సినిమా రంగంలో పాత కథలే అటు తిప్పి, ఇటు తిప్పి తీస్తుంటారు. ఏమన్నా అంటే ప్రపంచంలో మొత్తం ఏడు కథలే వున్నాయి. అందువల్ల వాటినే అటు ఇటు చేసి లక్షల కథలు తయారు చేస్తున్నారు అంటూ కథలు చెబుతారు. సినిమా రంగంతో సంబంధం వున్న పార్టీ తెలుగుదేశం. దానితో జంట కట్టింది పచ్చటి మీడియా. అందువల్ల దానిదీ అదే తీరు. నచ్చని వారి మీద, కిట్టని వారి మీద కథలు అల్లడంలో పెట్టింది పేరు. అల్లిన కథలనే అటు తిప్పి ఇటు తిప్పి కొత్తగా అల్లి ప్రెజెంట్ చేయడంలో పచ్చ మీడియా చాకచక్యమే వేరు.
కాంగ్రెస్ పొడ కిట్టదు. కానీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొడ అసలు కిట్టదు. అందులోనూ వైఎస్ జగన్ అంటే మరీ మంట. అందుకోసం ఏడాది పొడవునా తమ పత్రికలను యాంటీ జగన్ స్టోరీలకే అంకితం ఇచ్చేసాయి. మొదటి పేజీ, మొదటి స్టోరీ జగన్ మీద బురద వేస్తూనే సాగాలి. అ తరువాత మిగతా వ్యవహారాలు.
కానీ పచ్చ పత్రికల యాజమాన్యం కసి, కోపం, దుగ్ద ఎంత వున్నా, అందులో పని చేసే వారు ఎన్ని కథనాలు అని పుట్టిస్తారు. రోజూ అదే బాధ కదా. ఎక్కడి నుంచి వస్తాయి.. నిత్యం యాంటీ జగన్ స్టోరీస్. అందుకే ఇక ఇలా లాభం లేదని, పాత కథలు తీసి, కొత్త హెడ్డింగ్ లు పెట్టి ముస్తాబు చేయడం మొదలుపెట్టాయి.
ఎప్పుడో వైఎస్ జమానాలో రాసిన భూ భాగోత కథనాల ఫైలు దులిపాయి. మళ్లీ బయటకు తీసి, వాటినే అటు తిప్పి, ఇటు తిప్పి, కొత్తగా జగన్ అవినీతి అనే కలర్ వచ్చేలా రాసి, ఫ్రంట్ పేజీల్లో వండి వడ్డిస్తున్నారు. అవి చూసి జనం జగన్ ప్రభుత్వం అవినీతి మయం అనుకోవాలి. చేస్తున్న అభివృద్ధి ఎలాగూ చూపించరు. ఇస్తున్న పథకాల గురించి ఎలాగూ రాయరు. మరి జరగని అవినీతిని ఎక్కడి నుంచి తెస్తారు. అందుకే పాత అవినీతి కథలు ఏమన్నా వుంటే తిప్పి తిప్పి రాయాలి.
అదే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ క్రమంలో రోజూ పాత కథలు తిప్పి, తిప్పి, కొత్తగా వండి వారుస్తున్నారు. పచ్చ మీడియా డెడికేషన్ కు హ్యాట్సాప్. కానీ జనం మారిపోయారని, వాళ్ల నిర్ణయాలు వారికి వుంటాయని మాత్రం ఎప్పుడు తెలుసుకుంటారో?