సౌత్ బ‌యోపిక్స్ సూప‌ర్, బాలీవుడ్ బ‌యోపిక్స్ బోల్తా!

ద‌క్షిణాది మూవీ మేక‌ర్లు తీస్తున్న బ‌యోపిక్స్ బాగా పాపులారిటీ సంపాదించుకుంటూ ఉండ‌గా, బాలీవుడ్ బ‌యోపిక్స్ మాత్రం పెద్ద‌గా ఆస‌క్తిని రేకెత్తించ‌లేక‌పోతున్నాయి.

బ‌యోపిక్స్.. గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీస్ లో బాగా ఆస‌క్తిని రేపుతున్న సినిమాలు. అప్ప‌టికే కొన్ని బ‌యోపిక్స్ వ‌చ్చినా.. పేర్లు మెన్ష‌న్ చేయ‌కుండా, రూపురేఖ‌లు కాస్తంతే మ్యాచ్ అయ్యేలా .. ఇలా బోలెడ‌న్ని జాగ్ర‌త్త‌లు క‌నిపించేవి. పెద్ద‌గా వివాదాస్ప‌దంగా తీయ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. బ‌యోపిక్స్ అంటే బ‌హు జాగ్ర‌త్త క‌నిపించేది.

2010కి ముందు అధికారిక బ‌యోపిక్స్ క‌న్నా, అన‌ధికారిక బ‌యోపిక్స్ ఎక్కువ‌! కాలం మారింది. సినిమా వాళ్ల‌కు అనేక మంది సెల‌బ్రిటీలు త‌మ బ‌యోపిక్స్ పై హ‌క్కులు ఇచ్చేస్తూ ఉన్నారు. అందుకు గానూ సినిమా వాళ్లు డ‌బ్బులిస్తున్నారు. అనేక బ‌యోపిక్స్ వెనుక అస‌లు వ్య‌క్తులు క‌నిపిస్తారు. వారి బ‌యోపిక్స్ ను చూసి వారే క‌న్నీళ్లు పెట్టుకున్న వాళ్లూ ఉన్నారు! కేవ‌లం బ‌యోపిక్సే కాకుండా, ఈవెంట్ బేస్డ్ సినిమాలు కూడా బోలెడ‌న్ని వ‌చ్చాయి.

నిజంగా జ‌రిగిన, జ‌రిగిన‌దిగా చెప్ప‌బ‌డినటువంటి సంఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాలు వ‌స్తూ ఉన్నాయి. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు ఏకాలం నుంచినే వ‌స్తున్నా.. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ లేటుగా ఈ రూటు ప‌ట్టుకుంది. ప‌ట్టుకోవ‌డం అయితే బాగానే ఉంది కానీ, గ‌త కొన్నాళ్ల ట్రెండ్స్ ను చూస్తే.. ద‌క్షిణాది మూవీ మేక‌ర్లు తీస్తున్న బ‌యోపిక్స్ బాగా పాపులారిటీ సంపాదించుకుంటూ ఉండ‌గా, బాలీవుడ్ బ‌యోపిక్స్ మాత్రం పెద్ద‌గా ఆస‌క్తిని రేకెత్తించ‌లేక‌పోతున్నాయి. ఆస‌క్తి, అనాస‌క్తి సంగ‌తెలా ఉన్నా.. క‌లెక్ష‌న్లే ఈ సినిమా విజ‌యానికి అయినా ప్రాతిపదిక అనుకుంటే, బాలీవుడ్ బ‌యోపిక్స్ వెనుక‌బ‌డి పోతున్నాయి. అదే సౌత్ బ‌యోపిక్స్ మాత్రం మంచి వ‌సూళ్ల‌ను సంపాదించుకుంటూ ఉన్నాయి. ఈ జాబితాను చూస్తే..

ఆడు జీవితం, అమ‌ర‌న్ లేటెస్ట్ స‌క్సెస్ లు!

బ‌యోపిక్స్ ప‌రంప‌ర‌లో మ‌ల‌యాళీ సినిమా ఆడు జీవితం, త‌మిళ సినిమా అమ‌ర‌న్ లు మంచి పేరును, డ‌బ్బును కూడా పొందిన సినిమాలుగా చెప్ప‌వ‌చ్చు. ఒక మ‌లయాళీ వ‌ల‌స కార్మికుడి క‌థ‌గా వ‌చ్చిన ఆడు జీవితం పృథ్విరాజ్ సుకుమారన్ కు మంచి పేరును తెచ్చి పెట్టింది. అలాగే క‌నీసం కేర‌ళ వ‌ర‌కూ అయినా ఈ సినిమాకు మంచి క‌లెక్ష‌న్లు ద‌క్కాయి. ప్ర‌త్యేకించి ఆ సినిమా కోసం పృథ్విరాజ్ పెట్టిన శ్ర‌మ సాధార‌ణ సినీ ప్రేక్ష‌కులు కూడా మెచ్చుకునే స్థాయిలో నిలిచింది. వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉండే కేర‌ళ జ‌నాల‌కు ఆ సినిమా ఎంత‌లా తాకి ఉంటుందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. పృథ్విరాజ్ న‌ట‌నా కెరీర్ ను ఆ సినిమా ఒక మెట్టు పైకి ఎక్కించింది! క‌మ‌ర్షియ‌ల్ గా కూడా ఆడు జీవితం బెనిఫిట్ గానే నిలిచింది.

ఒక త‌మిళ సినిమా అమ‌ర‌న్ క‌లెక్ష‌న్ల విష‌యంలో దూసుకుపోతూ ఉంది. ద‌క్షిణాదిన సైనికుల జీవితాలు, యుద్ధాల ఆధారంగా వ‌చ్చిన సినిమాలు చాలా చాలా త‌క్కువ‌. చాలా సినిమాల్లో ఏదో ఒక‌టీ రెండు యుద్ధ స‌న్నివేశాలు చూపించ‌డ‌మే ఎక్కువ అన్న‌ట్టుగా ఉండేది ప‌రిస్థితి. అయితే ఇప్పుడు ఆలోటును కూడా అమ‌ర‌న్ భ‌ర్తీ చేస్తూ ఉంది. మిల‌ట‌రీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఈ సినిమా ఆక‌ట్టుకుంది. క‌లెక్ష‌న్ల విష‌యంలో వంద కోట్ల మార్కును తొలి వారంలోనే దాటేసింది. బ‌యోపిక్స్ విష‌యంలో సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ దూసుకుపోతోందనేందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

ఈవెంట్ బేస్డ్ సినిమా మ‌న్యుమేల్ బాయ్స్

కొన్ని గంట‌ల సేపు జ‌రిగిన ఒక ఘ‌ట‌న ఆధారంగా ఒక ఫీచ‌ర్ ఫిల్మ్ తీయాలంటే చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అవ‌స‌రం. అలాంటి స్క్రిప్ట్ అంటే ఎలా ఉంటుందో చూపించింది మ‌న్యుమేల్ బాయ్స్. మ‌ల‌యాళంలో ఈవెంట్ బేస్డ్ సినిమాలు గ‌తంలో కూడా చాలా వ‌చ్చాయి. హాలీవుడ్ స్పిల్ బ‌ర్గ్ శైలిని ప‌ట్టుకుని ఒక చిన్న ఘ‌ట‌న ఆధారంగా, ఒక చిన్న పాయింట్ ఆధారంగా అక్క‌డ బోలెడు సినిమాలు వ‌చ్చి ఉంటాయి. అయితే వాట‌న్నింటినీ స్థాయి క‌న్నా చాలా బెస్ట్ గా నిలిచింది మ‌న్యుమేల్ బాయ్స్.

ఈ సినిమా మ‌ల‌యాళీ వెర్ష‌నే వంద కోట్ల రూపాయ‌ల మించి వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక తెలుగు అనువాదం కూడా మంచి వ‌సూళ్ల‌ను పొందింది. ఈ సినిమా చూసిన తెలుగు వాళ్లు కూడా.. దాంతో బాగా క‌నెక్ట్ అయ్యారు. ఆ సినిమా చూసిన‌ దగ్గ‌ర నుంచి రోజుల త‌ర‌బ‌డి త‌మ‌ను వెంటాడింద‌ని చెప్పిన ప్రేక్ష‌కులు చాలా మందే ఉన్నారు! ఈవెంట్ బేస్డ్ సినిమాల్లో మ‌న్యుమేల్ బాయ్స్ స్క్రిప్ట్ ను ద‌బెస్ట్ గా చెప్పొచ్చు. ఈ త‌ర‌హా సినిమాలు మ‌రిన్ని రావ‌డానికి ప్రోత్సాహ‌కంగా కూడా ఇది నిలుస్తోంది. వంద‌ల కోట్ల వ‌సూళ్ల నేప‌థ్యంలో.. క‌థాంశం ఏద‌నేది పెద్ద ప్ర‌ధానం కాద‌ని, చెప్పే తీరే ముఖ్య‌మ‌ని ఈ సినిమా సందేశాన్ని ఇస్తోంది!

మ‌రిన్ని బ‌యోపిక్స్ సూప‌ర్ హిట్!

వీటికి ముందు సూర్య ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా.. ఎయిర్ డెక్క‌న్ జీఆర్ గోపినాథ్ బ‌యోపిక్ ఆకాశం నీ హ‌ద్దురా గా వ‌చ్చి మంచి హిట్ అయ్యింది. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ప్ర‌శంస‌ల‌తో పాటు డ‌బ్బుల‌ను కూడా పొందింది. కేర‌ళ‌లో ఒక కాన్ మ‌న్ జీవిత క‌థ ఆధారంగా కురుప్ సినిమా వ‌చ్చింది. ఆ నేర‌గాడి జీవిత క‌థ అది. దుల్క‌ర్ స‌ల్మాన్ ఆ రోల్ చేశాడు. ఆస‌క్తిదాయ‌క‌మైన ఆ క్రైమ్ క‌థ క‌మ‌ర్షియ‌ల్ గా పెద్ద హిట్ కాక‌పోయిన‌ప్ప‌టికీ. చెప్పుకోద‌గిన సినిమాగా నిలిచింది. ఆ సినిమాను కేర‌ళ వ‌ర‌కే హిట్ గా చెప్పొచ్చు!

ఇక ఈ మ‌ధ్య‌న వ‌చ్చిన ల‌క్కీ భాస్క‌ర్ కూడా ఒక‌ర‌క‌మైన వాస్త‌వ‌క‌థ అని చెప్పొచ్చు. 80ల‌లో, 90ల‌లో చోటు చేసుకున్న ఆర్థిక నేరాల కు సంబంధించిన ఒక ఈవెంట్ బేస్డ్ సినిమాగా చెప్పొచ్చు. అలాగే మ‌ట్కా కూడా టైటిల్ బ‌ట్టి చూస్తే.. 80ల‌లో, 90ల‌లో తెలుగునాట చాలా మంది జీవితాల‌ను ప్ర‌భావితం చేసిన క‌థే. అయితే చెప్పడంలో అంత ఇంపాక్ట్ లేకుండా పోయింద‌నే విమ‌ర్శ ఈ సినిమా విష‌యంలో వినిపిస్తూ ఉంది.

ఏతావాతా.. మహాన‌టి తో మొద‌లుపెడితే ద‌క్షిణాదిన బ‌యోపిక్స్ ఆస‌క్తిని రేపుతూ ఉన్నాయి. వీలైన‌న్ని క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టుకుంటూ ఉన్నాయి. మ‌రిన్ని బ‌యోపిక్స్ , ఈవెంట్ బేస్డ్ సినిమాల‌కు ఇవి వెల్క‌మ్ చెబుతూ ఉన్నాయి!

బాలీవుడ్ బ‌యోపిక్స్ మాత్రం బోల్తా!

ఇక బ‌యోపిక్స్ రూప‌క‌ల్ప‌న విష‌యంలో బాలీవుడ్ కూడా వెనుక‌బ‌డి ఏమీ లేదు. వాస్త‌వానికి బ‌యోపిక్స్ ఫీవ‌ర్ ను తెప్పించింది బాలీవుడే. 2010 స‌మ‌యంలో వ‌చ్చిన డ‌ర్టీ పిక్చ‌ర్ అనేక బ‌యోపిక్స్ కు ఊపు తెచ్చింది. సిల్క్ స్మిత జీవిత క‌థ ఆధారంగా రూపొందించిన డ‌ర్టీ పిక్చర్ అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ గా నిలిచింది. న‌ట‌న‌, సంగీతం, స్క్రీన్ ప్లే ఇలా.. అన్ని ర‌కాలుగానూ ఆ సినిమా ఆక‌ట్టుకుంది. అక్క‌డ నుంచి బాలీవుడ్ లో బ‌యోపిక్స్ శ‌ర‌ప‌రంప‌ర వ‌చ్చింది. అయితే వాటిల్లో హిట్ వాటా మాత్రం త‌క్కువే!

స్పెష‌ల్ చ‌బ్బీస్ వంటి ఈవెంట్ బేస్డ్ సినిమాలు మెరుపులు మెరిపించినా, ఆ స్థాయి సినిమాలు మాత్రం రాలేద‌నే చెప్పాలి! ప్ర‌త్యేకించి చ‌రిత్రాత్మ‌క పాత్ర‌లు, చారిత్రాత్మ‌క ఘ‌ట్టాలు, రాజ‌కీయ నేత‌ల జీవితాలు, ఈవెంట్ బేస్డ్ సినిమాలు బోలెడ‌న్ని వ‌చ్చాయి, వ‌స్తున్నాయి! అయితే వ‌చ్చిన‌వి వ‌చ్చిన‌ట్టుగా వెళ్లిపోతూ ఉన్నాయి. త‌ర‌చి చూస్తే అక్ష‌య్ కుమారే బోలెడు బ‌యోపిక్స్ చేశాడు. అవేవ‌ద‌నేది తెలుసుకోవాలంటే గూగుల్ చేయాల్సిందే త‌ప్ప గుర్తుండిపోయే సినిమాలు కావు. ఇక కంగ‌నా ర‌నౌత్ కూడా చాలా పాట్లే ప‌డింది. అయితే ఏవీ అంత సానుకూల ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేదు! ఆఖ‌రికి కంగ‌నానే తెచ్చి, హిందీ ట‌చ్ తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తీసినా ఎవ‌రికీ ప‌ట్ట‌లేదు!

ఎందుకో బ‌యోపిక్స్ విష‌యంలో బాలీవుడ్ పూర్తిగా గాడి త‌ప్పిన‌ట్టుగానే ప్ర‌తి సినిమా వ‌స్తూ ఉంది. హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ స్థాయికి త‌గ్గ‌ట్టుగా బ‌యోపిక్స్ రావ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. కొన్ని సార్లు కాషాయ‌వాదాన్ని చాట‌డం కోసం బ‌యోపిక్స్ తీయ‌డం కూడా మొత్తం ఈ టాపిక్ నే అక్క‌డ కంగాళీగా మారుస్తూ ఉంది. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ వంటివి క‌లెక్ష‌న్ల‌ను సంపాదించినా, ఆఖ‌రికి 1983 అంటూ తీసినా ఎవ‌రికీ ప‌ట్ట‌లేదు! మొత్తానికి ఏర‌కంగా చూసినా బాలీవుడ్ బ‌యోపిక్స్ విష‌యంలో బోల్తా కొడుతూనే ఉంది!

7 Replies to “సౌత్ బ‌యోపిక్స్ సూప‌ర్, బాలీవుడ్ బ‌యోపిక్స్ బోల్తా!”

  1. సంజయ్ దత్ బయోపిక్ సంజు సూపర్ గా ఉంది. డర్టీ పిక్చర్ లో ప్రధాన పాత్రధారి విద్యా బాలన్ కు ఆ సంవత్సరం జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది

Comments are closed.