''ప్రేమంటే ఇదేరా'', ''రాజకుమారుడు'' తెలుగు సినిమాలలో నటించిన హిందీ నటీమణి ప్రీతి జింటా అందరికీ తెలిసిన వ్యక్తే. బాంబే డైయింగ్ సొంతదారులైన వాడియా కుటుంబానికి చెందిన నెస్ వాడియాతో ఆమె ప్రేమవ్యవహారం కూడా అందరికీ తెలిసినదే. వారి మధ్య కొన్నాళ్లు స్నేహం- కొన్నాళ్లు దూరంగా నడుస్తున్న వ్యవహారం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. మే 30న అతను తన పట్ల బహిరంగంగా క్రికెట్ స్టేడియంలో అసభ్యంగా ప్రవర్తించాడని, తన శీలహరణానికి ప్రయత్నించాడని ప్రీతి కేసు పెట్టి అమెరికాకు వెళ్లిపోయింది. సంఘటన జరిగిన రెండు వారాలకు జూన్ 13 అర్ధరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టేసి, మర్నాడే లాస్ ఏంజిలిస్‌లోని తన తమ్ముడి యింటికి వెళ్లి కూర్చుని ట్వీట్లు దంచేస్తూంటే ముంబయి పోలీసులు 'అలా కుదరదు, యిక్కడకు వచ్చి విచారణకు సహకరించు' అని చెప్పారు. ఇక తప్పక, తిరిగి వచ్చి జూన్ 24 న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫలానా విధంగా నన్ను హింసించాడు, దానికి ఫలానావారు సాకక్షులు అని స్టేటుమెంటు యిచ్చింది. సెలబ్రిటీల మధ్య ప్రేమ వ్యవహారాలు నడిచినంతకాలం నడిచి, సడన్‌గా చెడిపోవడం కూడా ఎప్పణ్నుంచో చూస్తూన్నాం. కానీ యిలా బొత్తిగా 354, 509, 504, 506 సెక్షన్ల కింద కేసు పెట్టడం మాత్రం ఎన్నడూ చూడలేదు. వీళ్లిద్దరి మధ్య నడిచిన కథ ఎలాటిది? ఎందుకీ మలుపు తిరిగింది?
ధైర్యానికి మారుపేరు ప్రీతి
వాళ్లిద్దరూ 2005 ఫిబ్రవరిలో ఒక పార్టీలో కలిశారు. అప్పటికి ఆమెకు 29 ఏళ్లు. పెద్ద స్టార్. గత రెండేళ్లగా ఆమె హీరోయిన్‌గా నటించిన ''కోయీ మిల్ గయా'' రూ. 80 కోట్ల బిజినెస్ చేసింది. ''కల్ హో న హో'' రూ. 93 కోట్లు, ''వీర్ ఝారా'' 88 కోట్లు. అన్నిటికంటె ముఖ్యంగా దైవం ఆమె పట్ల వున్నాడని డిసెంబరు 2004 సునామీ నిరూపించింది. సునామీ వచ్చినపుడు తన బాల్యస్నేహితులతో కలిసి ఆమె థాయ్‌లాండ్ బీచ్‌పై నడుస్తోంది. సునామీ శబ్దం విని ఆమె దూరంగా పరిగెట్టి ప్రాణాలు దక్కించుకుంది. ఆమె స్నేహితులందరూ కొట్టుకుపోయారు. మరొకరైతే పిచ్చెక్కిపోయేవారు. కానీ ప్రీతి తట్టుకుంది. నిజానికి ఆమె చాలా ధైర్యవంతురాలు. హిందీ సినిమారంగానికి, ముంబయిలోని అండర్ వరల్డ్‌కు లింకును బయటపెట్టిన భరత్ షా కేసులో ఛోటా షకీల్ అనే డాన్‌కు వ్యతిరేకంగా ఆమె సాక్ష్యం చెప్పింది. సల్మాన్, షారుఖ్ వంటి తక్కిన సాకక్షులందరూ భయపడి మాట మార్చారు కానీ ఆమె మాత్రం తనకు ఒక గూండా ఫోన్ చేసి 'నేను రజాక్ అని భాయ్ మనిషిని. నాకు 50 లక్షలు కావాలి' అని అడిగాడు అని తెగేసి చెప్పేసింది. ఆమె తన స్టేటుమెంటు రికార్డు చేసిన తర్వాత ఆమెపై దాడి జరుగుతుందని భయపడిన అప్పటి ముంబయి పోలీసు కమిషనర్ రాకేష్ మారియా కోర్టులో సాక్ష్యం చెప్పేవరకు రెండు నెలల పాటు రక్షణ కల్పించాడు. ఒక సినిమాతారకు యిలాటి విషయాల్లో ఎంతో భయం కలుగుతుంది. కోర్టులో సాక్ష్యం చెప్పే సమయంలో ఎవరైనా మొహంపై కాస్త యాసిడ్ పోసినా చాలు ఆమె కెరియర్ నాశనమై పోతుంది. అయినా ఆమె బెదరకుండా వాస్తవాలు చెప్పింది.
ఇద్దరూ అనుభవజ్ఞులే…
ఇక నెస్ వాడియా – వాడియా గ్రూపు చాలా తరాలుగా పెద్ద వ్యాపారస్తులు. బాంబే డైయింగ్‌తో బాటు వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయి. నెస్, అతని తమ్ముడు జహంగీర్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాళ్ల తల్లి మౌరీన్ కూడా సోషల్ లేడీయే. వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తే. 35 ఏళ్ల నెస్ అందగాడే. ప్రీతి, అతను ఒకరి నొకరు యిష్టపడ్డారు. కలిసి తిరగసాగారు. రెండు నెలల తర్వాత వైష్ణోదేవికి ప్రీతి తల్లి నీలప్రభతో కలిసి వెళ్లారు. నెస్ తల్లికి వీరిద్దరూ కలిసి తిరగడం అభ్యంతరకరంగా తోచలేదు. ''ఇద్దరూ మంచి జోడీయే'' అందామె. నెస్ అంతకముందు అమిషా పటేల్, మనీషా కోయిరాలా, లారా దత్తా వంటి హిందీ సినిమా హీరోయిన్లతో కలిసి తిరిగాడు. ఇక ప్రీతి విషయానికి వస్తే డచ్ దేశస్తుడైన ఇంజనియర్ లార్స్ జెడ్‌సన్‌తో తిరిగింది. (తర్వాత అతను సుచిత్రా పిళ్లయ్‌ను పెళ్లాడాడు). మార్క్ రాబిన్‌సన్ అనే డాన్సర్‌తో కూడా తిరిగింది. గతం మాట ఎలా వున్నా ప్రీతి, నెస్ తలమునకలా ప్రేమలో పడ్డారు. ''సలాం నమస్తే'' సినిమా షూటింగుకై ఆమె ఆస్ట్రేలియాకు వెళితే అక్కడ బిజినెస్ పని కల్పించుకుని నెస్ కూడా తయారయ్యాడు. ఆ సినిమాలో ఓ అతిథి పాత్ర వేశాడు కూడా. ''కభీ అల్‌విదా న కెహనా'' షూటింగ్‌కై న్యూయార్క్ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు యూరోప్‌లో ఒక వారం వుండిపోయారు.
సల్మాన్ డాబులతో ప్రీతికి చిక్కులు..
ఈ ప్రేమ వ్యవహారంలో పడి నెస్ బొంబాయి బయటే తిరుగుతూండడంతో అతని తమ్ముడు జహంగీర్ తన తిరుగుళ్లు కట్టిపెట్టి వ్యాపారంపై దృష్టి పెట్టాడు. గోఎయిర్ ఎయిర్‌లైన్సు ప్రారంభించాడు. టీనా అంబానీలాగే ప్రీతి కూడా యిక బిజినెస్ ఫ్యామిలీలోకి వెళ్లిపోతుందేమో అనుకునే సమయంలో ''హిందూస్తాన్ టైమ్స్'' వేసిన కథనం ప్రీతిని యిబ్బంది పెట్టింది. నటుడు సల్మాన్ ఖాన్ ఐశ్వర్యా రైతో జరిపిన సంభాషణలున్న టేపులు అంటూ ఆ పత్రిక జులై 2005లో ప్రచురించింది. దానిలో సల్మాన్ ఐశ్వర్యను అండర్ వరల్డ్ పేరు చెప్పి బెదిరించాడు, మాటల్లో ''చోరీ చోరీ చుప్‌కె చుప్‌కె'' నిర్మాణసమయంలో తను ప్రీతిని అనుభవించానని చెప్పుకున్నాడు. ఈ వార్త బయటకు వచ్చినపుడు ప్రీతి ఇటలీలో వుంది. కంగారుపడి ఐశ్వర్యకు ఫోన్ చేసి 'ఈ టేపులు నకిలీవేమో కనుక్కో' అంది. 'కాదనుకుంటా' అంది ఐశ్వర్య. అయినా ప్రీతి ఆ పత్రికపై పరువునష్టం దావా వేసింది. కోర్టువాళ్లు ఫోరెన్సిక్ లాబ్ వాళ్లను నిర్ధారించమన్నారు. వాళ్లు ఆ టేపులు నకిలీవే అని చెప్పారు. ఈ గొడవ కారణమో ఏమో తెలియదు కానీ 2006లో నెస్, ప్రీతి కలిసి తిరగడం తగ్గింది. జహంగీర్ బాంబే డైయింగు ఎండీ అయ్యాడు. నెస్ మిల్లు భూములు, సెంచరీ మిల్సు కాంప్లెక్స్‌పై బికె బిర్లా కుటుంబంతో వ్యాజ్యం వీటితో సతమతమవుతున్నాడు. ప్రీతి, నెస్ తల్లి మారీన్ యిద్దరూ కలిసి మిసెస్ గ్లాడ్‌రాగ్స్ పోటీలు పెడుతూ ఆత్మీయత పెంచుకున్నారు.
శేఖర్ కపూర్‌తో ఉన్నట్టా? లేనట్టా?
2007లో ఐశ్వర్య-అభిషేక్ పెళ్లికి నెస్, ప్రీతి కలిసి వెళ్లారు. తర్వాతి పెళ్లి వీళ్లదే అని అంతా అనుకుంటూన్న సమయంలో గాయని, నటీమణి అయిన సుచిత్రా కృష్ణమూర్తి వివాదం బయటకు వచ్చింది. తనూ, తన భర్త డైరక్టర్ శేఖర్ కపూర్ విడిపోవడానికి కారణం ప్రీతియే అని సుచిత్ర ఆరోపించింది. తన భర్తకూ, ప్రీతికీ అక్రమ సంబంధం వుందని ఆమె అభియోగం. ఆ వార్త పేపర్లో రాగానే ప్రీతి సుచిత్రకు ఫోన్ చేసి 'నేను యిప్పుడు నెస్‌ను పెళ్లి చేసుకోబోతున్నాను. నా తరఫున ఫ్రెండ్‌గా రమ్మనమని శేఖర్‌ను కోరాను.' అని చెప్పిందట. ఈ విషయం సుచిత్రయే పేపర్లకు చెప్పింది. ఇది జరిగిన మూణ్నెళ్లకు అంటే 2007 జూన్‌లో ప్రీతి, నెస్ స్పెయిన్‌లో విజయ్ మాల్యా యిచ్చిన యాచ్ పార్టీలో హంగామా చేశారు. ఇవన్నీ నెస్ తల్లికి రుచించలేదు. ''మీ అబ్బాయి పెళ్లి సంగతేమిటి?'' అని ఎవరో అడిగితే ''మా వాడు జింటాను చేసుకున్నా జీబ్రాను చేసుకున్నా నేను పట్టించుకోను.'' అందావిడ.
పాత్రతో తాదాత్మ్యం
ప్రీతి గ్లామర్ హీరోయిన్‌గా నటించిన ''ఝూమ్ బరాబర్ ఝూమ్'' ఫ్లాపు కావడంతో సినిమా పార్టీలు కట్టిపెట్టి బిజినెస్ సెలబ్రిటీల్లా గుఱ్ఱాల పోటీకి వెళ్లనారంభించింది. నెస్‌తో కలిసి క్రికెట్‌లో ఐపియల్‌కై టీము తయారుచేయ నారంభించింది. ఇదే సమయంలో నటిగా తనను తాను తృప్తి పరచుకోవడానికి ఆమె తన యిమేజిని మార్చుకుని అర్థవంతమైన ఆర్ట్ ఫిలింస్ వైపు మొగ్గింది. గృహహింసకు గురైన మహిళల గురించి దీపా మెహతా ''హెవెన్ ఆన్ ఎర్త్'' అనే ఇండో-కెనడియన్ సినిమా తీస్తూంటే (హిందీలో ''విదేశ్'' పేరుతో డబ్ అయింది) ఆమె ప్రధాన పాత్ర ధరించింది. ఆ సినిమాలో నటించిన కెనడా దేశపు మహిళలతో ముచ్చటిస్తూ వుంటే హఠాత్తుగా ఆమెకు ఆత్మసాక్షాత్కారం వంటిది కలిగింది – తనూ కూడా ప్రేమ పేరుతో హింసకు గురవుతున్నానని, నెస్ తనపై అధికారం చెలాయిస్తూ అప్పుడప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని! ఆ సినిమా గురించి, పాత్ర గురించి విన్న నెస్ యీ సినిమా ద్వారా ప్రీతి తనకు ఒక హెచ్చరిక పంపుతున్నట్లుగా ఫీలై, 2008 ఏప్రిల్‌లో ''విదేశ్'' సినిమా స్క్రీన్ చేసినపుడు కోపంతో ప్రీతి చెంప ఛెళ్లుమనిపించాడని పుకార్లు వచ్చాయి. వాళ్ల మధ్య కలహాలు, రాజీలు రొటీన్ అయిపోయాయి.
వీటి మధ్యనే కింగ్స్ లెవెన్ పంజాబ్ టీములో వాళ్లిద్దరూ చెరో 23% వాటా తీసుకోవడం జరిగింది. డాబర్ గ్రూపు భాగస్వామి, లలిత్ మోదీకి అల్లుడి వరస అయ్యే గౌరవ్ బర్మన్ 23%, అతని సోదరుడు మొహిత్ బర్మన్ 11.5% తీసుకోగా మిగతావాళ్లందరూ చిన్న వాటాదార్లే. ఆ టీము ఏర్పడిన దగ్గర్నుంచి ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. ఎప్పుడూ నష్టాలే. 2009 వచ్చేసరికి ప్రీతి తన ప్రేమ వ్యవహారంపై మొహం మొత్తింది. ప్రేమకోసం తన కెరియర్‌ను నాశనం చేసుకున్నాననుకుంది. ఆమె స్థానంలో ప్రియాంకా చోప్డా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ వచ్చేశారు. శారీరకంగా, మానసికంగా అలసిపోయిన ప్రీతి విదేశీ యాత్రలు చేయసాగింది. మలైకా అరోడా, గౌరీ ఖాన్‌లతో లండన్‌లో కొన్నాళ్లు పచార్లు చేసింది. లాస్ ఏంజిలిస్‌లో తమ్ముడి వద్ద కొన్నాళ్లు వుంది. సురీలీ గోయల్‌తో పారిస్‌లో వుంది. 2009 ఎన్నికలలో కాన్పూరులో కాంగ్రెసు అభ్యర్థికై ప్రచారం చేసింది.
నెస్ తెచ్చిపెట్టుకున్న గండం
ఈ లోపున నెస్ ప్రీతిని మర్చిపోయి థాపర్ గ్రూపుకి వారసురాలైన ఆయేషా థాపర్‌తో తిరగసాగాడు. అతని అహంభావాన్ని బయటపెట్టే సంఘటన ఒకటి 2009లోనే జరిగింది. అతనూ, మొహిత్ బర్మన్, జోహానన్స్‌బర్గ్ స్టేడియంలో విఐపి లాంజ్‌లో కూర్చుని ఆట చూస్తూండగా వాళ్ల ముందు వరుసలో ఒకమ్మాయి నిలబడి ఆట చూస్తోంది. నాకు అడ్డు వస్తున్నావు తప్పుకో అంటూ తాగి వున్న మొహిత్ ఆ అమ్మాయిని అదలించాడు. ఆ అమ్మాయి పట్టించుకోలేదు. అప్పుడు అతను వాళ్ల టీము జండా కర్రతో ఆమె పిరుదులపై పొడవసాగాడు. కాస్సేపు వూరుకున్నా యింకా అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తన సెక్యూరిటీ గార్డులను పిలిచింది. ఆ అమ్మాయి సహారా గ్రూపుకి చెందిన దక్షిణాఫ్రికాలోనే బిజినెస్‌మన్ అజయ్ గుప్తా కూతురు. మొహిత్ చేసినదానిలో తప్పు లేదని నెస్ వాళ్లతో వాదించాడు. దాంతో ఒళ్లు మండిన సెక్యూరిటీ గార్డులు, పోలీసులు వీళ్లిద్దరినీ చావగొట్టారు. అజయ్ గుప్తా తన స్నేహితుడైన సౌత్ ఆఫ్రికా అధ్యకక్షుడితో చెప్పి వీళ్లను దేశం నుంచి వెళ్లగొట్టించబోయాడు. లలిత్ మోదీ వీళ్ల తరఫున రాయబారం నడిపి, వీళ్లను అజయ్ గుప్తా యింటికి పంపాడు. వీళ్లు చేసినదానికి లెంపలేసుకుని రాతపూర్వకంగా కూడా క్షమాపణ చెప్పి సర్దుబాటు చేసుకున్నారు. ఇదంతా పేపర్లలో వచ్చింది.
వ్యాపారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రీతి
ప్రీతికి తన అనుమానాలు నిజమేననిపించాయి. ఇలా తెగిన గాలిపటంలా తిరిగేబదులు క్రికెట్ టీము బిజినెస్ గురించి గట్టిగా పట్టించుకుంటే మంచిది కదా అనుకుంది. హార్వార్డు యూనివర్శిటీకి వెళ్లి డీల్ నెగోషియేషన్స్‌లో ఒక కోర్సు చేసింది. ఇండియాకు తిరిగి వచ్చి తన టీమును ప్రమోట్ చేయడానికి నానా కష్టాలు పడింది. ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించడాలు, ఆటగాళ్ల భార్యలతో ఫోటోలు దిగడాలు, మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లను ఉత్సాహపరచడాలు అవన్నీ చేసేది. ''మాలో ఉత్సాహం నింపినది ప్రీతి మాత్రమే'' అంటారు ఆ టీము ఆటగాళ్లు. తక్కిన భాగస్వాములెవరూ విఐపి గ్యాలరీ దిగి రాలేదు సరికదా స్వయంగా వ్యాపారవేత్తలై వుండి కూడా ఆర్థికపరమైన విషయాలను పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి బాలన్స్ షీట్లు, ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్‌స్ సబ్మిట్ చేయకపోవడంతో చండీగఢ్ కోర్టు 2010లో ప్రీతి, నెస్, మొహిత్‌లపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది. దీనికి తోడు ఎన్‌విడి సోలార్ అనే కంపెనీతో జరిపిన లావాదేవీలపై కూడా నీలినీడలు ప్రసరించాయి. ఇక అప్పణ్నుంచి ఆ వ్యాపారం మూసేసి షేర్లు యితరులకు అమ్మేద్దామని నెస్, అతని స్నేహితులు ప్రకటించసాగారు. కానీ అప్పటికే లలిత్ మోదీ వ్యవహారాలపై విచారణ జరుపుతున్న బిసిసిఐ, అతనికి, యీ టీముకి లింకులున్న అనుమానంతో అనుమతి యివ్వలేదు. కంపెనీ నష్టాల్లోనే నడుస్తోంది.
నెస్‌కైతే యితర వ్యాపారాలున్నాయి. ప్రీతికి సినిమాలు కూడా లేవు. ఏదో ఒక యాక్టివిటీ వుండాలి. గతంలో కెమాల్ అమ్రోహీ కుటుంబానికి రూ. 2 కోట్లు అప్పు యిస్తే వాళ్లు తిరిగి యివ్వలేదు. వాళ్లపై కేసు పెట్టింది. ఖార్‌లో తన ఎపార్ట్‌మెంట్ అద్దెకివ్వబోయింది. సెంట్రల్ బ్యాంక్ నుండి రూ. 10 కోట్లు అప్పు చేసి ''ఇష్క్ యిన్ పారిస్'' సినిమా తీస్తే రూ. 3 కోట్లు మాత్రమే తిరిగి వచ్చింది. స్రిప్టు రచయిత అబ్బాస్ టైర్‌వాలా తనకు ప్రీతి రూ.18 లక్షలు యివ్వాలంటూ కేసు పడేశాడు. ఇలా డబ్బు వ్యవహారాలతో సతమతమవుతూనే కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను ప్రమోట్ చేస్తూనే వుంది. ఎట్టకేలకు స్థాపించిన ఏడేళ్లకు రూ.78 లక్షల లాభం చవి చూసింది ఆ కంపెనీ. ప్రీతి కారణంగానే యిది సాధ్యపడుతుందని అందరూ అంటున్న సమయంలో ఆమె నెస్‌పై కక్ష సాధించబూనినట్లు అనిపిస్తోంది.
గర్‌వారే స్టేడియంలో జరిగిన ఘటన
మే 30 న గర్‌వారే స్టేడియంలో ఐపియల్ క్వాలిఫైయర్ 2 జరుగుతూండగా ప్రీతి, ఆమె సన్నిహితులు విఐపి గ్యాలరీలో సీట్లన్నీ ఆక్రమించుకుని కూర్చున్నారు. ఆ రోజు నెస్ బర్త్‌డే కావడంతో బర్త్ డే పార్టీ ముగించుకుని, తల్లి, మేనల్లుడితో నెస్ ఆలస్యంగా సాయంత్రం 8.15కి వచ్చాడు. మొదటి వరసలో తన కోసం రిజర్వ్ చేసుకున్న సీట్లలో ప్రీతి, టీము సభ్యుడైన సౌత్ ఆఫ్రికా డేవిడ్ మిల్లర్ కుటుంబం కూర్చోవడం, తమను చూసి కూడా ఎవరూ సీట్లు ఖాళీ చేసి యివ్వకపోవడంతో మండిపడ్డాడు. టీము సిఓఓ చేత చెప్పించినా ప్రీతి ఖాతరు చేయలేదు. సీటు కోసం తన తల్లి 20 ని||ల పాటు నిలబడడంతో కోపం కట్టలు తెంచుకుంది. అందరి ముందూ ప్రీతితో ఘర్షణకు దిగాడు. ఆమె చేయి పట్టుకుని లాగాడు. బూతులు కురిపించాడు. దానికి ప్రతీకారంగా ప్రీతి యీ కేసు పెట్టింది. జూన్ 24 న ఆమె యిచ్చిన వివరణ ప్రకారం – నెస్ తనను తిట్టి, మానభంగం (!?!) చేసినదానికి 14 మంది సాక్ష్యం వున్నారు. వారిలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ ఒకడు. అక్కణ్నుంచి ఆమె నాన్ ఎసి సెక్షన్‌లోకి వచ్చి కూర్చుంటే అక్కడకీ వచ్చి తిట్టాడు. దానికి సాక్ష్యం ధనీశ్ మర్చంట్. ఆ తర్వాత గ్రౌండ్‌లోకి దిగి టీము సభ్యులతో మాట్లాడుతూంటే వారి ఎదురుగా మళ్లీ తిట్టాడు. అక్కడున్నవాళ్లు చెప్పేదాని ప్రకారం ప్రీతి కూడా తక్కువ తినలేదు. తనూ నెస్‌ను యిష్టం వచ్చినట్లు అశ్లీలపదాలతో తిట్టిపోసింది.
ఈ సంఘటనలు ఆధారంగా తను అత్యాచారానికి గురయ్యానని ఆమె కేసు పెట్టడమే వింత. పైగా రవి పూజారి అనే అండర్ వరల్డ్ గాంగ్‌స్టర్ ప్రీతి తరఫున ఇరాన్ నుంచి ఫోన్ చేసి నెస్‌ను బెదిరించడం మరీ వింత. అలా ఫోన్ చేయమని ప్రీతి కోరిందో, లేక అతను తనంతట తనే చేశాడో యింకా తెలియదు. ఇక్కడ ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. సల్మాన్ ఖాన్ – ఐశ్వర్యా టేపుల్లో అండర్ వరల్డ్‌కు, తనకు సన్నిహిత సంబంధాలున్నాయని సల్మాన్ పదేపదే చెప్పుకున్నాడు. ''హిందూస్తాన్ టైమ్స్''పై కేసు పెట్టినపుడు తనతో శారీరక సంబంధం విషయంలో సల్మాన్ అబద్ధం చెప్తున్నాడని ఆరోపించినా, ప్రీతి సల్మాన్‌తో స్నేహం వదులుకోలేదు. అతనితో ''జానేమన్'' సినిమాలో వేసింది కూడా. ఈ ఫోన్ కాల్ వెనుక సల్మాన్ ఓవరాక్షన్ వుందేమో తెలియదు. ఏది ఏమైనా ప్రీతి నిజజీవితమే సినిమాను మించిన రసవత్తరమైన కథ. ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో గమనిస్తూ వుండాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014