

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?