రేవంత్ కు ఐదేళ్ల గడువిచ్చిన తీన్మార్!

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత యూట్యూబ్ తీన్మార్ మల్లన్న చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ బీసీ నాయకుడిగా ఎదగడానికి ఆయన గట్టి కసరత్తు చేస్తున్నారు.…

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత యూట్యూబ్ తీన్మార్ మల్లన్న చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ బీసీ నాయకుడిగా ఎదగడానికి ఆయన గట్టి కసరత్తు చేస్తున్నారు.

ఒకవైపు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నిలదీస్తూనే, పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీలోని ఇతర అగ్రకులాల సీనియర్ నాయకుల పై నిర్మొహమాటంగా విమర్శలతో దండెత్తుతున్నారు. సొంత పార్టీ నాయకులని అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా తన సొంత రాజకీయ ప్రస్థానానికి పటిష్టమైన పునాదులు తయారు చేసుకోవడం కోసమే అనే భావన ప్రజల్లో కనిపిస్తుంది.

బీసీ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ.. గత పాలకులు చేసిన తప్పు అని అంటున్న తీరును తప్పు పట్టారు. నాటి ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి లేరా? అని ప్రశ్నిస్తున్నారు. తద్వారా ఇవాళ తమ పార్టీలో ఉన్న ఆ నాయకులందరూ కూడా తప్పు చేసినట్టే అని సంకేతాలు ఇస్తున్నారు. ఆ మాటకొస్తే గత ప్రభుత్వ హయాంలో.. ఒక కుటుంబం తప్ప ఇతర నాయకుల మాటలకు ఏమాత్రం విలువ ఉన్నదో.. అందరికంటె బాగా యూట్యూబర్ తీన్మార్ మల్లన్నకే తెలుసుకదా అనేది ప్రజల మాట.

ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రాష్ట్ర పార్టీ నాయకత్వం మీద ప్రకటిత తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ వారిలో తీన్మార్ మల్లన్న ముందు వరుసలో ఉంటారు. రాష్ట్రానికి త్వరలోనే బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ ఇటీవల చేసిన ప్రకటనలతో మల్లన్న సంచలనం సృష్టించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఆయన చెక్ పెడుతున్నారా? రేవంత్ కు పదవీ గండం ఉండేలాగా ఢిల్లీలో పావులు కలుపుతున్నారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి. అయితే ఈ వ్యాఖ్యలు బీసీ సంఘాల సమావేశంలో చేసినవి మాత్రమే కావడం గమనార్హం.

అదే విధంగా తాజాగా హైదరాబాదు నగరంలో జరిగిన బీసీ కులాల సమాఖ్య సమావేశంలో తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకపోతే ఈసారి ఈ రేవంత్ రెడ్డి పట్ల కొంత సానుభూతి చూపించారు. తక్షణం ఆయనకు పదవీ వియోగం ఉండదేమో అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీసీ ముఖ్యమంత్రి త్వరలోనే వస్తారు అనకుండా.. ఐదేళ్ల తర్వాత తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు.. అంటూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించడం విశేషం.

తీన్మార్ మల్లన్న పార్టీ క్రమశిక్షణను నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా బహిరంగ ప్రకటనలు చేస్తూ రెచ్చిపోతూ ఉంటే ఇంకా కలకాలం పాటు కాంగ్రెస్ ఉపేక్షిస్తూ ఉంటుందా? లేదా ఏమైనా చర్యలు తీసుకుంటుందా వేసి చూడాలి.

3 Replies to “రేవంత్ కు ఐదేళ్ల గడువిచ్చిన తీన్మార్!”

  1. రెడ్డి లేకుండా తెలుగు రాష్టలలో రాజకీయం నడవదు గెలవదు సాగదు.. ఎవరికి ఇష్టం ఉన్నా నష్టం ఉన్నా కష్టం ఉన్నా అదే సత్యం…

Comments are closed.