ఎమ్బీయస్‌ : కొసరు కొమ్మచ్చి – 13

తెరపైనా 'రాయని భాస్కరుడు' – ముళ్లపూడి Advertisement ముళ్లపూడి వెంకటరమణ 1953 నుండి ఎనిమిదేళ్లపాటు ఆంధ్రపత్రిక వీక్లీలో సాహిత్యరంగంలోని అన్ని ప్రక్రియలలోనూ కదం తొక్కేసి, చటుక్కున చలనచిత్రరంగంలోకి మాయమై పోయారు. మళ్లీ ఎప్పుడో మూడున్నర…

తెరపైనా 'రాయని భాస్కరుడు' – ముళ్లపూడి

ముళ్లపూడి వెంకటరమణ 1953 నుండి ఎనిమిదేళ్లపాటు ఆంధ్రపత్రిక వీక్లీలో సాహిత్యరంగంలోని అన్ని ప్రక్రియలలోనూ కదం తొక్కేసి, చటుక్కున చలనచిత్రరంగంలోకి మాయమై పోయారు. మళ్లీ ఎప్పుడో మూడున్నర థాబ్దాల తర్వాత కొన్ని వ్యాసాలు రాశారు. అందువలన విమర్శకులు సాహితీరంగానికి సంబంధించినంత వరకు ఆయన్ని 'రాయని భాస్కరుడు' అని చమత్కరిస్తూ సినీరంగం ఆయన్ని ఎగరేసుకుని పోయిందని బాధ వ్యక్తం చేసేవారు. నిజానికి రమణ సినిమారంగంలో కూడా 'రాయని భాస్కరుడే'! సినిమాకళను పూర్తిగా ఆకళింపు చేసుకుని, ఎంతో రాయగలిగి కూడా అతి క్లుప్తంగా సంభాషణలు రాశారు. ఆ రాయడం కూడా నాటకీయంగా కాకుండా, సహజంగా మాట్లాడినట్లే రాస్తూ, వాటిల్లో చమత్కారాన్ని నింపారు. 

దీనికి కారణం ఏమిటంటే రమణ నాటక రచయిత కాదు. మన తొలి తెలుగు నాటకాలు, సినిమాలు పౌరాణికాలు. తర్వాత సాంఘికాలు వచ్చినా పౌరాణిక ధోరణిలోనే పొడుగు పొడుగు డైలాగులతో, హావభావాలు ఎక్కువగా చూపుతూ వచ్చారు. నాటకాలూ అలాగే వచ్చాయి. వాటిని సినిమాలుగా మార్చినపుడు అదే ధోరణి అనుసరించారు. నాటక రచయితలే సినిమాలకు పనికి వస్తారనే అభిప్రాయం బలంగా వుంది. అప్పట్లో దాదాపు అందరూ నాటక రచయితలే (సుంకర-వాసిరెడ్డి, పింగళి, నరసరాజు, ఆత్రేయ, అనిసెట్టి, పినిశెట్టి, బొల్లిముంత, దాసరి, గణేష్‌ పాత్రో, జంధ్యాల, భమిడిపాటి..). 

సినిమారచన చేయడం మాటలు కాదు. నాటకీయత వుండాలి, కానీ సంభాషణలు నాటకీయంగా వుండకూడదు. సంభాషణలు పదునుగా వుండాలి, కానీ దృశ్యానికి ప్రాధాన్యత వుండాలి. నాటకరచనకు, సినిమారచనకు చాలా తేడా వుంది. ఎందుకంటే సినిమాలో కెమెరా కూడా ఒక పాత్ర ధరిస్తుంది. అది కూడా తన పద్ధతిలో మాట్లాడుతూ వుంటుంది. దానితో పాటు తక్కిన పాత్రలు కూడా మాట్లాడేస్తూ వుంటే 'అతి' అయిపోతుంది. ఫోటోగ్రాఫర్‌ రచయితను డామినేట్‌ చేసినా, రచయిత డైరక్టరును డామినేట్‌ చేసినా సరైన సినిమా రూపొందదు. విషయం పాతదే అయినా కొత్తగా చెప్పగలగాలి, అదే సమయంలో సామాన్యప్రేక్షకుణ్ని విస్మరించి నేల విడిచి సాము చేయకూడదు.

ఆ విషయాన్ని యీ నాటక రచయితలు క్రమేపీ గుర్తించి తమ సంభాషణలు తగ్గిస్తూ వచ్చారు. ముళ్లపూడి నాటకాలు ఎన్నడూ రాయలేదు. అందువలన నాటకరంగ ప్రభావం ఆయనపై లేదు. ఆయనకున్న అనుభవం పత్రికా రచన. ఏ సబ్జక్ట్‌నైనా అందరికీ అర్థమయ్యే తీరులో చెప్పగల నేర్పు ఆయన సొంతం.  స్కూలుఫైనల్‌ చదువై పోయాక ఆంధ్రపత్రికలో ఏడెనిమిదేళ్లు పనిచేశారు. అక్కడ ఉద్యోగం మానేసి ఫ్రీ లాన్సర్‌గా వుండే రోజుల్లో మూడు వెండితెర నవలలు రాసి, దర్శకుల దృష్టిలో పడ్డారు. అప్పుడు ''దాగుడు మూతలు'' సినిమా ఛాన్సు యిచ్చారు డి.బి.నారాయణగారు. తను సినిమాలకు పనికి రాననుకున్న రమణను ఒత్తిడి చేసి మరీ రాయించారు. ఆయనకై పనిచేస్తున్న ''దాగుడు మూతలు'' (1964) నిర్మాణంలో వుండగానే ''రక్తసంబంధం'' (1962) ఆఫర్‌ యిచ్చారు డూండీగారు. హాస్యం రాసేవాడు సినిమాలకేం రాయగలడు? అని అందరూ పెదవి విరిస్తే కామెడీ రాయగలిగినవాడు ఏ సబ్జక్టయినా రాయగలడు అంటూ సాహసం ప్రదర్శించారు డూండీ. ''దాగుడు మూతలు'' కథా చర్చలు సాగుతూండగానే రమణ ప్రతిభను గుర్తించి ''మూగమనసులు'' (1962) ఛాన్సు యిచ్చారు ఆదుర్తి సుబ్బారావు.

అలా నాటకాల రూటు పట్టకుండా రాయడం రాయడమే సినిమాలకు డైరక్టుగా రాశారు రమణ. 1962 లో విడుదలైన ''రక్తసంబంధం'' నుండి 29 సినిమాలు యితరులకు రాస్తే (కథ, సంభాషణలు, స్క్రీన్‌ ప్లే కలిపి) బాపుతో కలిసి చేసిన సినిమాలు 33. ఆఖరి సినిమా ''శ్రీరామరాజ్యం'' (2011). 13 సినిమాలలో ఆర్థిక భాగస్వామ్యం కూడా వుంది. తక్కువ సంభాషణలు రాయాలి అనే సిద్ధాంతాన్ని ఆయన విదేశీ చిత్రాల నుండి వంటబట్టించుకున్నారు. నిజానికి ఆ నాటి రచయితలందరిలోనూ పరభాషా చిత్రాలు, విదేశీ చిత్రాలు చూసే అవకాశం రమణకే వుంది. తక్కిన రచయితలందరూ పల్లెటూరి నేపథ్యం నుండి వచ్చినవారే. 

రమణ మద్రాసు మహానగరవాసి. చిన్నప్పటినుండీ అక్కడే పెరిగారు. బాపు వంటి వారి సాంగత్యంలో ఇంగ్లీషు సినిమాలూ అవీ చాలా చూశారు. నిరుద్యోగిగా కాలక్షేపం కోసం చూడడమే కాదు, ఆంధ్రపత్రిక వారపత్రికలో సినిమా పేజీకి యిన్‌చార్జిగా, సినిమా సమీక్షకుడిగా రకరకాల భాషల సినిమాలు చూశారు, వాటిపై వ్యాసాలు రాశారు, వాటి కథలను పాఠకులకు చెప్పారు. మద్రాసులో పెరగడం వలన రమణకు విదేశీ చిత్రాల ఎక్స్‌పోజర్‌ కలిగి, సినిమారచనపై తక్కిన వారి కంటె విభిన్నమైన ధోరణి అవలంబించే సౌకర్యం ఏర్పడింది. 

తన ధోరణి గురించి రాస్తూ ముళ్లపూడి – ''…సినిమా విజువల్‌ మీడియం. 'బొమ్మ ముందు.. శబ్దం తర్వాత' అన్నమాట. అందుకే నా స్క్రిప్టులో ఎక్కడ మాట అవసరమో అక్కడే వస్తుందన్నమాట. నేను మొదట్నుంచి అలాగే నేర్చుకున్నాను, పెద్దవాళ్లనీ, పాత క్లాసిక్స్‌నీ చూసి. అదే నాటకం వుందనుకోండి విజువల్‌ కన్నా ఆడియో.. శబ్దానికి ప్రాధాన్యం హెచ్చు. కారణం సినిమాలోలా దూరంగా వున్నవారికి రంగస్థలం మీద నటులు సరిగ్గా కనిపించరు. అంచేత సంభాషణలు ఎక్కువగా వుండాలి. అదే సినిమాలో అయితే, ఒక విజువల్‌తో వందమాటలు పలికించవచ్చు. 'ఒక బొమ్మ వందమాటల పెట్టు' అంటారు చూడండి. అది జ్ఞాపకం పెట్టుకుని రాస్తాను. విజువల్‌గా, అందంగా ఎలా చెప్పడం అన్నది ఊహించి చూసినదానికి అప్పుడు మాటలు రాయడం అన్నమాట..'' అని చెప్పుకున్నారు.

రమణ నాటకాలు కాదు కదా, నవలలు కూడా రాయలేదు. అప్పట్లో నవలలను సినిమాలుగా మలచేవారు. అందువలన కథలో  అనేక పాత్రలూ, చాలా మలుపులు, మెలోడ్రామా వుండేవి. వారాల తరబడి సీరియల్‌ నడవాలి కాబట్టి సంభాషణలూ ఎక్కువగానే వుండేవి. సినిమాకు వచ్చేసరికి వాటిల్లో కొన్నయినా దిగుమతి అయ్యేవి. రమణ రాసినవన్నీ కథలే. ఆయన, బాపు కలిసి తీసిన తొలి సినిమా ''సాక్షి'' (1967) రమణ రాసిన ఓ కథను ఆధారంగా తీశారు. దానికి స్ఫూర్తి నిచ్చినది ''హై నూన్‌'' అనే హాలీవుడ్‌ సినిమా. రమణ పాటించిన సూత్రం యిక్కడే కనబడుతుంది. స్ఫూర్తి పొందినది – విదేశీ చిత్రం నుండి, కానీ రూపొందించినది – గోదావరి ఒడ్డున పల్లెలో, సహజమైన వాతావరణంలో. సంభాషణలు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులోకి అనువదించినట్టు వుండవు. రమణ మద్రాసులోనే పెరిగినా, తన మూలాలు వున్న గోదావరీ ప్రాంతాన్ని, అక్కడి యాసను ఔపోసన పట్టారు. 

''సాక్షి''లో హీరో బల్లకట్టు నడిపేవాడు. విలన్‌ లారీ డ్రైవరు. మునసబు, కరణం, కరణంగారి అల్లుడు, పూజారి.. వీళ్లందరూ వాళ్ల భాషలోనే, యాసలోనే మాట్లాడతారు. నాటకీయత కోసమో, చమత్కారం కోసమో, ప్రాస కోసమో, డైలాగు పదికాలాలపాటు గుర్తుండాలనో.. మరోలా మాట్లాడరు. సంఘటనలోంచి సంభాషణ తనంతట తానే ఉద్భవిస్తుంది. హీరోయిన్‌ అన్న ఐన విలన్‌ జైలుకి వెళుతూ, పారిపోయి వచ్చి హీరోని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అతను జైల్లో వుండగా హీరోయిన్‌ హీరోకి అన్నం పెడుతూన్న శృంగార సన్నివేశంలో హీరోకి పొలమారుతుంది. నెత్తిమీద కొట్టుకుంటూ 'ఎవరో తలచుకున్నారు' అంటాడు. 'మా అన్నేమో అంటుంది' హీరోయిన్‌ కొంటెగా. భయస్తుడైన హీరోకి అతని బెదిరింపు గుర్తుకు వచ్చి కొయ్యబారిపోతాడు. హీరోయిన్‌ నవ్వేసి ఉత్తినే అన్నానులే అనే సముదాయిస్తుంది. హీరో పకపకా నవ్వుతాడు. ఓ పక్క శృంగార సన్నివేశాన్ని చూపుతూనే మరో పక్క హీరో ప్రాణానికి పొంచివున్న ప్రమాదాన్ని సూచిస్తాడు రచయిత ఒక చిన్న డైలాగుతో.(సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

Click Here For Part-8

Click Here For Part-9

Click Here For Part-10

Click Here For Part-11

Click Here For Part-12