విజయమ్మను ముగ్గులోకి లాగుతున్న షర్మిల!

వైఎస్ విజయమ్మ పరిస్థితి ఇప్పుడు సంకటంలో ఉంది. చాలాకాలంగా రాజకీయంగా మౌనంగానే ఉన్న తల్లి విజయమ్మను వైఎస్ షర్మిల ఇప్పుడు రాజకీయ ముగ్గులోకి లాగుతున్నారు. తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తల్లిని కూడా…

వైఎస్ విజయమ్మ పరిస్థితి ఇప్పుడు సంకటంలో ఉంది. చాలాకాలంగా రాజకీయంగా మౌనంగానే ఉన్న తల్లి విజయమ్మను వైఎస్ షర్మిల ఇప్పుడు రాజకీయ ముగ్గులోకి లాగుతున్నారు. తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తల్లిని కూడా ఆమె అనుచితమైన రీతిలో వాడుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

పీసీసీ సారథిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి అన్న వైఎస్ జగన్ మీద బురద చల్లడానికి నానా పాట్లు పడుతున్న షర్మిల ఇప్పుడు తల్లి విజయమ్మను ప్రస్తావించడం, తనకు ఆమెను ఒక కవచంలాగా వాడుకోడానికి చూస్తుండడం విస్తుగొలుపుతోంది.

దుర్మార్గపు వ్యూహాలతో వ్యవహరిస్తూ ఉండే కాంగ్రెసు పార్టీ తమ కుటుంబంలో కూడా చీలిక తెచ్చి రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. గతంలో పులివెందుల ఎమ్మెల్యేగా తన మీద బాబాయి వివేకానందరెడ్డిని పోటీచేయించిన వైనంతో పాటు, ఇప్పుడు చెల్లెలు షర్మిలకు పీసీసీ సారథ్యాన్ని కట్టబెట్టడాన్ని కూడా జగన్ ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

ఈ మాటలకు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం.. చేజేతులా జగనన్న చేసుకున్నదే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మ, యావత్ కుటుంబం’ అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చారు.

ఆమె ప్రస్తుతం పీసీసీకి సారథ్యం వహిస్తున్నందున.. కాంగ్రెస్ మీద జగన్ తన విమర్శ వినిపించగానే.. దానికి ప్రతివిమర్శ చేయడానికి పూనకం తెచ్చుకోవడం చాలా సహజం. అందుకే, వైఎస్ కుటుంబం చీలికతో కాంగ్రెస్ కు సంబంధం లేదని చెప్పడానికి తపన పడుతున్నారు. అదంతా ఓకే గానీ, తల్లి విజయమ్మను ఈ రొంపిలోకి లాగడమే నీతిబాహ్యంగా ఉంది.

వైఎస్ విజయమ్మ తొలినుంచి జగన్ కు ఎంతో అండగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆమె గౌరవాధ్యక్షురాలు కూడా. కానీ షర్మిల తెలంగాణలో వైతెపాను ప్రారంభించిన తర్వాత.. కూతురుకు అండగా ఉండాలని అనుకున్నారు విజయమ్మ. అందుకోసం వైస్సార్ కాంగ్రెస్ పదవికి ఆమె రాజీనామా చేశారు. కూతురు పార్టీలో క్రియాశీలంగా పదవులు అనుభవించలేదు, ప్రచారానికి వెళ్లలేదు. ఈలోగా కూతురు తన పార్టీని కాంగ్రెసులో విలీనంచేసేశారు. ఆ నిర్ణయంపై తల్లి విజయమ్మ మనోగతం ఏమిటన్నది స్పష్టంగా బయటకు రాలేదు.

కానీ ఇటీవలి అనేకబ పరిణామాల్లో కలిసినప్పుడు.. విజయమ్మ , కొడుకు వైఎస్ జగన్ తో ఎప్పటిలాగానే చాలా ప్రేమగానే వ్యవహరిస్తున్నారు. అందులో కూడా ప్రజలకు అనుమానాలు పుట్టించడానికి కుట్ర చేస్తున్నట్టుగా షర్మిల మాట్లాడుతున్నారు. కుటుంబం చీలడానికి తల్లి విజయమ్మ సాక్షి అంటూ.. ఆమెను ఈ రొంపిలోకి లాగుతున్నారు. ఇలాంటి మాటలు పూర్తి అనైతికమైనవని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

విజయమ్మ తనకు తానుగా ఇలాంటి పరిణామాలపై నోరు మెదిపై వరకు షర్మిల ఆమె పాత్రను  వివాదంగా మార్చడం తగదని అంటున్నారు.