2025లో మొదటి ఎన్నికలు ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. నామినేషన్లు వేయడానికి 17వ తేదీ వరకు గడువు వుంటుందని రాజీవ్‌కుమార్ తెలిపారు. నామినేషన్లను ఉపసంహరించుకోడానికి ఈ నెల 20 వరకు సమయం వుంటుందని ఆయన వివరించారు. అనంతరం వచ్చే నెల 5న ఎన్నికలు, 8న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వివరాలు వెల్లడించారు.
ఓట్ల తొలగింపు, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కూడా ఆయన సీరియస్‌గా స్పందించారు. ఓట్లు తొలగించామనడంలో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంల ద్వారానే ఎన్నికలను నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండనుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయి.