నిప్పులు చిమ్ముతూ నింగికి..

పీఎస్‌ఎల్‌వీ.. భారతీయ అంతరిక్ష పరిశోధనా రంగంలో అత్యంత నమ్మకమైన రాకెట్‌ ఇది. ఈసారీ కోట్లాదిమంది భారతీయుల నమ్మకాన్ని నిజం చేస్తూ, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసింది పీఎస్‌ఎల్‌వీ. ఐదు  విదేశీ శాటిలైట్లనూ, ఒక స్వదేశీ…

పీఎస్‌ఎల్‌వీ.. భారతీయ అంతరిక్ష పరిశోధనా రంగంలో అత్యంత నమ్మకమైన రాకెట్‌ ఇది. ఈసారీ కోట్లాదిమంది భారతీయుల నమ్మకాన్ని నిజం చేస్తూ, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసింది పీఎస్‌ఎల్‌వీ. ఐదు  విదేశీ శాటిలైట్లనూ, ఒక స్వదేశీ శాటిలైట్‌నీ అంతరిక్షంలోకి తీసుకెళ్ళిన పీఎస్‌ఎల్‌వీ, ఇస్రో వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ పీఎస్‌ఎల్‌వీ ‘హుందాగా నింగిలోకి ఎగిసిపోవాన్ని’ ప్రత్యక్షంగా వీక్షించారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఈ ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పొందారు. అన్ని దశల్నీ విజయవంతంగా అధిగమించిన రాకెట్‌, ఇస్రో చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రయోగం సఫలమవడం పట్ల ఇస్రో వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

‘దేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో అత్యంత వేగంగా పయనిస్తోందనడానికి తాజా ప్రయోగం నిదర్శనం. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ఎంతగా ప్రశంసించినా తక్కువే. మరిన్ని ప్రయోగాలతో ప్రపంచంలో మేటిగా భారత అంతరిక్ష రంగం ఎదగాలని ఆశిస్తున్నా..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన అనంతరం ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోగల శ్రీహరికోట షార్‌ కేంద్రం ఈ అద్భుతానికి వేదికైంది. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, /జితేంద్ర  సింగ్, గవర్నర్ నరసింహన్ తదితరులు రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా  వీక్షించారు.