హైదరాబాద్..ఓ బలహీనత

గచ్చిబౌలి వదిలి వెళ్లలేరు..ఆంధ్రకేం వెళతారు?అని సూటిగా అడిగేసారు తెలంగాణ మంత్రి కె టి రామారావు. హైదరాబాద్ లో వున్న సంస్థలు ఆంధ్రకు తరలిపోతాయని వినవస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అన్న మాటలు కాస్త ఆలోచన…

గచ్చిబౌలి వదిలి వెళ్లలేరు..ఆంధ్రకేం వెళతారు?అని సూటిగా అడిగేసారు తెలంగాణ మంత్రి కె టి రామారావు. హైదరాబాద్ లో వున్న సంస్థలు ఆంధ్రకు తరలిపోతాయని వినవస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అన్న మాటలు కాస్త ఆలోచన రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్ పై సీమాంధ్రులకు ఎంత ప్రేమ అన్నది కొత్తగా చెప్పనక్కరేలేదు. కేవలం అన్ని విధాలా సదుపాయాలున్ననగరంగానే కాకుండా, ఇక్కడ బంధాలు పెంచుకున్న నగరం కూడా. అందుకే అంత సులువుగా వదిలిపోవడం సాధ్యం కాదు. ఎంత పంతాలున్నా, ప్రాంతీయ అభిమానాలున్నా ఒక చోటి నుంచి మరో చోటికి తరలిపోవడం అన్నది వ్యక్తులకే అంత సులువు కాదు. ఇక సంస్థలకు అంత సులువా అంటే కాదనే చెప్పాలి. ఏదో విధంగా తప్పని సరి అయితే వెళ్తాయేమో కానీ మామూలుగా కాదు.

హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం మాత్రమే కాదు. అవకాశాలు ఎలా ఇబ్బడిముబ్బడిగా వుంటాయో, మానవ వనరుల అందుబాటు కూడా అలాగే వుంటుంది. ఏ పరిశ్రమ లేదా సంస్థ అయినా ఏళ్ల తరబడి ఎస్టాబ్లిష్ అయిన చోటి నుంచి మరో దగ్గరకు ఎందుకు మారాలనుకుంటుంది.  ఇక్కడ ఇబ్బంది వున్నా, వేరే చోట ప్రయోజనం ఎక్కువ వున్నా. తెరాస ప్రభుత్వం పరిశ్రమలకు ఇబ్బంది కలిగించే రీతిగా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు లేదు. తెలుగుచిత్ర పరిశ్రమ వ్యవహారమే చూసుకోండి. తెరాస ఫ్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ చాంబర్ కోసం గడబిడ మొదలైంది. నిజానికి ఆ దశలో కెసిఆర్ జోక్యం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ చేసుకోలేదు. అంటే సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన లేదన్నది స్పష్టం అవుతుంది. 

పోనీ సినిమా పరిశ్రమ ఏమన్న తరలిపోదామని అనుకుంటోంది. అదీ లేదు. సినిమా పరిశ్రమలో సగానికి పైగా తెలుగుదేశం అనుకూల వర్గమే అని అందరికీ తెలుసు. అది కూడ సీమాంధ్రులే కూడా. కానీ విశాఖనో, విజయవాడనో తరలిపోవాలని అనుకోవడం లేదు. సాక్షాత్తూ టీడీపీ ఎంపీ అయిన సినిమా ప్రముఖుడు మురళెమోహనే ఈ సంగతి కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మద్రాసు నుండి రావడానికి పాతికేళ్లు పట్టిందని కూడా గుర్తుచేస్తున్నారు.  ఈ సంగతి రామోజీ ఫిల్మ్ సిటీ, ప్రసాద్ లాబ్, అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో ఇవన్నీ సీమాంధ్రులవే. ఇప్పుడు పరిశ్రమ విశాఖకో మరో దగ్గరకో పోతే వీళ్ల వ్యాపారాలేం కావాలి. పోనీ పట్టుకుపోవడానికి చరాస్థులు కావు..స్థిరాస్తులు. అయితే సినిమాలోని మెగా వర్గం మాత్రం సినిమా రంగాన్ని విశాఖకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లు బోగట్టా. ఎందుకంటే, ఇన్ ఫాస్ట్రక్చర్ పరంగా వారికి హైదరాబాద్ లో ఏమీ లేదు. విశాఖలో స్టూడియో కట్టాలన్న ఆలోచన వుందని వినికిడి. 

సరే, చిత్ర పరిశ్రమ సంగతి అలా వుంచితే, మరో కీలకమైనది ఐటి. ఇది కూడా అంతసులువుగా తరలిపోదు. విశాఖలో జాగాలు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా, నామమాత్రంగా మాత్రలే సంస్థలు ఏర్పాటు చేసి ఊరుకున్నాయి పలు సంస్థలు. పైగా హైదరాబాద్ గచ్చిబౌలిలో పెద్ద సంస్థలు అనేకం వున్నాయి వాటికి అన్నీ స్వంత ఆస్తులే. ఇప్పుడు అంత ఆస్తులు విశాఖలో సమకూర్చాలంటే అంత సులువు కాదు. ప్రభుత్వం భూములు ఇవ్వచ్చ. కానీ అన్నీ మళ్లీ సమకూర్చుకోవాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. పైగా ఇప్పుడేమీ ఐటి అంత బూమ్ లో లేదు. కొత్త ప్రాజెక్టులు అపారంగా వుంటే, భవనాలు చాలక కొత్తవి వేరే చోట కట్టే ఆలోచన చేయడానికి. ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పటికే చాలా సంస్థలు హైదారాబాద్, సికిందరాబాద్ లోని అనేక చోట్ల వున్న తమ తమ కార్యాలయాలను ఖాళీ చేసి, ఓ చోటకు చేర్చి ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఇలాంటి స్థితిలో వారు ఇప్పుడు ఎందుకు కొత్త చోటికి వెళ్లాలనుకుంటారు. ఏదైనా ఆశ వుండాలి. కేవలం స్థలాలు సరిపోవు. పన్నుల వెసులుబాటు వగైరాలు. తెలంగాణ కూడా ఆ విధంగానే చేస్తానని అంటోంది. కేంద్రం ఇచ్చే వెసులుబాటులు రెండు రాష్ట్రాలకు సమానంగా వుండాలన్న వాదన తెరపైకి తెస్తోంది. ఇదేదో తేలేదాకా సంస్థలు కదలవు

ఇక మరో తంతు వుంది. రికార్డుల వ్వవహారం. ఇప్పుడు చాలా సంస్థలు చేస్తున్నది అదే. పేరుకు ఆంధ్రలో కార్యాలయాలు ప్రారంభించడం. రేపు ఏమైనా పన్ను వెసులుబాటులు వుంటే సీనియార్టీ వస్తుంది. ఉపయోగపడుతుంది అని కంపెనీలు తమ తమ కార్యాలయాలను రిజిస్టర్ చేస్తున్నాయి. ఈ నెంబర్ చూసి మురిసిపోవడం తప్ప, దాని వల్ల అభివృద్ధి పెద్దగా ఒరిగేది లేదు.  వార్తా పత్రికలకు అన్ని చోట్లా ఇప్పటికే కార్యాలయాలు వున్నాయి. అవి ఎడిషన్లు వేరు చేసాయి. ఇన్ ప్రింట్ చిరునమాలు మార్చాయి తప్ప  మరింకేమీ చేసింది లేదు. కొన్ని మాత్రం ఆంధ్ర ఎడిషన్ ను విజయవాడలో తయారుచేస్తున్నాయి. అది కూడా ఇప్పటికే వున్న కార్యాలయాల్లోనే. ఈనాడు లాంటి సంస్థలు హైదరాబాద్ నుంచే ఇటు అటు నడుపుతున్నాయి. అందువల్ల ఇప్పట్లో సంస్థలు తరలిపోవడం అన్నది వుండకపోవచ్చు. కానీ అక్కడ కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటాయి. 

ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన పలు రియల్ ఎస్టేట్ సంస్థలు విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో తమ వెంచర్లు ప్రారంభించాయి. అంతమాత్రం చేత హైదరాబాద్ ను వదల్లేదు. ఇప్పుడు రాజధాని విజయవాడకు వెళ్లిందనే అనుకుందాం. వెళ్లాల్సిన ఉద్యోగులు మానసికంగా సిద్ధమవుతున్నారు. కుటుంబాలను హైదరాబాద్ లోనే వుంచి తాము వెళ్లాలని. ఇలా వ్యక్తులది, సంస్థలది ఇటు హైదరాబాద్ పై మమకారం మాత్రం పోవడం లేదు. అందువల్ల అంత సులువుగా హైదరాబాద్ ఖాళీ అయిపోతుందని అనుకోవడం భ్రమే. అయిదేళ్ల తరువాత కూడా. ఎందుకంటే అది తెలంగాణ బలం..సీమాంధ్రుల బలహీనత కూడా.

చాణక్య

[email protected]