ఏపీలో రెడ్‌బుక్ పాల‌న

ఏపీలో రాజ్యాంగానికి బ‌దులు రెడ్‌బుక్ పాల‌న న‌డుస్తోంద‌ని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి వాపోయారు

ఏపీలో రాజ్యాంగానికి బ‌దులు రెడ్‌బుక్ పాల‌న న‌డుస్తోంద‌ని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి వాపోయారు. పార్ల‌మెంట్‌లో రాజ్యాంగంపై జ‌రిగిన చ‌ర్చ‌లో వైసీపీ త‌ర‌పున డాక్ట‌ర్ గురుమూర్తి పాల్గొన్నారు. రాజ్యాంగం అంటే ఒక జీవ‌న ప‌త్రం అని ఆయ‌న అభివ‌ర్ణించారు. రాజ్యాంగం అంటే అస‌మాన‌త‌ల్ని త‌గ్గించే సాధ‌నం అని ఆయ‌న అన్నారు.

ప్ర‌పంచంలో భార‌త రాజ్యాంగానికి ఎంతో విశిష్ట‌త వుంద‌న్నారు. సామాన్యుల పాలిట రాజ్యాంగం అంటే ఒక శ్వాస అని గురుమూర్తి అన్నారు. రాజ్యాంగం వ‌ల్లే సామాజిక న్యాయం, స్వేచ్ఛ‌, సోద‌ర భావ‌న‌కు చోటు ద‌క్కింద‌ని ఆయ‌న తెలిపారు. రాజ్యాంగం లేని భార‌త‌దేశాన్ని ఊహించుకోలేమ‌న్నారు. 75 ఏళ్ల రాజ్యాంగ ప్ర‌యాణంలో ఎంతో అభివృద్ధి సాధించామ‌ని గురుమూర్తి కొనియాడారు.

ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన ప్ర‌జాస్వామ్య దేశంగా భార‌త్ అవత‌రించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం రాజ్యాంగ‌మే అని ఆయ‌న అన్నారు. కోట్లాది మంది ఓట‌ర్లు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొంటూ రాజ్యాంగంపై విశ్వాసాన్ని ప్ర‌క‌టిస్తున్నార‌ని గురుమూర్తి తెలిపారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం రాజ్యాంగం స్థానంలో రెడ్‌బుక్ పాల‌న సాగుతోంద‌ని విమ‌ర్శించారు.

ఆర్థిక‌, లింగ అస‌మాన‌త‌ల్ని సంపూర్ణంగా పార‌దోలితేనే నిజ‌మైన స‌మాన‌త్వం సాధిస్తామ‌న్నారు. ఏపీలో గ‌తంలో త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో సామాజిక న్యాయానికి, పార‌ద‌ర్శ‌క‌త‌కు అగ్ర‌స్థానం క‌ల్పించామ‌న్నారు. కానీ కూట‌మి పాల‌న వ‌ట్టి మాట‌ల‌కే ప‌రిమిత‌మైంద‌ని, ఏ ఒక్క హామీ కూడా అమ‌లుకు నోచుకోలేద‌ని తిరుప‌తి ఎంపీ తూర్పార‌ప‌ట్టారు.

7 Replies to “ఏపీలో రెడ్‌బుక్ పాల‌న”

Comments are closed.