రాజకీయాలు మారిపోయాయి. పార్టీలు, నిబద్దత ఇలాంటివి ఇప్పుడు అస్సలు కిట్టని వ్యవహారాలు. పార్టీలో వుండేది, రాజకీయాలు చేసేది కేవలం అధికారం అందించే పదవుల కోసం. ఆ అధికారం ఎందుకంటే సంపాదన కోసం. ఇదేమంత బ్రహ్మ రహస్యం కాదు. నాయకుల వెనుక వున్న అనుచరులకు, నాయకులను ఆదరించే జనాలకు కూడా తెలిసిన విషయమే. నాయకుడు ఎలాంటి వాడైతేనేం..తమ పనులు జరగాలనే కార్యకర్తలు, అనుచరులు, ఆఖరికి జనాలు కూడా కోరుకుంటారు. అందువల్ల నాయకుల నిర్ణయాలు అనుచరులను, కార్యకర్తలను, జనాలను పెద్దగా ప్రభావితం చేయవు. ఆ ధైర్యం తోనే ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకుని చకచకా పార్టీలు మారిపోతున్నారు.
అయిదేళ్ల కాలం అంటే చిన్నది కాదు. అయిదేళ్ల తరువాత రాజెవడో..బంటు ఎవరో? అందుకే రాజకీయ నాయకులు అంత అసహనంగా మారిపోతున్నారు. 2023 ఎన్నికల్లో అవకాశం రాకుంటే ఇక జీవితం అంతం అయిపోయినట్లు భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ తీరు క్లారిటీ గా కనిపిస్తోంది. ఏ పార్టీలో టికెట్ రాకపోయినా, ఆ పార్టీలో ఒక్క క్షణం వుండడం లేదు. ఏదో ఆశ, ఏదో భరోసా, మరేదో ప్రలోభంతో పార్టీ కండువా మార్చేస్తున్నారు. తెలంగాణలో ఈ కండువాలు మారుస్తున్న సంస్కృతి ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో తెలియదు కానీ ఇదే పరిస్థితి 2024లో ఆంధ్రలో కూడా వుంటుందని మాత్రం కచ్చితంగా అంచనా వేయొచ్చు.
ఎందుకుంటే గత అయిదేళ్లుగా తెలుగుదేశం జనాలు అధికారానికి దూరంగా వున్నారు. మరో అయిదేళ్లు దూరంగా వుండాలి అంటే చాలా కష్టం. అయిదేళ్లు నియోజకవర్గంలో అధికారానికి దూరంగా వుండడం అంటే చిన్న విషయం కాదు. అలాగే నియోజక వర్గాన్ని వేరే పార్టీకి అప్పగించేయడం అంటే అంతకన్నా చిన్న విషయం కాదు.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం..జనసేన కలిసి పోటీ చేస్తాయి. జనసేనకు కనీసం 40 సీట్లు కేటాయించాల్సి వస్తుంది. అంటే నలభై మంది తెలుగుదేశం ఆశావహులకు అసంతృప్తే మిగులుతుంది. ఏ నియోజక వర్గం జనసేనకు వెళ్లిపోతుందా అన్న చర్చలు సాగుతున్నాయి. చివరంటా చూసిన తరువాత అలా వెళ్లిన చోట అల్లా అసంతృప్తులు తలెత్తుతాయి. అలాగే జనసేన కు కూడా చోటా మోటా నాయకులు వున్నారు. అన్ని చోట్లా అవకాశం రాదు. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమిటంటే అలాంటి వాళ్లు జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అవుతారు. కానీ జనసేనకు కేటాయించిన చోట్ల తెలుగుదేశం జనాలు షిఫ్ట్ కావడానికి వైకాపా తప్ప మరో ఆప్షన్ వుండదు.
సరే, ఈ పరిస్థితుల్లో బుజ్జగింపులు ఎలాగూ వుంటాయి. ఎమ్మెల్సీ అన్నది ఓ ఆప్షన్. నామినేటెడ్ పదవులు అన్నది మరో ఆప్షన్. డబ్బు అన్నది ఆఖరి పరిష్కారం. కానీ ఈ విషయంలో వైకాపా కు అడ్వాంటేజ్ వుంటుంది. ఎలా? జగన్ అనే వాడు మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు అన్నది రాజకీయ వర్గాల్లో వున్న క్లారిటీ. అందువల్ల ఎమ్మెల్సీ, నామినేటెడ్ ఆఫర్లు వైకాపా నుంచి వస్తే విశ్వసనీయత వుంటుంది. ఈ విషయంలో చంద్రబాబుకు అస్సలు మార్కుల పడవు. చరిత్ర అలాంటిది. ఇక డబ్బు అన్నా కూడా వైకాపానే ముందు వుంటుంది. ఎందుకంటే అయిదేళ్లుగా అధికారంలో వుంది కనుక.
సరే, జంప్ జిలానీలు మొగ్గడానికి ఏ పార్టీని ఎంచుకుంటారు, ఎవరు ప్లస్ అవుతారు అన్నది పక్కన పెడితే 2023 లో తెలంగాణలో వున్న పరిస్థితి 2024లో ఆంధ్రలో కనిపించడం మాత్రం ఖాయం. కానీ తెరాస ఇక్కడ ఈ పరిస్థితిని వాడుకుంటున్నంత స్పీడ్ గా ఆంధ్రలో వైకాపా వాడుకోగలదా అన్నది అనుమానం. ఎందుకంటే వేరే పార్టీ జనాలను పార్టీలోకి లాగడంలో వైకాపా బాగా స్లోగా వుంటుంది. అలాగే తమ పార్టీ జనాలను బుజ్జగించడం లో కూడా ఆ పార్టీకి మైనస్ మార్కులే పడతాయి. ఈ రెండు విషయాల్లో తేదేపా జోరుగా వుంటుంది.
ఏమైనా 2023..2024 సంవత్సరాలు రంజైన రాజకీయాలను కళ్ల ముందు వుంచుతాయి. అందులో సందేహం లేదు.