సినిమా వాళ్ల భూ బాగోతాలు

నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు వార్తల కెక్కింది. అసలు ఏం జరుగుతోంది..ఏమిటిదంతా..ఎందుకిదంతా?  Advertisement ఒకటైతే వాస్తవం గడచిన పాతిక, ముఫై ఏళ్లలో సీమాంధ్రకు చెందిన తెలుగు చలన చిత్ర ప్రముఖలు ప్రభుత్వం ఏదైనా విపరీతంగా…

నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు వార్తల కెక్కింది. అసలు ఏం జరుగుతోంది..ఏమిటిదంతా..ఎందుకిదంతా? 

ఒకటైతే వాస్తవం గడచిన పాతిక, ముఫై ఏళ్లలో సీమాంధ్రకు చెందిన తెలుగు చలన చిత్ర ప్రముఖలు ప్రభుత్వం ఏదైనా విపరీతంగా లబ్దిపొందారన్నది. కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వాళ్ల ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన తరువాత సినిమా పరిశ్రమ ఏకతాటిపై ఆయన వెనుక నిల్చుంది. ఆయన కూడా చేతికి ఎముకలేకుండా వాళ్లకు కట్టబెట్టాల్సినవి అన్నీ కట్టబెట్టారు. ఐమాక్స్ వ్యవహారంపై మరణించిన జనార్థనరెడ్డి ఎంత గోలపెట్టాలో అంతా పెట్టారు.  ఐమాక్స్ ఎదురుగా వున్న పార్కింగ్ స్థలంపై కూడా ఆయన గోల పెట్టారు. కానీ ప్రభుత్వాలు తమ చిత్తానికి వ్వవహరించాయి. 

కీలకమైన బంజారాహిల్స్ లో అన్నపూర్ణ స్టూడియో, దానికి కాస్త అవతలగా సుజనా చౌదరి స్థలం, పక్కన తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఆ పక్కన ప్రసాద్ ల్యాబ్, దాని పక్కనే ప్రసాద్ ఐ హాస్పిటల్, దాని ఎదురుగానే రాఘవేంద్రరావు సినిమా కాంప్లెక్స్ ఇవన్నీ ప్లాన్డ్ వ్వవహారాలు, పంపకాలు అని ఎవరికైనా అనుమానాలు రావడం సహజం. పైగా ఇవన్నీ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారికి కావడం యాధృచ్చికమా? ప్రభుత్వాలు తమ చిత్తానికి ధారా ధత్తం చేసాయి. 

సరే అన్నపూర్ణ, ఎన్టీఆర్ భవన్, ప్రసాద్ ల్యాబ్, ఐ హాస్పిటల్ తమ తమ ఆశయాలకు, దరఖాస్తులకు అనుగుణంగా నిర్మాణాలు సాగించాయనుకుందాం. మరి ఆర్ కె కాంప్లెక్స్ మాటేమిటి? అందులో వున్న బార్, ప్లే జోన్, థియేటర్లు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏ విధంగా సాయం చేస్తాయి. పేరుకు అందులో టాప్ ఫ్లోర్ లో కోన్ని సినిమా సంస్థల బోర్డులు మాత్రం పెట్టారు. దీనిపై గతంలో హరీష్ రావు నానా హడావుడి చేసారు. తరువాత చప్పున చల్లారారు. మరి ఇప్పుడు ఆయన మంత్రి. వాళ్ల ప్రభుత్వం వుంది. నిజానిజాలు వెలికి తీయాల్సిన బాధ్యత వుంది కదా? 

సినిమావాళ్ల ఫిల్మ్ నగర్ విషయంలో కూడా అనేక అవకతవకలు జరిగాయని గతంలో ఆరోపణలు వినిపించాయి. పెద్దలెందరో బినామీ పేర్లతో చాలా స్థలాలు పోందారని వార్తలు వినవచ్చాయి. వేటూరి లాంటి వారికే స్థలాలు దక్కలేదు. ఇప్పుడు సమయం, సరైన పభుత్వం వచ్చింది కాబట్టి, అన్నింటిపై విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీయాల్సి వుంది. 

ఎవరు ప్రముఖులైతే వాళ్లకి స్థలాలు చిత్తానికి ఇచ్చేసారు. అది కూడా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, లాంటి ఖరీదైన ప్రాంతాల్లోనే. అన్నింటా నిబంధనలు సక్రమంగానే వుంటాయి. కానీ సామాన్యుడికైతే అలా ఇస్తారా అన్నది అనుమానం. రోడ్డు విస్తరణలో సామాన్యుడి స్థలం పోతే నాలుగు పైసలు విదిలించేస్తారు.అదే రాజకీయ ప్రాపకం వున్నవాళ్లయితే సైలెంట్ గా వుంటారు. పరిహారం తీసుకోరు. మాంచి స్థలం చూసి, పభుత్వానికి అర్జీ పెడతారు. తమ స్థలానికి బదులుగా ఫలానా స్థలం ఇమ్మని. వడ్డించేవాడు మన వాడు కాబట్టి ఫైళ్లు చకచకా కదులుతాయి. నిబంధనలకు అనుగుణంగా రేట్ల నిర్ణయం జరిగిపోతుంది. అసలు రేట్లు, అసలైన వారికి అందిపోతాయి. స్థలం చేతులు మారిపోతుంది. హైదరాబాద్ లో స్థలం పోతే విశాఖలో స్థలం కట్టబెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఇప్పుడు నాగ్ ఎన్ కన్వెన్షన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇదే ఏ బొత్స లాంటి రాజకీయ నాయకుడిదైతే మీడియా కూడా రెచ్చిపోతుంది. మీడియా కూడ పారలల్ గా పరిశోధన ప్రారంభించి, నిజాలు వెలికి తీస్తుంది. కానీ సినిమా వాళ్లు అనేసరికి ఎందుకో మీడియా నీరుగారి వుండిపోతుంది. కెసిఆర్ పగతో చేసినా, ప్రభుత్వ స్థలాలపై భక్తితో చేసినా, ఈ పని కొస వరకు నెగ్గిస్తే  మంచిది. సగంలో ఆపేస్తే, జనం అనుమానపడతారు..ఇక్కడా ఏదో జరిగిందని. అందువల్ల పనిలో పనిగా తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు వగైరాలు చేసిన ఆరోపణలపై కూడా కెసిఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుని ముందుకు వెళ్లే అసలు సంగతులు బయటకు రావచ్చు. భూబాగోతాలు బయటపడొచ్చు.

చాణక్య

[email protected]