మన తెలుగు హీరోలు చాలా తెలివైన వారు. సినిమా హిట్ అయితే అదే నిర్మాతతో మరో సినిమా చేస్తారేమో కానీ ఫ్లాప్ అయితే మాత్రం చేయరు. ఎందుకంటే ఎక్కడ కన్సెషన్ ఇవ్వాల్సి వస్తుందో అన్న లెక్కలు వుంటాయి. సినిమా ఫ్లాప్ కాగానే హీరోలు చేసే పని నిర్మాతను ఊరడించి, మళ్లీ మరో సినిమా చేద్దాంలే.. డేట్ లు ఇస్తా అని చెప్పడం. కానీ అది మాట వరకే. చాలా అంటే చాలా మంది ఆ మాట మీద వుండరు. అది టాప్ స్టార్ అయినా మిడ్ రేంజ్ హీరో అయినా.
సరైన హిట్ కోసం చాలా అంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు హీరో శర్వానంద్. ఇప్పుడు ఓ సినిమా విషయంలో నిర్మాత అనిల్ సుంకర కు మొహం చాటేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే సామాజవరగమన సినిమా తో హిట్ కొట్టాడు కొత్త దర్శకుడు రామ్ అబ్బరాజు. ఈ దర్శకుడు తరువాత సినిమా కూడా అనిల్ సుంకర కే చేయాలి. కానీ నిర్మాత ఆసియన్ సునీల్ తాను ఓ సినిమా చేస్తానని అనడంతో అనిల్ సుంకర ఓకె అన్నారు.
ఆసియన్ సునీల్ ఆ దర్శకుడిని నాగ్ చైతన్య దగ్గరకు పంపారు. అక్కడ కథ సెకండాఫ్ ఓకె కాలేదు. ఆ దర్శకుడు మొత్తం మీద హీరో శర్వానంద్ ను ఆ కథతో ఒప్పించుకున్నారు. కానీ అక్కడే చిన్న ట్విస్ట్. ఈ ప్రాజెక్ట్ అంత లాభదాయకం కాదని నిర్మాత ఆసియన్ సునీల్ తప్పుకున్నారు. దాంతో మళ్లీ ఆ ప్రాజెక్ట్ వెనక్కు వెళ్లి, అనిల్ సుంకర దగ్గర ఆగాలి. కానీ అలా జరగలేదు.
మైత్రీ సంస్థ దగ్గరకు వెళ్లింది. కానీ దర్శకుడు మైత్రీ సంస్థ దగ్గరకు ఎలా వెళ్తారు. తమతో అగ్రిమెంట్ వుంది అన్నది అనిల్ సుంకర అభ్యంతరం. అప్పుడు తెలిసింది అసలు విషయం. అనిల్ సుంకర బ్యానర్ కు కాకుండా మరే బ్యానర్ కు అయినా సినిమా చేస్తా అని శర్వనంద్ చెప్పడం వల్లనే మైత్రీ దగ్గరకు దర్శకుడు వెళ్లారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఇంతకీ శర్వా అలా ఎందుకు అని వుంటారు అంటే, అనిల్ సుంకర కు చేస్తే, రెమ్యూనిరేషన్ లేకుండానో, తక్కువకో చేయాల్సి వస్తుందని, ఎందుకంటే మహాసముద్రం టైమ్ లో మరో సినిమా చేస్తానని శర్వానంద్ మాట ఇచ్చారని తెలుస్తోంది. అందుకే ఇప్పటికి వేరే వాళ్లకే సినిమా చేయడానికే శర్వానంద్ మొగ్గు చూపుతున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ తొమ్మిది కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాక్.