‘ముని’వాక్యం: రేపు స్థిరం కాదు!

అనగనగా ఒక కథ…  Advertisement వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని పాండవులు తిరిగి వచ్చి రాజ్యపాలన ప్రారంభించారు. ధర్మరాజు పాలన గురించి, వితరణ శీలత గురించి అనేకానేక కథలు రాజ్యంలో ప్రచారంలోకి వచ్చాయి. అందరూ…

అనగనగా ఒక కథ… 

వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని పాండవులు తిరిగి వచ్చి రాజ్యపాలన ప్రారంభించారు. ధర్మరాజు పాలన గురించి, వితరణ శీలత గురించి అనేకానేక కథలు రాజ్యంలో ప్రచారంలోకి వచ్చాయి. అందరూ ఆయనను వేనోళ్ల కీర్తిస్తున్నారు. ఇలా గడుస్తుండగా.. ఒకనాడు ధర్మరాజు నిండుసభలో కొలువై ఉన్నప్పుడు.. ఒక పేద బ్రాహ్మడు రాజాశ్రయం కోరి వచ్చాడు.

‘‘రాజా నేను పేదవాడిని. బ్రాహ్మణుడిని. నా జీవికకు సరిపడా ఏదైనా దానం ఇవ్వండని’’ అర్థించాడు. ఆయన మాటలకు ధర్మరాజు కూడా సమ్మతంగానే ఉన్నాడు. కాకపోతే ‘‘ఇవాళ వెళ్లి రేపు రా విప్రోత్తమా! నీకు వలసినంత దానం ఏర్పాటుచేస్తాను’’ అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడికి కూడా అది సముచితంగానే అనిపించింది. రాజును కీర్తించి తిరుగుముఖం పట్టాడు.

ఈలోగా రాజుగారి కొలువులోనే ఒకవైపు కూర్చుని ఉన్న భీమసేనుడు తనలో తాను ముసిముసిగా కిసుక్కున నవ్వుకోవడం ధర్మరాజుకు కనిపించింది. నిండుసభలో, అది కూడా తాను నిర్ణయాన్ని చెబుతున్నప్పుడు.. సాధారణంగా తన మాటకు విధేయుడిగా, తనకు ఒడంబడి ఉండే తమ్ముడు నవ్వడం ఆయనకు ఇబ్బందిగా అనిపించింది. సహించలేకపోయాడు. ఆత్రుత పట్టలేక..

‘‘భీమసేనా ఎందుకు నవ్వుతున్నావు’’ అని అడిగాడు.

‘‘ఏమీ లేదులే అన్నగారూ’’ అంటూ జవాబు దాటవేయడానికి ప్రయత్నించాడు భీమసేనుడు. అయితే ధర్మరాజు పట్టు విడువలేదు. తన మాటల పట్ల భీముడిలో ఎన్నడూ కనిపించని పరిహాసం ఆయనను మధన పెట్టింది. భీముడిపై మరింత ఒత్తిడిచేశాడు. ఎందుకు నవ్వావో చెప్పమని అడిగాడు. భీముడికిక తప్పలేదు.

‘‘అన్నగారూ.. మీరు చాలా గొప్పవారని నాకు తెలుసు. కానీ, మీరు దేవుడికంటె, విధికంటె గొప్పవారనే సంగతి ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడే తెలిసింది. అందుకే నా అజ్ఞానానికి నేను నవ్వుకున్నాను’’ అన్నాడు భీముడు. 

ధర్మరాజుకు ఆ మాటల్లో కూడా ఏదో వెటకారమే కనిపించింది. ఆ మాటల అంతరార్థం చెప్పమని మళ్లీ బతిమిలాడాడు. ‘‘బ్రాహ్మణుడు మీ సాయం కోరి వచ్చాడు. మీరు చేయదలచుకున్నది ఈ క్షణంలోనే చేసేయవచ్చు. కనీసం ప్రకటించవచ్చు. కానీ మీరు రేపు రమ్మని అతణ్ని తిప్పి పంపారు. అంటే.. రేపటిదాకా మీరు జీవించి ఉంటారనే నమ్మకం మీకు ఉన్నది గనుక.. రేపు రమ్మన్నారు. అలాంటి నమ్మకం ఉన్నదంటే.. విధి కంటెమీరు గొప్పవారైనట్టే కదా..’’ అని విశదీకరించాడు భీముడు.

ధర్మరాజుకు తాను చేసిన పొరబాటు అర్థమైంది. ఒక మంచి పని చేయదలచుకున్నప్పుడు అందులో వాయిదాలు తగవని తెలిసింది. వెంటనే భటుల్ని పురమాయించి.. వెళ్లిపోతున్న బ్రాహ్మణుడిని వెనక్కు పిలిపించాడు. అతడికి తగురీతిగా దానాలిచ్చి సత్కరించి పంపాడు.

మంచి పనుల విషయంలో వాయిదా తగదు అనే నీతిని మనకు ఈ కథ బోధిస్తుంది. 

== ==

మంచి పని ఏదైనా సరే వాయిదా వేయకుండా చేసేయాలి అనేదే ఈ కథ అంతరార్థం. ఇది కొత్తగా ప్రతిపాదించే, నేర్చుకునే సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. ‘రేపటి పని ఇవాళే చేసేయి.. ఇవాళ్టి పని ఇప్పుడే పూర్తి చేసేయి..‘ అనే మహాత్మాగాంధీ సిద్ధాంతాన్ని మనం చదువుకునే ఉంటాం. సక్సెస్ మంత్ర బోధించేవాళ్లు కూడా ఇలాంటి టైమ్ సెన్స్ గురించి మనకు పాఠాలు చెబుతూ ఉంటారు. కానీ జీవితం అంటే సక్సెస్ ఒక్కటే కాదు. ఏ విషయంలో అయినా సరే ఈ వాయిదాల పర్వం మాత్రం మంచిది కాదని మనం గ్రహిస్తే చాలు.

ఈ కథానీతికి అన్వయం మానవ సంబంధాలలో కూడా ఉన్నదని అనిపిస్తుంది నాకు. ఈ విషయంలో మనం చాలా వరకు నిర్లిప్త, ఉదాసీన ధోరణులను అవలంబిస్తూ ఉంటాం. సాధారణంగా  out of sight is out of mind అనే ఇంగ్లీషు సామెత మన జీవితాలకు అతికినట్లుగా సరిపోతుంది. నిరంతర వ్యవహారాలలో మనతో మెలుగుతూ ఉండే మానవ సంబంధాల విషయంలో మామూలు ప్రవర్తనే కొనసాగుతూ ఉండవచ్చు గాక! కానీ ఎంతో ఆత్మీయులు, ఆప్తులు అయినప్పటికీ నిత్యం కళ్ళెదురుగా ఉండని వారి విషయంలో నిర్లిప్తత రాజ్యమేలుతుంటుంది. వారి పట్ల మనకు విముఖత ఉంటుందని కాదు. వారిని ఒకసారి కలవాలని, మాట్లాడాలని, ఆత్మీయమైన సమయాన్ని వారితో గడపాలని మనకు నిండుగా కోరిక ఉంటుంది. కానీ ఆచరణలో పెట్టడం- వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది ఒక పట్టాన పట్టాలెక్కదు! ఇలాంటి చాలా సందర్భాల్లో మనం ఒక బంధాన్ని బాధాతప్త హృదయంతో ముగిస్తాం.

సరళంగా చెప్పాలంటే ‘tomorrow never exist’ అనేది మనం ఆచరించే జీవన వేదం కావాలి. దాని అర్థం ‘రేపు’ అనేది ఉండదని కాదు. ఆ ‘రేపు’లో మనం ఉంటామో లేదో అనేది. అలాంటి స్పృహ ఒకటి వెంటాడుతూ ఉంటే మనం చాలా చాలా పనులను కొన్ని సంవత్సరాలుగా వాయిదా వేస్తూ ఉండే పనులను కూడా సత్వరం పూర్తిచేసేస్తాం. కరోనా అనే మాట పాతబడిపోయింది గానీ.. అది నేర్పిన పాఠం మాత్రం నిత్యనూతనమైనది. మనం ఆమోదించి తీరవలసినది.

జీవితానికి కొంత తాత్విక స్పృహను తద్వారా సచ్ఛీలతను ఆపాదించుకోవడానికి ‘మరణం అనివార్యం’ అనే మాటను మనం నమ్ముతూ ఉంటాం. ఆ స్పృహ ఉన్నప్పుడు మనం నిరపేక్షతో కొన్ని మంచి పనులు ఆటోమేటిగ్గా చేసేస్తుంటాం.

మృత్యువులో ఉన్న గొప్పదనం అది. దాని గురించిన స్పృహ మన కేరక్టర్ ను అగ్నిపునీతం చేసేస్తుంటుంది. కరోనా తర్వాత మనం నేర్చుకోవలసినది, అర్థం చేసుకోవలసినది ఏంటంటే- మరణం అనివార్యం మాత్రమే కాదు, అనూహ్యం కూడా! అది ఏ క్షణాన అయినా నిన్ను వరించవచ్చు. నవ్వు పూర్ణారోగ్యంతో ఉండవచ్చు గాక, జిమ్ చేస్తూ ఉండే ఫిట్నెస్ గల బాడీ కావొచ్చు గాక.. కానీ అది ఎన్నడు వరిస్తుందో చెప్పలేం! ఆ స్పృహ ఉంటే మన కేరక్టర్ ఇంకా తుల్యం అవుతుంది.

ఒక పరిచయస్తుల కుటుంబంలో ఒక సంఘటనను గమనించాను. అతను కులీనుడు. కోట్లు గడించాడు. ధనార్జన పట్ల వ్యామోహం తగ్గలేదు. ఎంతగా అంటే.. అతనికి పిత్రార్జితంగా దక్కినవీ, తాను గడించినవీ కలిపి అనేకానేక కోట్ల రూపాయలు, ఎకరాలకొద్దీ భూములు భవనాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా.. తల్లితో తగాదా! ఆమె పేరిట ఉన్న ఆస్తి గురించిన తగాదా! ఆ ఆస్తిని ఆమె తన తోబుట్టువుల పరం చేస్తుందని, తనకు ఇవ్వదని ఒక దుగ్ధ. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న తల్లిని కిరాయి మనుషులతో కిడ్నాప్ చేయించి.. ఒక నిర్జన ప్రదేశానికి తీసుకు వచ్చిన తర్వాత.. ఆమెతో బలవంతంగా ఆస్తి బదలాయింపు పత్రాల మీద సంతకాలు తీసుకుని ఆమెను విడిచి పెట్టేశాడు. అతిశయంగా, నమ్మశక్యం గాకుండా ఉండే సంగతి ఇది. తల్లితో మాటలు కూడా లేకుండాపోయాయి. కొన్నాళ్లకు ఆమె మరణించింది. వచ్చి భోరున విలపించాడు. ఈ గొడవలు సద్దుమణిగితే.. నిన్ను దేవతలా చూసుకోవాలని అనుకున్నాను.. నీకు నిలువెత్తు బంగారు నగలు చేయించాలని అనుకున్నాను.. అంటూ విలపించాడు. అర్థం లేని విలాపం ఇది. బతికిఉండగా మాటలు మానేసి, పంతానికి పోయి, స్వార్థానికి ఆ అనుబంధాన్ని పణంగా పెట్టేసిన వ్యక్తి.. తల్లి మరణించిన తర్వాత విలపిస్తే మాత్రం ఏం వస్తుంది.

మనం పంతానికి పోయి మిత్రులతో, బంధువులతో మాటలు మానేస్తుంటాం. అందువల్ల సాధించేది ఏమీ ఉండదని మనకు తెలుసు. మరణిస్తే తప్పకుండా వెళ్లి విలపిస్తాం. కానీ.. పంతంపట్టి భీష్మించుకున్నన్ని రోజులూ.. వారితో ఉండగల అనుబంధంలోని ఆత్మీయతను మనం మిస్ అయ్యాం అనే సంగతి మరచిపోతాం. మానవ సంబంధాలు ఉండేది.. మరణించిన తర్వాత వెళ్లి, కుదరితే ఒక పూలమాల వేసి, రవంత విలపించడానికి కాదు. ఆ అనుబంధాల్లోని ఆత్మీయతను, జీవించఉండగానే ఆస్వాదించడానికి మాత్రమే! వాటిని తోసిరాజనుకునే, మన అహాన్ని సంతృప్తి పరుస్తూ ఉండే పంతాలు, పట్టింపులు ఎందుకూ కొరగానివనే సంగతి మనకు మరణకాలంలోనే అవగతమవుతుంది.

అందుకే మానవ సంబంధాల విషయంలో అస్సలు వాయిదాలు ఉండకూడదు. రాజీపడడం ద్వారా బంధం నిలబడుతుందంటే.. ముందుగా మనమే రాజీపడడానికి సిద్ధంగా ఉండాలి. బంధాలు పలచబడనివ్వకూడదు. రేపు అనేది లేదు.. అది స్థిరం కాదు అనే స్పృహతోనే మనం జీవిస్తూ ఉండాలి. అలాంటి ఆలోచన- మన బంధాలను మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటుంది. మన అంతరంగాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది.

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]