అయినా…జగను మారలేదు

కొందరంతే..వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్లనుకుంటారు..తాము వెళ్తున్న మార్గమే సరైదనుకుంటారు. ప్రత్యర్థితో పోటీ పడుతున్నపుడు, అవతలి వాళ్లు అనుసరిస్తున్న మార్గాలను చూసి కూడా తాము మారాలని అనుకోరు. తాము ఎక్కడ బలహీనపడుతున్నామో తెలుసుకునే ప్రయత్నం…

కొందరంతే..వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్లనుకుంటారు..తాము వెళ్తున్న మార్గమే సరైదనుకుంటారు. ప్రత్యర్థితో పోటీ పడుతున్నపుడు, అవతలి వాళ్లు అనుసరిస్తున్న మార్గాలను చూసి కూడా తాము మారాలని అనుకోరు. తాము ఎక్కడ బలహీనపడుతున్నామో తెలుసుకునే ప్రయత్నం చేయరు..అలాంటివాళ్లలో ముందుంటాడు..వైఎస్ జగన్.

ఓటమి అంతిమగమ్యం కాదు..ఓటమి అనంతరం చేయాల్సినవి..చేయగలిగినవి..చేరాల్సినవి చాలా వుంటాయి. అయితే వాటికి కావాల్సింది పట్టుదల ఒక్కటే కాదు. పకడ్బందీ వ్యూహరచన కూడా. 

రాజకీయపార్టీలకు బలమైన నాయకత్వంతో పాటు కావాల్సిన క్వాలిఫికేషన్లు ఇంకా చాలా వున్నాయి. వాటిల్లో కీలకమైనవి క్యాడర్ మేనేజ్ మెంట్, మీడియా మేనేజ్ మెంట్.. ఈ రెండింట్లోనూ జగన్ ది వెరీ పూర్ ఫెర్ఫామెన్సు..ఇవ్వగలిగిన రేటింగూ తక్కువే..తెచ్చుకునే మార్కులూ తక్కువే. జగన్ పార్టీ పుట్టింది..పెరిగింది..ఓ ఎన్నికలను ఎదుర్కొంది. సరే ఆ లెక్కన చూసుకుంటే కాస్త చెప్పుకోదగ్గ స్థానాలే సంపాదించుకుంది. ఎన్నికల ముందు వరకు జగన్ బిజీ బిజీ..ఎక్కడా ఊపిరి సలిపేది కాదు. కానీ ఇప్పుడు కాస్త వెసులు బాటు దొరికింది కదా..పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరచాల్సిన అవసరంవుంది కదా..కానీ ఆయన ఆ దిశగా దృష్టి సారిస్తున్నట్లు లేదు. ఇప్పటికీ తానే..తనే. అనుకుంటున్నారు. 

విజయనగరం జిల్లాకు పరామర్శకు వెళ్లారు. వెనుక ఎవరన్న పెద్ద నాయకులు, పేరున్నవారు వున్నారా? అంటే అనుమానమే. పోనీ ఆ సంగతి అలా వదిలేసినా, జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కార్యవర్గాలు పకడ్బందీగా ఏర్పాటుచేయాల్సి వుంది. పార్టీ అంటే పూర్తి ఆసక్తి వున్నావాళ్లని గుర్తించాల్సి వుంది. కేవలం ఎన్నికల కోసం పార్టీలోకి వచ్చి, ఆ తరువాత అనాసక్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుండిపోయినవారిని పక్కన పెట్జి, నిజంగా పార్టీ పట్ల ఆసక్తి వున్నావారికి కీలక బాధ్యతలు అప్పగించాల్సి వుంది. 

పదేళ్లపాటు అధికారానికి దూరంగా వున్నా తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రాగలిగింది అంటే అది సంస్థాగతంగా పట్టిష్టంగా వున్నందు వల్లనే. పార్టీని నడపడం అంటే తెలుగుదేశంను చూసే నేర్చుకోవాలి. పార్టీ అఫీసు అంటే నాయకులు ఖాళీగా వున్నపుడు వచ్చి, కాస్సేపు కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుని పోయేది కాదు. రాజకీయ పార్టీ కార్యాలయాన్ని కూడా కార్పొరేట్ స్థాయిలో, అన్ని విధాలా బలంగా, సమాచార కేంద్రంగా, కార్యకర్తలకు, నాయకులకు దిక్సూచిగా నడపొచ్చు అని సాధ్యం చేసి చూపిన చంద్రబాబును కచ్చితంగా మెచ్చుకోవాలి. ఆ తరహా పార్టీ కార్యాలయ నిర్మాణం పట్ల జగన్‌కు ఏ మాత్రం ఆసక్తి వున్నట్లు కనిపించడం లేదు. 

అసలు పార్టీ కార్యాలయం ఏమిటో, దానికి ఎవరు బాధ్యులో ఎవరికీ అర్థం కాదు. ఆ మధ్య కర్ణాకర్ణిగా విన్న సంఘటన. తెలుగుదేశం నుంచి వైకాపాలోకి వచ్చిన ఓ ఉత్తరాంధ్ర మీడియం రేంజ్ నాయకుడు హైదరాబాద్ వచ్చారు. జగన్‌ను కలవాలని ప్రయత్నం చేశారు. ఎవరూ సరియైన సమాధానం ఇచ్చేవారు లేరు. మాట్లాడేవారు లేరు. చివరకు రెండు మూడు రోజులకు విసిగాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం తలుపు తట్టాడు. చకచకా, అంచెలంచెలుగా అందరూ కలిసారు..అయిందేదో అయింది..హాయిగా పార్టీ తరపున పనిచేయ్..నీ సంగతి మేం చూసుకుంటాం అన్న అభయం లభించింది. ఇలా అయితే ఎలా? ఇప్పుడు తాజగా అరకు ఎంపీ గీత పరిస్థితి తెలిసిందే. జగన్ పర్యటన వివరాలు తనకు తెలియవని, అసలు పార్టీ నుంచి సమాచారమే లేదని వాపోయారామె. ఆమె ఓ ఎంపీ. పార్టీ ఎంపీ పరిస్థితే ఇలా వుంటే, ఇంక మిగిలిన వారి సంగతేమిటి? రాష్ర్టవ్యాప్తంగా పార్టీ యంత్రాగాన్ని, కేంద్ర పార్టీ కార్యాలయంలో ఓ సిస్టమ్‌ను అభివృధ్ది చేసే ఆలోచన జగన్ ఎందుకు చేయడం లేదు? అసలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు. కేవలం తనను చూసి మాత్రమే ఓట్లు వేస్తారన్న భ్రమలోంచి ఎందుకు ఆయన బయటకురావడం లేదు? ప్రజలను ఆకట్టుకోవడం వేరు, ఆ ఆకర్షణను ఓట్లుగా మార్చుకోవడం వేరు అని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?

మీడియా మేనేజ్మెంట్

జగన్ పార్టీ వ్యవహారాలు ఇలా వుంటే మీడియా వ్యవహారాలు కూడా అంతకు అంతా అలాగే అఘోరించాయి. జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్తారు. సాక్షిలో వార్త వస్తుంది. మిగిలిన పత్రికలకు సమాచారమే తెలియదు. పోనీ జగన్ అంటే పడని పత్రికలు ప్రచురించవు..లేదా ప్రాధాన్యత ఇవ్వవు అనుకుందాం. కానీ మిగిలిన పత్రికలు కూడా వున్నాయి కదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నిత్యం గంట గంటకు ఏదో ఒక సమాచారం, ఫొటోలు మీడియాకు అందుతూనే వుంటాయి. నాయకులు ప్రెస్ మీట్ పెడతారు. మీడియా ప్రతినిధులు వస్తారు. అయినా మళ్లీ ప్రెస్ నోట్ సమగ్రంగా తయారై కార్యాలయాలకు చేరుతుంది. ఇలా ఎంత పకడ్బందీగా వుంటుందో వ్యవహారం. ఈ విధమైన మీడియా సెల్ ను పార్టీ ఆఫీసులో ఎందుకు తయారుచేసుకోలేకపోతున్నారు. నా కోడి, నా కుంపటి అన్నట్లు, తాను,తన సాక్షి వుంటే చాలనుకుంటున్నారా? 

సోషల్ మీడియా

సోషల్ మీడియా పాత్ర ఇటీవల ఎన్నికల్లో ఏ మేరకు అన్నది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ తరపున అనేకానేక పేర్లతో ఫేస్‌బుక్ పేజీలు ఏర్పాటు చేసి, ఆకర్షణీయమైన చిత్రాలు, స్లోగన్‌లు రూపొందించి, ఏ మేరకు ప్రచారం సాగించారో కూడా తెలిసిందే. ఇదంతా ఓ టీమ్ వర్క్. ఇటీవలే లోకేష్ ఆ టీమ్‌ను కలిసి ప్రత్యేకంగా అభినందించారు కూడా. సాంప్రదాయ రాజకీయాలు చేసే కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాను వాడుకుంటున్నాయి. కానీ జగన్ వాడుతున్న దాఖలాలు కనిపించవు. పేరుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఐటి విభాగం అని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల బృందం ఒకటి వుంది. ఎన్నికల సమయంలో అది పోషించిన పాత్ర నామమాత్రం. ఆ తరువాత ఏమయిందో కూడా ఎవరికీ తెలియదు. ఇటీవల పలు ప్రాంతాల్లో వైకాపా జనాలపై దేశం జనాల దాడులు జరిగాయి. చాలా మంది మరణించారు.పలువురు గాయపడ్డారు. సోషల్ మీడియాను వాడుకుని వాస్తవాలను జనం ముందుకు తేగలిగారా అంటే లేదు. ఢిల్లీ వెళ్లి రాష్ర్టపతికి ఓ వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఏమిటి ఫలితం? అసలు ఏది ఫలితం ఇస్తుంది?

ఎన్నాళ్లీ ఒంటరి పోరు

ఇప్పటికీ జగన్ అంతా తానే, ఇది తన స్వంత పోరు అన్న తీరులోనే ముందుకు వెళ్తున్నారు. మహా అయితే అంబటి రాంబాబు, మైసూరా, వాసిరెడ్డి పద్మ. కానీ ఎక్కడిక్కడ నాయకులను తయారుచేయడం, నిత్యం వారిని సమన్వయం చేయడం, వారితో ఎక్కడి సమస్యలను అక్కడ ప్రస్తావింప చేయడం వంటి కార్యక్రమాలు ఏమీ చేపట్టడం లేదు. అధికారంలోకి వచ్చి నెల అయింది, ఇది చేయలేదు..అది చేయలేదు..అని జగన్ తరచు చంద్రబాబును విమర్శించడం కాదు, తన పార్టీ అభివృద్ధికి తానేం చేస్తున్నారో ఓ సారి గమనించుకోవాలి. రుణాల మాఫీపై రైతులతో కలిసి ఉద్యమిస్తామంటున్నారు. రైతులను సమీకరించేదెవరు..ఉద్యమాలు నిర్వహించేదెవరు?

నేనింతే..ఇలాగే వుంటాను..అని అనుకుంటే జగన్ ఎప్పటికీ విజయం సాధించడం అన్నది అసాధ్యం అవుతుంది. పార్టీని సమర్థంగా రూపొందించి, బలాన్ని, బలగాలను పెంపొందించుకుంటేనే ఆయనకు కాస్తయినా రాజకీయ జీవితం వుంటుంది. లేకుంటే ఎదురుదెబ్బలు తింటూ, ఒక అడుకు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతుంది.

చాణక్య

[email protected]