ఎన్నికలు ఇంకా ఏడాది దూరంలో ఉండగా ఒకరు ఏకంగా మేనిఫెస్టోనే ప్రకటించేశారు.. మీరందరూ ఇక ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లండి.. ప్రచారం షురూ చేయండి అని మరొకరు దిశానిర్దేశం చేసేశారు.. ఖాళీ దొరికిన వేళల్లో జనానికి దర్శనం ఇచ్చే మరో నాయకుడు.. సుదీర్ఘమైన ఖాళీలను తయారుచేసుకుని యాత్రలకు సిద్ధం అవుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసింది! దాదాపుగా అన్ని పార్టీల నాయకులు ఎన్నికల మోడ్ లోకి వెళ్లిపోయారు. నిజంచెప్పాలంటే.. ఇప్పుడేనా.. చాలా నెలలుగా అందరూ ఎన్నికల మోడ్ లోనే మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. ఇప్పుడు టాప్ గేర్ పడుతోంది అంతే!
ఏ పార్టీ ఏ మేరకు ఎలక్షన్ మూడ్ లోకి వచ్చింది.. వారి ప్రస్థానం ఎలా సాగుతోంది అనే విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఎలక్షన్ మో(మూ)డ్’
ఏడాదికి ముందు ఎలక్షన్ మూడ్ తెచ్చుకోవడం, ఎలక్షన్ మోడ్ లో పనిచేయడం ఎవరికైనా సాధ్యమేనా? ఎలక్షన్ మోడ్ అనగానే వాతావరణం మొత్తం మారిపోతుంది. పనిచేయాల్సిన తీరు మారిపోవాలి. నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల మధ్య తిరుగుతూ ఉండాలి. వారితో మమేకం అవుతూ ఉండాలి. ఎలక్షన్ అనే వ్యవహారంతో నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ.. ఎలక్షన్ టైం కు ప్రజల వద్దకు వెళ్లి వాళ్లను నమ్మించగల మాటలు కొన్ని చెప్పి లబ్ధి పొందాలని అనుకునే వాళ్లకు మాత్రం చాలా చాలా ఇబ్బంది.
నాయకుడు ప్రజల్లో ఉంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ను అందుకుంటూ ఉండాలి. నాయకుడు ప్రజల మధ్య కనిపిస్తే చాలు.. ప్రజలకు తమ అవసరాలు, ఆశలు గుర్తుకు వస్తాయి. ఈరోజుల్లో ఏదో సమయానుకూలంగా మాట చెప్పి, కాలం గడిపేసి రేపటికి మరచిపోవచ్చు అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. జనంలో నాయకుడు ఏం మాట్లాడినా, ఎలాంటి పనిచేసినా.. ఆ వ్యవహారం మొత్తం.. జనంలోనే ‘రికార్డు’ అవుతూ ఉంటుంది. జనంలోని ఒకరు సరదాగా గానీ, కావాలని గానీ రికార్డు చేస్తూనే ఉంటారు. నాయకులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇచ్చే మాట విషయంలో కూడా జాగ్రత్త పడాలి. మొత్తానికి ఎలక్షన్ మూడ్ లో ప్రజల మద్య పనిచేయడం చాలా కష్టసాధ్యమైన విషయం.
నాయకులందరూ ఎలక్షన్ కు సిద్ధమైపోయినట్టే ప్రస్తుత వాతావరణం ఉంది. తాజాగా కేబినెట్ భేటీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల గోదాలోకి దిగినట్టుగానే అందరూ పని ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబునాయుడు కూడా ఏకంగా మేనిఫెస్టో ఏడాది ముందే విడుదల చేసేసి శంఖారావం పూరించేశారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమవుతూ, జనవాణి పేరిట ప్రజల సమస్యలు స్వీకరిస్తానని అంటున్నారు, ఇది ఎన్నికల ప్రచారం కాదని అంటున్నారు గానీ.. అచ్చంగా అవి ఎన్నికల తీరులోనే సాగుతాయనడంలో సందేహంలేదు. టూర్ షెడ్యూల్స్ అలాగే కనిపిస్తున్నాయి.
ఈ మూడు పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్కు కొంత ఎడ్వాంటేజీ కనిపిస్తోంది. నిజానికి అందరూ ఇప్పుడు ఎన్నికల మూడ్ లోకి, మోడ్ లోకి వెళుతోంటే.. పైకి ఆ మాట చెప్పకుండా.. తన పార్టీ మొత్తాన్ని ఏడాదికి ముందునుంచి అలాంటి వాతావరణంలోకి తీసుకెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి. గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమ లక్ష్యం ఎన్నికలే. చాపకింద నీరులా ప్రభుత్వానికి మైలేజీ క్రియేట్ చేసిన కార్యక్రమం అది. సాధారణంగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాడు.. పదవీకాలంలో ఊర్లలో సభలు పెట్టడం తప్ప.. మళ్లీ ఓట్ల పండగ వచ్చే దాకా ఓటర్ల ఇళ్లకు వెళ్లడం అనేది చరిత్రలో ఎన్నడూ జరిగే వ్యవహారం కాదు.
ఈ సాంప్రదాయ దురహంకార రాజకీయాలకు జగన్ స్వస్తి చెప్పారు. అధికారంలో ఉన్నవాళ్లు ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబం కోసం తమ ప్రభుత్వం ఏం చేసిందో.. ‘ఆన్ పేపర్’ వారికి చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడక్కడా వారికి ప్రతి ఘటనలు కూడా ఎదురయ్యాయి. అది ఇంకా మంచే చేసింది. ఎందుకంటే.. ప్రజలు విన్నవించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు జగన్ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. తమ ఇంటికి వచ్చినప్పుడు తాము ఎమ్మెల్యేకు చెప్పిన సమస్య, కొన్ని వారాల్లోగా పరిష్కారం అయితే.. ఖచ్చితంగా జనంలో మంచి పేరు వస్తుందనేది మనం అర్థం చేసుకోదగిన సంగతి.
వాలంటీర్ల వ్యవస్థ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు బలం అవుతోంది. జనం సమస్యలు ఎప్పటికప్పుడు వారికి తెలుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాటిని పరిష్కరిస్తున్నారు. ఇలా ఎప్పటినుంచో వైసీపీ ఎలక్షన్ మోడ్ లోనే పనిచేస్తోంది.
‘ఫిక్సింగ్ ది ఎర్రర్స్’
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజానికి వ్యూహాత్మకంగా వెళుతున్నారో, లేదా, యాదృచ్ఛికంగా చేస్తున్నారో గానీ.. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళుతున్నారు. పాలనకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఇన్నాళ్ల పాలనలో కొన్ని పనుల వలన, కొన్ని వర్గాల వారికి అసంతృప్తులు కలగడం అనేది చాలా సహజం. అలాంటివన్నీ చక్కదిద్దుకోవడానికి, ఈ నాలుగేళ్లలో ఏమైనా పొరబాట్లు జరిగి ఉంటే వాటిని దిద్దేసి ‘ఫిక్స్’ చేయడానికి ముఖ్యమంత్రి ఈ అయిదో ఏడాదిని వాడుకుంటున్నారు. పాలనలో అయిదో ఏడాది ప్రారంభం నుంచి అదే పోకడ కనిపిస్తోంది. రాబోయే కాలంలో మరిన్ని దిద్దుబాటు చర్యలు కూడా ప్రభుత్వం నుంచి ఆశించవచ్చు.
ప్రధానంగా జగన్ సర్కారు పట్ల ఎవరిలోనైనా అసంతృప్తి ఏర్పడిందా? అంటే, ఉద్యోగుల పోరాటాన్నే ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. రెండు అంశాల్లో ఉద్యోగుల్లో జగన్ వ్యతిరేకతను తయారు చేసుకున్నారు. 11వ పీఆర్సీని అమలు చేయడంలో అనేక తలనొప్పులు ఎదురయ్యాయి. సీపీఎస్ రద్దు అనేది రెండోది. మొత్తానికి ఈ రెండు అంశాలను కూడా ఇప్పుడు దిద్దేసుకున్నారు.
11వ పీఆర్సీ అమలు చేసే సమయంలో సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిగాయి. మొత్తానికి ఉద్యోగులు అందరూ సెట్ అయ్యారు. వారికి పెండింగ్ మొత్తాలు మిగిలిపోయాయి. ఆ పెండింగ్ మొత్తాలను నాలుగేళ్లలోగా చెల్లిస్తాననే హామీతో తాజాగా ఆయన ఉద్యోగ సంఘాలను ఊరడించగలిగారు. దీనికంటె గొప్ప విషయం ఏంటంటే.. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కూడా అడగకముందే హామీ ఇచ్చేయడం. పోల్చి చూసుకున్నప్పుడు.. పొరుగున ఉన్న తెలంగాణలో 11 వ పీఆర్సీ బకాయిలకు ఇప్పటిదాకా అతీగతీ లేదు. హామీ కూడా లేదు. ఉద్యోగవర్గాల ఆదరణ తమకు అనవసరం అన్నట్టుగా కేసీఆర్ తీరు సాగిపోతోంది. 12వ పీఆర్సీ ఆలోచన కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. ఖచ్చితంగా ఏపీ ఉద్యోగులు పొరుగు రాష్ట్ర పరిస్థితులతో బేరీజు వేసుకుని.. జగన్ ప్రయత్నం పట్ల సానుకూల వైఖరి పెంచుకునే అవకాశం ఉంది. ఒకసారి 12 వ పీఆర్సీ గురించిన చర్చ మొదలు కాగానే.. ఇక పాత గొడవలన్నీ సమసిపోయినట్టే.
రెండోదైన సీపీఎస్ విషయంలో కేవలం ముందు చూపు లేకపోవడం వల్ల జగన్ పూర్తిగా ఇరుక్కుపోయారు. ఉద్యోగులు కూడా జగన్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని అనుకున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి రాగల ఇబ్బందులు, కాగల భారం పట్టించుకోలేదు. జగన్ ‘మాట తప్పకుండా మడమ తిప్పకుండా’ పాలన చేయాలని అనుకుంటారు గనుక.. ఆ ఒక్క అంశం మీదనే ఆయనను ఇరుకున పెట్టడం ప్రారంభించారు. కానీ జగన్ పాత పెన్షన్ విధనం తీసుకురాలేకపోయారు గానీ.. సీపీఎస్ రద్దువరకు మాట నిలబెట్టుకోగలిగారు. ఉద్యోగులకు దాదాపు ఓపీఎస్ తో సమానంగా లబ్ధి చేకూర్చే విధంగా జీపీఎస్ ను తీసుకువచ్చారు. దీని విధివిధానాలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగులు పూర్తిగా చల్లారుతారనడంలో సందేహం లేదు.
అలాగే జగన్ సర్కారుకు గ్రామీణ ప్రాంతాల్లో జనం నీరాజనాలు పడుతుండగా.. అర్బన్ ప్రాంతాల్లో జగన్ సర్కారు పట్ల వ్యతిరేకత ఉన్నదనే వాదన ఉంది. గ్రామాల్లో సంక్షేమ పథకాలు విరివిగా అమలవుతుండగా.. మధ్య, ఎగువ మధ్య తరగతి ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదనే దృష్టితో ప్రభుత్వం పట్ల విముఖత ఉందనేది ఒక ప్రచారం. యువతకు ఉద్యోగాల కల్పన వంటివి జరగడం లేదనేది కూడా ఒక అసంతృప్తి. ఈ కోణంలో కూడా జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విశాఖలో గ్లోబల్ సమ్మిట్ తో పరిశ్రమల రాకకు తెరలేపారు. ఈ ఏడాదిలో ఉద్యోగాల కల్పన ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాగే అభివృద్ధి పనుల మీద కూడా ఫోకస్ పెడుతున్నారు.
చంద్రబాబునాయుడు తన మేనిఫెస్టోలో ఇంటింటికీ తాగునీరు గురించి అమాయకంగా ప్రస్తావించారు గానీ.. నిజానికి కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే జలజీవన్ మిషన్ లక్ష్యం అదే. ఆ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేసేసే ప్రయత్నమూ జరుగుతోంది. అంటే బహుశా ఎన్నికల నాటికి చంద్రబాబు ఇంటింటికీ తాగునీరు ఇస్తా అనే హామీకి అసలు కాలదోషం పట్టిపోయే అవకాశం ఉంది.
జగన్ ఇంకా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేబినెట్ భేటీ తర్వాత.. ఇన్చార్జి మంత్రులంతా ఇక ఎన్నికల మోడ్ లోకి వెళ్లి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేయడంలో మర్మం అదే. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఉండే సమస్యలు సహా మీరే పరిష్కరిస్తూ ప్రజల్లో ఉండండి.. మిగిలిన వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను అని జగన్ వారికి చాలా గట్టి భరోసా ఇచ్చారు.
జనసేన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అనవసర ప్రాధాన్యం ఇస్తుందేమో అనేది కొందరి అభిప్రాయం. పవన్ కల్యాణ్ గుహకు మాత్రమే పరిమితమై ఉండే వ్యక్తి. అప్పుడప్పుడూ బయటకు వచ్చి వెళ్లిపోతుంటారు. ఆయన మాటల పట్ల ఎన్నటికీ జనంలో సీరియస్ నెస్ రాకపోవడానికి కూడా కారణం అదే. అయితే వైసీపీ చేస్తున్న తప్పు ఏంటంటే.. పవన్ కల్యాణ్ గుహలో ఉన్న సమయంలో కూడా ఆయన మీద విమర్శలు చేస్తూ.. ఆయనను పైకి లేపుతున్నారు. పవన్ జనంలో తిరిగినప్పుడు తప్ప.. సినిమా షూటింగుల్లో గడిపే సమయంలో జనమే ఆయనను మర్చిపోతున్నారు. అలాంటిది వైసీపీ పనిగట్టుకుని పవన్ ను అతిగా ప్రొజెక్టు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తీరును వారు కొంత మార్చుకోవాలి.
‘గేరింగ్ అప్ ఇన్ ఫియర్’
తెలుగుదేశం విషయం గమనిద్దాం. ఏడాది ముందు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చే పార్టీ మనదేశంలో ఏదీ ఉండదు. చంద్రబాబు ఆ రకంగా రికార్డు సృష్టించారు. ‘‘అల్ల…దిగో ఎన్నికలు వచ్చేశాయి.. వచ్చేస్తున్నాయి…’’ అనే పదాల మీదనే ఆయన ప్రస్తుత రాజకీయ మనుగడ సాగుతోంది. ముందస్తు ఎన్నికలు వచ్చేయబోతున్నాయి.. అనే అబద్ధాన్ని ప్రచారం చేయకుండా తన పార్టీకి మనుగడ లేదని చంద్రబాబునాయుడు భయపడుతున్నారు.
ఏడాది ముందుగా మేనిఫెస్టో ప్రకటన లక్ష్యం కూడా అదే. కాంట్రాక్టు వర్కులు, రోడ్ల పనులు వంటివి తప్ప.. ప్రజల కోసం సంక్షేమం అంటేమ అస్సలు పట్టించుకోని చంద్రబాబునాయుడు.. ప్రతి మహిళకు 1500, ప్రతి నిరుద్యోగికి 3000 వంటి అస్పష్ట హామీలతో జనాన్ని వంచించడానికి సిద్ధమయ్యారంటేనే.. ఆయన ఎన్నికల మోడ్ లోకి వెళ్లిపోయినట్టు అర్థం చేసుకోవాలి. ‘‘జగన్ పని అయిపోయింది.. ఆయన సంక్షేమ పథకాలను మరొక్క నెల కూడా కొనసాగించలేరు, డబ్బులు లేవు, వచ్చే అవకాశమూ లేదు.. ఒక్క నెల పథకాలు ఆగినా ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుంది.. ఆ భయంతో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారు..’’ అనేవి చంద్రబాబు చెబుతున్న మాటలు. తమాషా ఏంటంటే.. ఈ మాటలను ఆయన దాదాపు ఏడాదికాలంగా చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే చెబుతూ.. తన పార్టీ కట్టు తప్పి పోకుండా.. కష్టపడి పనిచేసేలా ప్రేరేపించడానికి పాట్లు పడుతున్నారు.
తన మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇంటింటికీ తిరగాలని చెప్పడం లాంటివి పార్టీని ప్రజల్లో తిప్పే, ఎన్నికల మూడ్ తీసుకువచ్చే వ్యవహారాలే. చంద్రబాబు కూడా చాలా చురుగ్గా విపరీతంగా పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఒకవైపు లోకేష్ చేస్తున్న పాదయాత్ర నిత్యం జగన్ సర్కారు మీద విమర్శల జడివానతో ఎన్నికల వాతావరణాన్నే తలపిస్తోంది.
‘ఇగ్నిషన్ ప్రాబ్లం’
జనసేన సంగతి చూస్తే.. ఎన్నికల మూడ్ లోకి రావాలంటే వారికి సంకోచం. ఆ మూడ్ లోకి వచ్చామని చెప్పుకోవాలంటే భయం. ఎందుకంటే.. ఒకసారి ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్టుగా ఒప్పుకుంటే ఇక షూటింగులకు దూరం కావాలి. లేకపోతే ప్రజలు క్షమించరు. పవన్ కల్యాణ్ ఒక ఎత్తుగడ ప్రకారం చేశారేమోగానీ..ఒకటి తర్వాత ఒకటి చేయకుండా.. అనేక సినిమాలను మొదలుపెట్టి కొంత కొంత పూర్తిచేసి.. అన్నీ ఎంగిలిగా వదిలేశారు. ఎన్నికల్లోగా అన్నింటినీ పూర్తి చేయడం టార్గెట్గా పెట్టుకుంటారు. అందుకే ఆ పార్టీ ఇంకా ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్టు చెప్పుకోవడం లేదు.
నిజానికి వారాహి వాహనం తయారై సుమారు ఏడాది అవుతోంది. అయినా ఇప్పటిదాకా ఇగ్నిషన్ ఇవ్వలేదు. ఈ నెలలో యాత్ర ప్రారంభం అవుతోంది గానీ, అది ఎన్నికల యాత్ర అనుకోవద్దు అని నాదెండ్ల మనోహర్ ముందుగానే ప్రకటించారు. అలా ఎందుకు అంటున్నారో పైన చెప్పుకున్నాం. నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే వారాహి యాత్రట! కాని ప్రతినియోజకవర్గంలో ఒక బహిరంగ సభ కూడా ఉంటుందిట.
ఇది ఎన్నికల ప్రచార యాత్ర కాదు అంటూ.. దానికి రుజువు అన్నట్టుగా జనవాణి కార్యక్రమం ప్రతిచోటా నిర్వహిస్తాం అని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ యాత్ర అని రకరకాల మాయమాటలు జనసేన చెబుతోంది. ఆయన చేస్తున్నది ఎన్నికల యాత్రే గానీ.. అలా చెప్పుకోడానికి భయపడుతున్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ వ్యవహారం ఆటలో అరటిపండు లాంటిది. ఆయన ఆట ఎప్పుడూ చంద్రబాబు స్పందనల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోడానికి ఎంతగా ఉత్సాహపడుతున్నారంటే.. ఈ క్షణంలో తెదేపా పొత్తు అక్కర్లేదు అంటే గనుక.. పవన్ – జనసేన రెండూ తల్లకిందులు అయిపోతారు. వారికి చేతులు ఆడవు. ప్లాన్ బి అనేది లేదు. కాబట్టి.. పవన్ గేమ్.. పూర్తిగా చంద్రబాబు ప్లాన్ మీద ఆధారపడి ఉంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆయనను వైసీపీ తప్ప మరెవ్వరూ సీరియస్ గా పట్టించుకోవడం లేదు.
పార్టీల పరంగా అందరూ ఎన్నికల మోడ్ లోకి వచ్చినట్టే. కానీ ప్రజలు ఇంకా ఆ మూడ్ లోకి రాలేదు. వారికి సరైన సమయంలోనే వారు ఆ మూడ్ లోకి వస్తారు. కాల మాన పరిస్థితులను బట్టి అప్పటికి సరైన నిర్ణయమే తీసుకుంటారు. వారి నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందే. వీరందరి వ్యూహాల కంటె కూడా తెలివైన వాళ్లు, విజ్ఞులు ప్రజలు మాత్రమే.
..ఎల్ విజయలక్ష్మి