లబ్ధిదారులకు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దనే అందజేసే ప్రక్రియకు కుట్రపూరితంగా అడ్డుకట్ట వేసింది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. తనకు అనుకూలురైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి.. అటు నుంచి నరుక్ రావడం ద్వారా మూడు నెలల పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లు దూరం ఉండేలాగా ఆదేశాలు తెప్పించిన కుటిల నీతి ఆయనది.
ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తుంటే వృద్ధులు ఎండనబడి అక్కడకు రావాల్సిన దుస్థితిని కల్పించింది చంద్రబాబు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో వృద్ధులు పింఛన్ల కోసం రోడ్డున పడి ప్రాణాలు కోల్పోయారంటే ఆ పాపం చంద్రబాబు నాయుడుది. అన్ని మరణాలు చోటు చేసుకున్న తర్వాత ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలం అయింది అంటూ మొసలి కన్నీరు కార్చి దొంగ ఏడుపులు ఏడ్చింది కూడా చంద్రబాబు నాయుడే.
ఇప్పుడు మే నెలలో వృద్ధులు రోడ్డు ఎక్కే అవసరం లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అలా సక్సెస్ ఫుల్ గా ప్రజలకు పింఛన్లు అందించే ఈ ఏర్పాటును కూడా ఆయన సహించలేకపోతున్నారు. అంతా సవ్యంగా జరిగితే జగన్ సర్కారు మీద నిందలు వేయడానికి అవకాశం లేకుండా పోతుందని ఆయన ఆవేదన చెందుతున్నట్లుగా కనిపిస్తుంది.
మే నెలలో లబ్ధిదారులు ఎవరూ ఎండనపడి కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసింది. పింఛనుదారుల్లో ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంకు అకౌంట్లు అనుసంధానమై ఉన్న 74 శాతం మందికి వారి వారి అకౌంట్లోకి ఒకటవ తేదీన బదిలీ చేసే ఏర్పాటు చేశారు. బ్యాంకు అకౌంట్లు లేనివారికి, ముసలి వారికి, వికలాంగులకు, వీల్ చైర్లకే పరిమితమైన వారికి ఇలాంటి అందరికీ కూడా ఇంటి వద్దకే తీసుకువెళ్లి ప్రభుత్వ సిబ్బంది పింఛను మొత్తం అందజేసేలాగా రెండో మార్గం కూడా ఏర్పాటు చేశారు.
ఇంటి వద్దనే లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తూ వచ్చిన వాలంటీర్లను ప్రస్తుతం కోడ్ కారణంగా దూరం పెట్టడం వలన ఏర్పడిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది అద్భుతమైన ఏర్పాటుగానే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించడానికి సాహసిస్తున్నారు.
లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేసినా పట్టించుకోలేదు అంటున్నారు. బ్యాంకు ఖాతాలో వేస్తే మండుటెండలో వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయినా చంద్రబాబు ఇంకా ఏ కాలంలో ఉండి మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. బ్యాంక్ అకౌంట్ లోకి వస్తే ఏటీఎం ద్వారా ఉదయం సాయంత్రం వేళల్లో అయినా వెళ్లి డ్రా చేసుకోవడం సాధ్యమే అనే సంగతిని ఈ టెక్నాలజీ కిడ్ మరిచిపోతున్నట్టున్నారు. 26% మంది లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛను అందిస్తున్నారనే వాస్తవాన్ని కూడా ఆయన విస్మరించి విమర్శలు చేస్తున్నారు.
ఒకటిన్నర లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నారని వారి ద్వారా ఇళ్ళకే అందజేయొచ్చు కదా అంటున్నారు. రెండున్నర లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లు చేస్తున్న పనిని ఒకటిన్నర లక్షల ప్రభుత్వ సిబ్బందితో చేయించాలనుకోవడం ఒక దుర్మార్గం. అయినా ప్రభుత్వ సిబ్బందికి వారి కార్యాలయాల్లో వేరే పనులు ఉండవా అనేది ఒక ప్రశ్న.
మొత్తం ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపితే వారి ద్వారా ప్రలోభ పెడుతున్నారని ఓట్ల కొనుగోలుకు కూడా డబ్బులు పంచుతున్నారని కొత్త విమర్శలు చేయడానికి చంద్రబాబు స్కెచ్ సిద్ధం చేసుకున్నారేమో గానీ, ఆ పాచిక పారకపోయేసరికి కంగు తింటున్నారు. ప్రభుత్వం ఎంత మంచి ఏర్పాటు చేసిన ఇంకా నిందించాలనుకునే ఆయన వైఖరి అసహ్యం పుట్టిస్తోందని ప్రజలు చీదరించుకుంటున్నారు.