భారతరత్న నెక్స్‌ట్‌ ఎవరికి.?

ఊరించి ఊరించి.. సచిన్‌ టెండూల్కర్‌కి భారతరత్నను కేంద్రం ప్రకటించింది. సచిన్‌తోపాటు, సిఎన్‌ఆర్‌ రావుకీ భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. దేశంలోని అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న రావడం ఎవరికైనా గర్వకారణం. భారతరత్న వచ్చిందంటే..…

ఊరించి ఊరించి.. సచిన్‌ టెండూల్కర్‌కి భారతరత్నను కేంద్రం ప్రకటించింది. సచిన్‌తోపాటు, సిఎన్‌ఆర్‌ రావుకీ భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం విదితమే. దేశంలోని అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న రావడం ఎవరికైనా గర్వకారణం. భారతరత్న వచ్చిందంటే.. అది ఎవరికైనా సరే.. దేశమంతా పండగ చేసుకుంటుంది. ఆ పురస్కారానికి వున్న గౌరవం అలాంటిది. అయితే ఆ పురస్కారం చుట్టూ రాజకీయాలే.. ఒకింత ఆవేదనకి గురిచేస్తున్నాయి ప్రజాస్వామ్యవాదులకి.

ఇక, మన రాష్ట్రం నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ చాలాకాలంగా విన్పిస్తోంది. అయినప్పటికీ కేంద్రం, ఎన్టీఆర్‌ పేరుని ఇప్పటిదాకా పరిగణనలోకి తీసుకోలేదు. తెలుగు సినీ ప్రపంచంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ది తిరుగులేని ఇమేజ్‌. రాజకీయ నాయకుడిగానూ రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారు. దాంతో ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ని కొట్టి పారేయలేం. కానీ, రాజకీయ కోణంలో భారతరత్న డిమాండ్‌ని సమర్థించలేం.

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విషయంలోనూ అంతే. ఆయనకూ భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ని బీజేపీ తెరపైకి తెస్తోంది. మోడీ 2014 ఎన్నికల తర్వాత ప్రధాని అయితే వాజ్‌పేయికి భారతరత్న పురస్కారం ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే సమయంలో, మోడీ హైద్రాబాద్‌ వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ జపం చేసిన దరిమిలా, ఎన్టీఆర్‌కి ఎన్డీయే హయాంలో భారతరత్న పురస్కారం ప్రకటించినా వింతేమీ కాబోదు.

పద్మ పురస్కారాల విషయంలో రాజకీయ నాయకుల సిఫార్లు వ్యవహారం ఇటీవలే వెలుగులోకి వచ్చి, ఆ పురస్కారాల విలువ తగ్గించేసింది. భారతరత్న లాంటి అత్యుతన్నత పురస్కారాల విషయంలోనూ రాజకీయ కోణాలు, రాజకీయ అవసరాల్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ పురస్కారానికీ చెదపట్టే ప్రమాదం లేకపోలేదు.

సచిన్‌ విషయమే తీసుకుందాం.. చాలా సంవత్సరాలుగా వస్తోన్న డిమాండ్‌ని పట్టించుకోని కేంద్రం, ఆయన స్పోర్ట్స్‌ కోటాలో అయినా సరే ఎంపీ అయ్యాక, క్రికెట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన రోజే భారతరత్న పురస్కారాన్ని ఆయనకు ప్రకటించడం పలు విమర్శలకు తావిచ్చింది.

దేశంలోని అత్యున్నత పురస్కారాల విషయంలో సిఫార్సులు, రాజకీయ ఒత్తిళ్ళు కాకుండా.. ఆయా రంగాలకు ఆయా వ్యక్తులు చేసిన సేవకు గుర్తింపుగా పురస్కారాలు ప్రకటితమైతే.. అందుకున్న వ్యక్తులకు.. ఆయా పురస్కారాలకూ గౌరవం ఎప్పటికీ నిలిచిపోతుంది.