శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామీజీని ఉన్నట్టుండి వివాదాస్పద స్వామిగా మారుస్తున్నదెవరు?
మీడియానా? రాజకీయమా? అన్యమతస్తులా? స్వమతంలో అసమ్మతి వాదులా? స్వయంకృతాపరాధమా?
జరుగుతున్న పరిణామాలనిబట్టి చూస్తుంటే కర్ణుడిచావుకి ఆరు కారణాల్లాగ చినజీయర్ ఎదుర్కొంటున్న వివాదాలకి పై కారాణాలన్నీ ఒకేసారి ముసురుకుంటున్నాయనిపిస్తోంది.
వివాదాలెప్పుడూ వార్తల్లో ఉన్నవారిపైనే ఎక్కువగా వస్తుంటాయి. ఆయన మానాన ఆయన ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకుని, కాలక్రమంలో మైహోం రామేశ్వరరావు ఆర్థిక సౌజన్యంతో ఆశ్రమాన్ని విశాలపరుచుకుని, భక్తకోటి సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ, ముఖ్యమంత్రులచేత పాదనమస్కారాలు చేయించూంటూ సాగుతున్న ఆయన జీవితం ఒక్కసారిగా కుదుపుకు గురౌతోంది.
ఇన్నేళ్ల ప్రస్థానంలో చినజీయర్ స్వామి రామానుజాచార్యుల సమతాస్ఫూర్తిని ప్రజల్లో రగిలించగలిగినంతవరకు రగిలించారు.
సనాతనధర్మంలో ఉన్న ఎన్నో కులాలవారిని అక్కునచేర్చుకుని వైష్ణవమత అనుయాయులుగా తీర్చిదిద్దగలిగారు. చాలామంది ఇష్టంగా ఈ మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు. వెలమకులస్థులైన మైహోం రామేశ్వరరావు కుటుంబం కూడా ఎన్నో దశాబ్దాలుగా చినజీయర్ భక్తులు, వైష్ణవాన్ని నమ్ముకుని బతుకుతున్నవారు.
అయితే ఆర్భాటం లేనిదే ప్రజలు దేనివైపూ కన్నెత్తికూడా చూడని రోజులివి. వందకోట్లకు పైగా ఖర్చుపెట్టి తీసిన సినిమా అంటేనే మీడియా అయినా, తద్వారా ప్రజలైనా కాస్త దృష్టిసారిస్తున్నారు.
అందుకే మాటలతోటీ, ప్రవచనాలతోటీ స్ఫూర్తిని రగిలించే పని కన్నా మూర్తిని నెలకొల్పడం మంచిదనుకున్నారు.
“సమతామూర్తి” పేరుతో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని గత కొన్నేళ్లుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆయన భక్తుడైన కుబేరుడులాంటి “మైహోం” రామేశ్వరరావు కూడా సాయాన్ని అందించి ఆయన కలని సాకారం చేసారు.
అంతవరకూ అంతా బాగానే ఉంది. ఎవరికీ పెద్దగా పేచీల్లేవు.
అయితే ఈ భారీవిగ్రహాన్ని ఎవరి చేత ఉద్ఘాటన చేయించాలి అని అనుకున్నప్పుడు.. ఎన్నో ఏళ్ల క్రితమే నరేంద్రమోదీ చేత చేయించాలని, అప్పుడే దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ దీనికి సరైన ప్రాచుర్యం వస్తుందని చినజీయర్ నమ్మారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కు ఆంతరంగిక మిత్రుడైన రామేశ్వరరావు ఈ విషయమ్మీద చర్చించకుండా లేరు. పైగా ఈ నిర్ణయం ఇప్పటిది కాదు. 2017 నాటిది. అప్పటికి కేసీయార్ కి బీజేపీ కి మధ్యన దూరం ఇప్పుడున్నంత లేదు. కేసీయార్ నుంచి ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరమూ రాలేదు.
అనుకున్నట్టుగానే విగ్రహం నెలకొల్పడం, అద్భుతంగా, ఆర్భాటంగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం, కేసీయార్ ప్రభుత్వపరంగా ఇచ్చిన వనరులని సక్రమంగా వాడుకుని కార్యక్రమానికి ఘనంగా తెరలేవడం జరిగిపోయాయి.
12 రోజుల కార్యక్రమంలో మొదటిరోజు కేసీయార్ ప్రాంగణానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి యాగశాలలు మొదలైనవి చూసి ఎప్పటిలాగానే చినజీయర్ కి వంగి నమస్కరించి మరీ వెళ్లారు.
అంతా సజావుగా జరుగుతున్న నేపథ్యంలో చినజీయర్ రాష్ట్రంలో ఏకైక రాజగురువుగా కనిపించారందరికీ.
కానీ సరిగ్గా నరేంద్రమోదీ విగ్రహం ఉద్ఘాటనకు వచ్చిన సాయంత్రం నుంచీ వాతావరణం మారిపోయింది.
మోదీ చేతులమీదుగా ముసుగు తీయించిన శిలాఫలకం మీదా ప్రధాని మోదీ పేరుతో పాటు ముఖ్యమంత్రి కేసీయార్ పేరు చెక్కలేదు.
కేంద్రం నుంచి అందిన శాసనం మేరకు చినజీయర్ అధ్వర్యంలో కేసీయార్ పేరు లేకుండా శిలాఫలకం తయారు చేయించినా ఆ విషయాన్ని కేసీయార్ కు ముందుగానే తెలియపరిచి ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ చెబితే అసలుకే మోసం వస్తుందేమో, నరేంద్రమోదీని రానీయకుండా కేసీయార్ అడ్డుకుంటారేమో అనే ఆలోచనలు చినజీయర్ మనసులో మెదిలుండొచ్చు. అందుకే ఆ విషయాన్ని దాచుంచొచ్చు. తర్వాత తెలిసి అలిగినా, ఎలాగో తనకు వంగి దండాలు పెట్టే ముఖ్యమంత్రే కాబట్టి అనునయించొచ్చులే అనుకుని ఉండొచ్చు.
కానీ అన్ని ప్రవచానాలు చెప్పే చినజీయర్ కు నన్నయ చెప్పిన ఈ మహాభారత పద్యం తట్టుంటే విషయాన్ని దాచేవారు కాదేమో.
నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణా
ఖండల శస్త్ర తుల్యము, జగన్నుత విప్రులయందు; నిక్కమీ
రెండును రాజులందు విపరీతము, కావున విప్రుడోపు; నో
పండతి శాంతుడయ్యు నరపాలుడు, శాపము గ్రమ్మరింపగన్!
‘బ్రాహ్మణులు నిండు మనసుతో ఉంటారు. వారి మనసు వెన్నలాంటిది. మాట మాత్రం తీక్షణంగా ఉంటుంది. రాజు మాట మెత్తగా ఉంటుంది. కానీ, మనసు కఠినంగా ఉంటుంది’ అని దీని భావం.
నేటి కాలంలో పేరుకు ప్రజలే రాజులైనా వారు ఎన్నుకున్న ముఖ్యమంత్రే రాష్ట్రానికి రాజులాంటివాడని వేరే చెప్పక్కర్లేదు. మరి అటువంటి ముఖ్యమంత్రి వంగి దండం పెడుతూ మెత్తగా మాట్లాడుతున్నాడు కదా అని అతని మనసు కూడా అలాగే ఉంటుందని చినజీయర్ తప్పు లెక్కవేయడం ఆశ్చర్యం.
శిలాఫలకం మీద తన పేరు లేదన్నదానికన్నా, ఆ విషయం తనకు ముందుగా చెప్పనందుకు ఎక్కువగా నొచ్చుకున్నారు కేసీయార్. దాని పర్యవసానమే ఆయన సమాపనోత్సవానికి ఏకంగా రాష్ట్రపతి వచ్చినా ముచ్చింతల్ వైపు తలకూడా తిప్పకపోవడం.
మరో వారంలో యాదాద్రికి తెరలేపే కార్యక్రమం ఉంది. చినజీయర్ చేతుల మీదుగా జరాగాల్సిన ఘట్టమది. కానీ ఇప్పటివరకూ ఆయన పేరు కూడా ఉచ్చరించడంలేదు కేసీయార్.
ఆధ్యాత్మిక గురువుపై అలిగి చేయి వదిలిన రాజుకు పరలోకంలో సద్గతులమాట దేవుడెరుగు కానీ, రాజుని దూరం చేసుకున్న ఆధ్యాతిక గురువుకు మాత్రం ఈ ఇహలోకంలో దుర్గతులు తప్పవన్నట్టుగా ఉంది.
ఎప్పుడైతే కేసీయార్ వంటి శక్తి తన పక్కన లేదని సంకేతాలందాయో చంద్రబాబునాయుడు వర్గం నోరెత్తి చినజీయర్ ని అనరాని మాటలంటున్నారు.
తన జీవితకాలంలో ఇంతటి హేయమైన పదాలతో ఆయన ఎప్పుడూ తిట్లు పడుండరు. సినీ నిర్మాత అశ్వినీదత్తు ఏకంగా “వెధవ..వాడు వీడు..బ్లాకు టికెట్లమ్ముకునేవాడు” అని సంబోధించారు చినజీయర్ ను.
సీపీఐ నారాయణ కూడా చాలా నీచంగా మాట్లాడారు ఆయన గురించి.
కారణమొక్కటే…ఆ విగ్రహ ఉద్ఘాటన కార్యక్రమానికి చంద్రబాబుకి ఆహ్వానం అందకపోవడమే. ఈ విషయాన్ని అన్యాపదేశంగా అశ్వినీదత్తు టీవీ సాక్షిగా బయటపెట్టారు కూడా.
రాజకీయ కారణాలవల్ల చినజీయర్ ఆహ్వానించలేకపోయారన్న సంగతి విడిగా చెప్పక్కర్లేదు. అయినా సరే…ఉచ్ఛనీచాలు మరిచి ఒక మతగురువుని అలా అనడం అసభ్యమే, అసహ్యమే.
దానికి వత్తాసుపాడుతూ తెదేపా అనుకూల మీడియా చినజీయర్ ను తిట్టిపోయించడంలో అత్యుత్సాహం బాగానే ప్రదర్శిస్తోంది.
స్వార్థంతో స్వమతానికి చెందిన ఒక గురువును పెద్దగా బరువులేని కారణాలకే అంతలా విమర్శించి వీళ్లు మతానికి చెస్తున్న ద్రోహం ఎంతటితో వారి విజ్ఞతకే తెలియాలి.
వీరికి తోడు సమయమొచ్చింది కదా అని కే ఏ పాల్ కూడా స్వామీజీకి నిథులెక్కడివి అంటూ ఏదో వీడియో వదిలారు.
తమకు అన్నీ బాగానే సాగుతున్నా జాతివైరంతో కొన్ని కులాలమీద పడి ఏడ్చే వారిలో చినజీయర్ మీద, రామేశ్వరరావు మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడుతున్నవారు కూడా ఉన్నారు.
ఇక స్వయంకృతం విషయానికొద్దాం. చినజీయర్ గతంలోనూ, ఈ మధ్య కొన్ని అనుచితవ్యాఖ్యలు చేసారు.
మాంసాహారం గురించి అవహేళనగా మాట్లాడుతూ, “కోడి తింటే కోడి బుద్ధొస్తుంది….” అంటూ ఏదో చెప్పారు. ఆ వీడియో వైరలైపోయింది.
నిజానికి శాకాహారమే సరైనదని సనాతనగ్రంథాల్లో క్లియర్ గా ఎక్కడా చెప్పలేదు. అది పక్కన పెడితే ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఏ సైన్సుతో అయితే నడుస్తోందో ఆ సైన్సుని పరిచయం చేసినవాళ్లంతా మాంసాహారులైన పాశ్చాత్యులే. శాకాహారానికి, బుద్ధులకి లింకు పెట్టి ఈ సొషల్ మీడియా యుగంలో మాట్లాడడం చినజీయర్ అనాలోచిత చర్యకి నిదర్శనం. దీనివల్ల ఎంతో మంది మాంసాహారుల మనసులకి ఈయన దూరమయ్యారు.
అలాగే పనిలో పనిగా అప్పుడెప్పుడో సమ్మక్క-సారక్క మీద మాట్లాడిన విషయం కూడా ఇప్పుడు వైరల్ అయ్యి శాపంలా ఆయన వెంటపడుతోంది. ఈ వీడియో వల్ల కొన్ని సామాజిక వర్గాలు, మరీ ముఖ్యంగా కులంతో సంబంధం లేకుండా తెలంగాణా వాసులు హర్టవుతున్నారు.
ఇదే కాకుండా రామానుజుల సిద్ధాంతాన్ని పెద్దది చేయడం కోసం ఆది శంకారాచార్య్ల అద్వైతాన్ని చిన్నది చేస్తూ మాట్లాడిన మాటలు స్వమతంలోని శైవవర్గానికి, తటస్థులకు సమ్మతంగా తోచలేదు. ఆయా వర్గాల వాళ్లు కూడా చినజీయర్ ను చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు.
స్వామీజీలు ఏది మాట్లాడినా అచి తూచి మాట్లాడాలి. ఫ్లోలో వచ్చిందని, సరదాగా అన్నానని సమాన్యులలాగ కవరింగిచ్చుకునే వెసులుబాటు ఉండదు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే.
ఇన్నాళ్లూ ఎలా మాట్లాడినా స్వామీజీకి చెల్లింది. ఎప్పుడైతే కేసీయార్ కి ఈయనతో దూరం పెరిగిందన్న వార్త బయటికొచ్చిందో కవచం తొలగిన సైనికుడిలాగ ఉంది స్వామీజీ పరిస్థితి.
సనాతన ధర్మాన్ని నిలబెట్టే శక్తులు స్వామీజీలు కాదు. వారి వెనుకున్న రాజకీయ నేతలు.
అక్కడ మోదీ అయినా, ఇక్కడ కేసీయార్ అయినా ప్రజల్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావితం చేయగల దిట్టలు.
అటువంటి రాజుల మనసు నొప్పించకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్వామీజీలది. అలాగే స్వామీజీల తప్పుల్ని పెద్దమనసుతో అర్థం చేసుకుని తమకోసం కాకపోయినా సనాతన ధర్మ పరిరక్షణ కోసమైనా మన్నించి ముందుకు నడవాల్సిన బాధ్యత కూడా రాజకీయనాయకులకుంటుంది.
అన్నట్టు ఈ వ్యాసంలో ఉటంకించిన మహాభారత పద్యం ఆరేళ్ల క్రితం కేసీయార్ ఒక ప్రసంగంలో ప్రస్తావించినదే. రాష్ట్రాన్నేలే రాజు కాబట్టి ఆయనదే ఫాలో అవుతున్నట్టున్నారు.
– శ్రీనివాసమూర్తి