పాలనలో ఏపీ సర్కార్ విచిత్ర పోకడలకు వెళుతోంది. సీఎం జగన్ మానసపుత్రిక సచివాలయ వ్యవస్థ. అలాంటి వ్యవస్థకు సంబంధించి ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడేలా నిర్ణయాలున్నాయి. ఇప్పటికే నిర్ణీత సమయానికి ప్రొబేషన్ అమలు చేయలేదని సర్కార్‌పై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వారి నెత్తిపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో శనివారం నుంచి మూడుసార్లు హాజరు అమలుకు శ్రీకారం చుట్టారు. ఇదే ఆ వ్యవస్థ ఉద్యోగులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు లేని నిబంధన తమకే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. మూడు దఫాల హాజరు కోసం వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక యాప్‌ను తయారు చేసింది. దీన్ని రెండు రోజుల క్రితం సచివాలయ ఉద్యోగుల స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఇవాళ్టి నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం 3, సాయంత్రం 5 గంటలకు తప్పనిసరిగా హాజరు వేసుకోవాల్సి వుంటుంది. ఉద్యోగుల పనిపై పర్యవేక్షణ ఉండడం మంచిదే కానీ, ఆ పేరుతో వేధించడం ఏంటని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమను అనుమానించనట్టుగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిరోజూ సచివాలయాల్లో నిర్వహించే స్పందనకు ఉద్యోగులు ఉండడం లేదనే సమాచారంతోనే మూడుసార్లు హాజరు ప్రవేశ పెట్టామని ప్రభుత్వం చెబుతోంది.
2019 అక్టోబర్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను జగన్ సర్కార్ నెలకొల్పింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే ఉద్దేశంతోనే సచివాలయ వ్యవస్థ తీసుకొస్తున్న సీఎం జగన్ ప్రకటించారు.
ఈ వ్యవస్థ రావడం వల్ల ప్రజలకు సేవలు మరింత చేరువయ్యాయి. ప్రతి చిన్న పనికి మండల కార్యాలయాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పింది. ప్రజలకు సేవలందిస్తున్న తమకు రెండేళ్లలో ప్రొబేషన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించి, మాట తప్పిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
అయితే శాఖాపరమైన పరీక్షల్లో అందరూ పాస్ కాలేదనే ఉద్దేశంతో 2022 జూన్‌లో అందరి ప్రొబేషన్ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సరేనని సరి పెట్టుకున్నా, సచివాలయ ఉద్యోగుల విషయంలో రోజుకో విచిత్ర నిబంధనతో ఇబ్బంది పెట్టడాన్ని మాత్రం ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు.