రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్మ సామాజిక వర్గం ఒంటరి అవుతోంది. ఇందుకు ఆ సామాజిక వర్గం స్వీయతప్పిదాలే కారణం. మంచి చేస్తే ఆ సామాజికవర్గం మొత్తానికి వర్తించదు. అదే చెడు చేస్తే మాత్రం వెంటనే సామాజిక వర్గానికి అంటుకుంటుంది. ఈ సూత్రం అన్ని సామాజిక వర్గాలకు వర్తిస్తుంది. సామాజిక వర్గాలను అనుసరించి మంచీచెడులు ఉండవు. అన్ని కులమతాల్లోనూ మంచీచెడు వుంటాయి. కానీ చిక్కల్లా ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలోని కొందరు అత్యుత్సాహంతో తమ బ్లెడ్, బ్రీడ్ వేరని చెప్పడం వల్లే, మిగిలిన సామాజిక వర్గాలకు దూరమవుతున్నారనేది వాస్తవం.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో కమ్మ సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నోరు పారేసుకున్నారు. దమ్ముంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టురా అని సవాల్ విసిరారు. అమరావతి తమ సామాజిక వర్గానిదే అని కమ్మ నేతలే పదేపదే ప్రచారం చేసుకున్నట్టుగా ఉంది. ఇదే ఆ సామాజిక వర్గాన్ని ఏపీలో అధికారానికి దూరం చేసిందనేది వాస్తవం.
ఇటీవల అమరావతి ఉద్యమ నాయకులతో ఏబీఎన్ ఎండీ ఆర్కే నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పారు. రాయలసీమలో దశాబ్దాల తరబడి రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం చెలాయిస్తున్న వారిపై మిగిలిన సామాజిక వర్గాలకు కోపం లేదన్నారు. ఇదే కోస్తా ప్రాంతానికి వస్తే ఎందుకని కమ్మ సామాజిక వర్గమంటే మిగిలిన సామాజిక వర్గాలకు కోపమని ప్రశ్నించారు. ఈ విషయమై ఆత్మపరిశీలన చేసుకోవాలని అదే సామాజిక వర్గానికి చెందిన మీడియాధిపతి వేమూరి రాధాకృష్ణ సూచించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
కమ్మ, రెడ్డి కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలమైనవి. ఇదే జనాభా రీత్యా ఒక్క శాతం మాత్రమే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఐదు శాతం లోపు జనాభా ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకుని, మిగిలిన సామాజిక వర్గాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాయనేది వాస్తవం. అయితే కమ్మ సామాజిక వర్గం విషయానికి వస్తే… మిగిలిన సామాజిక వర్గాలన్నీ తమ పల్లకీలు మోయడానికే ఉన్నట్టు అహంకారపూరితంగా వ్యవహరిస్తుండడం వల్లే సమాజానికి దూరమవుతున్నారనేది వాస్తవం.
ఇక తమ సామాజిక వర్గాన్ని మిగిలిన కులాల వాళ్లకు దూరం చేయడంలో నందమూరి బాలకృష్ణ, రేణుకాచౌదరి, కాట్రగడ్డ ప్రసన్న తదితర కమ్మ నేతల పేర్లు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు టీడీపీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. నేడు కేవలం కమ్మ సామాజిక వర్గానికే మాత్రమే పరిమితమవుతున్న దయనీయ స్థితి. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక సమీకరణాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మరింత దగ్గర చేసుకునేలా ఉన్నాయి. చివరికి సొంత సామాజిక వర్గంలోనే జగన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదే చంద్రబాబు, జగన్‌కు మధ్య తేడా.
కమ్మ కుల దైవంగా చంద్రబాబును ఎల్లో మీడియాతో పాటు ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చిత్రీకరిస్తున్నారు. ఇది టీడీపీకి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. బీసీల పార్టీగా గర్వంగా చెప్పుకునే టీడీపీ, నేడు ఆ వర్గానికి ఎందుకు దూరమైందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అమరావతి కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని ఏపీ సమాజం నమ్మడం వల్లే, రాజధాని ఉద్యమానికి మద్దతు కొరవడింది.
అమరావతిలో అణగారిన వర్గాలకు నివాస వసతి కల్పించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయిస్తే, అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ఏకంగా కోర్టుకెళ్లి అడ్డుకున్న ఘన చరిత్ర టీడీపీది. అమరావతి తమ సామాజిక అడ్డా అని అడుగడుగునా ఇతర సామాజిక వర్గాల ప్రవేశాన్ని అడ్డుకుంటుంటే, వారిపై అసూయ కాకుండా మరేం కలుగుతుందో చెప్పాలి.
ఇటీవల నంద్యాల బహిరంగ సభలో తన వెంట్రుక పీకలేరని జగన్ మాట్లాడ్డంపై రాజకీయంగా మూకుమ్మడి దాడి చేశారు. ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని టీడీపీ, ఎల్లో మీడియా నిలదీసింది. మరి ఒక సీఎంను పట్టుకుని ఒరేయ్, తురేయ్ అని రేణుకాచౌదరి లాంటి నేతలు కులం కోణంలో విమర్శించడంపై ఎందుకని ఎవరూ నోరు మెదపడం లేదు. ఏం అందరినీ నిందించడం తమ సామాజిక వర్గం హక్కుగా భావిస్తున్నారా? అని ప్రశ్నించే వాళ్లకు సమాధానం చెప్పాలి.
కమ్మ సామాజిక వర్గంలోని కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం… కులాన్ని సమాజానికి దూరం చేస్తున్నారనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఆ సామాజిక వర్గం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అప్పుడే మిగిలిన కులాల ఆదరణ చూరగొంటారు. లేదంటే రోజురోజుకూ దూరమవుతూనే ఉంటారని హెచ్చరించక తప్పదు. కులంలోని కొందరు చేసే తప్పునకు అందరూ బలి కావాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.