తృణమూల్ నాయకులు శారదా చిట్ ఫండ్ కంపెనీకి సన్నిహితంగా మెలగుతూ, వారి వేదికలపై కనబడి, 'శారదావారు నిరుద్యోగసమస్య పరిష్కరించడానికి గొప్ప సేవలు చేస్తున్నారు, మీ అందరూ వారి ఏజంట్లగా మారండి' అని ఉపన్యాసాలిచ్చినపుడు అనేకమంది గ్రామీణ మహిళలు ఆ కంపెనీకి ఏజంట్లుగా మారేరు. వాళ్లందరికీ ఏది ప్రభుత్వ కంపెనీయో, ఏది ప్రయివేటు కంపెనీయో తెలియలేదు. కంపెనీలో పెట్టిన డబ్బుకి మమతా బెనర్జీ ప్రభుత్వం హామీ వుంటుంది అనుకున్నారు. 'మీరు పెట్టిన పెట్టుబడి మూడేళ్లలో రెట్టింపు అవుతుంది, ఏడేళ్లలో నాలుగు రెట్లవుతుంది, పన్నెండేళ్లలో పది రెట్లు అవుతుంది' అని కంపెనీ చెప్తూంటే నమ్మి, తాము స్వయంగా పెట్టుబడి పెట్టి, యితరుల చేత కూడా పెట్టించారు. శారదా స్కామ్ బయటపడిన తర్వాత 10 లక్షల మంది ఏజంట్ల బతుకు బండలైంది. అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కుంటున్నారు. మహిళలైతే అదనపు ఒత్తిళ్లు కూడా! శారదా స్కాము రూ.2500 కోట్ల స్కామ్. తృణమూల్ సహాయంతో శారదా యాజమాన్యం యీ డబ్బు ఎక్కడో దాచేసిందని ప్రజలకు సందేహం. కంపెనీ చాలా పెద్దపెద్ద లాయర్లను తన తరఫున నియమించుకుని కోర్టులో పోరాడుతోంది. మాజీ కేంద్రమంత్రి చిదంబరం భార్య నళిని ఆ లాయర్లలో ఒకరు. ఇక కేసు ఎలా నడుస్తుందోనని సాధారణ ప్రజలకు బెంగ.
తనపై వస్తున్న ఆరోపణలు తప్పించుకోవడానికి మమతా బెనర్జీ 'దీనిలో పెట్టుబడి పెట్టిన వారి అసలు ధనం రాష్ట్రప్రభుత్వం యిచ్చేస్తుంద'ని ప్రకటించింది. 'ఆశపోతుతనంతో ఎవరో ఎక్కడో పెట్టుబడి పెట్టి నష్టపోతే వారికి ప్రజాధనం చెల్లించడమేమిటి? రేపు యింకో కంపెనీ కూడా యిలా చేస్తే..?' అని కొందరు విమర్శించారు. నిజానికి యిప్పటికే యిలాటి 12 చిట్ ఫండ్స్ మూతపడ్డాయి. మరి వాళ్లకీ యిస్తారా? అని అడిగారు. రాష్ట్ర పోలీసులు కుమ్మక్కవుతారని సందేహించిన సుప్రీం కోర్టు శారదా స్కాము విచారణను సిబిఐకు అప్పగించింది. అది అవమానంగా భావించిన మమత ''అయితే డబ్బు తిరిగి యిచ్చే బాధ్యత కూడా కేంద్రప్రభుత్వానిదే' అనేసింది. ఇలా డబ్బు ఎప్పుడు తిరిగివస్తుందో రాదో తెలియదు కానీ యీలోగా మహిళా ఏజంట్లను పట్టుబడి పెట్టిన మగ క్లయింట్లు వేధిస్తున్నారు. 'డబ్బు తిరిగి యివ్వకపోతే మా కోరిక తీర్చు' అంటున్నారు. మథురాపూర్‌లో యిమిటేషన్ జ్యూయలరీ తయారుచేసే ఆమె వందమందిని చేర్పించింది. ఆమె యీ బెదిరింపుల వలన పొద్దున్నే లేచి యింట్లోంచి బయటకు వెళ్లి, నిద్రపోయే వేళకే యింటికి తిరిగి వస్తోంది. మొగుడు లారీ డ్రైవర్, యింటిపట్టున దొరకడు. పిల్లలిద్దర్నీ పెళ్లయిన పెద్ద పిల్ల దగ్గరకి పంపేసింది. 100 మంది క్లయింట్లున్న ఆమెకే యీ కష్టం వుంటే 300 మందిని చేర్పించిన హాబ్రా నివాసి గతి వూహించుకోవచ్చు. 'కిడ్నాప్ చేసి రేప్ చేస్తాం జాగ్రత్త' అని బెదిరిస్తున్నారు. ఇంకొకామె విషయంలో ఆమె ఏజంటుగా చేరి డబ్బు సంపాదించినంతకాలం మౌనంగా వున్న భర్త, యిప్పుడు యీ చిక్కులు రాగానే 'ఎందుకొచ్చిన వేషాలివి, నోరు మూసుకుని కూర్చోక..' అంటూ రోజు చావగొడుతున్నాడు. దీపిక విషయంలో ఆమె తన అత్తమామలకు చెప్పి కంపెనీలో డబ్బు పెట్టించింది. ఇప్పుడు డబ్బు పోయిందని తెలియగానే ఆమెను యింట్లోంచి పొమ్మనమని వాళ్లు గోల చేస్తున్నారు. కూతురు పెళ్లికై రూ.లక్ష దాచుకున్న ఒకామె పరిస్థితి మరీ ఘోరం. ఆమె కూతురి పెళ్లి ఆగిపోయింది. సొమ్మూ పోయి దుమ్మూ పట్టె అంటే యిదే కాబోలు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)