గంటా-అవంతి నవ్వుల పువ్వులు!

విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు ఒకే చోట కలసి నవ్వుల పువ్వులు చిందించారు.

విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు ఒకే చోట కలసి నవ్వుల పువ్వులు చిందించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం రాజకీయంగా సరికొత్త చర్చకు తెరలేపుతోంది. అల్లు అర్జున్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఈ ఇద్దరూ అక్కడ అలా ఫోటోలకు కనువిందు చేశారు.

గంటా-అవంతి రాజకీయంగా గురు-శిష్యులుగా పేరు పడ్డారు. గంటా ప్రజారాజ్యంలోకి వెళ్ళినప్పుడు, 2009 ఎన్నికల్లో అవంతిని భీమునిపట్నం నుంచి రాజకీయ అరంగేట్రం చేయించారు. ఈ ఇద్దరి మధ్య ఆ అనుబంధం అలా 2018 దాకా కొనసాగింది.

గంటాతో పాటే ఆయన వెంటే అన్నట్లు అవంతి రాజకీయ ప్రయాణం సాగింది. అయితే, 2019 ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేయాలని అవంతి భావించడం, అప్పటికే మంత్రిగా భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా తానూ అదే సీటు నుంచి పోటీ చేయాలని గట్టిగా భావించడంతో, ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.

అవంతి వైసీపీలోకి జంప్ చేసి భీమునిపట్నం నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రిగానూ పనిచేశారు. గంటా అయితే టీడీపీలోనే కొనసాగి, 2019లో వేరే చోట నుంచి పోటీ చేసినా, 2024లో మాత్రం భీమిలీ నుంచే బరిలోకి దిగి, అవంతిని భారీ మెజారిటీతో ఓడించారు.

ఇప్పుడు చూస్తే, వైసీపీతో రాజకీయ బంధాన్ని కట్ చేసుకున్న అవంతి మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. ఆయన రాకకు గురువు గంటా నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, ఈ ఇద్దరూ పక్కపక్కన నిలబడి నవ్వులు పూయించడంతో, మళ్లీ గురు-శిష్యులు ఒక్కటవుతున్నారా అన్నది అందరూ తర్కించుకుంటున్న మాట.

వైసీపీకి రాజీనామా చేసిన అవంతి, టీడీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. గంటా నుంచి “నో అబ్జెక్షన్” ఉంటే, అవంతి చేరిక త్వరలోనే ఉండవచ్చు అన్నది రాజకీయ వర్గాల మాటగా ఉంది.

9 Replies to “గంటా-అవంతి నవ్వుల పువ్వులు!”

Comments are closed.