తాము రాజకీయాల్లో ఉన్నాము కాబట్టి వ్యాపారాలు మానేస్తామని వైసీపీ నేతలు ఎవ్వరూ గతంలో స్టేట్ మెంట్స్ ఇవ్వలేదు. రాజకీయాల్లో రాణిస్తూనే, తమ వ్యాపారాలు కూడా కొనసాగించారు. మరి పవన్ పైనే ఎందుకు ఇన్ని విమర్శలు. ఎందుకంటే, స్వయంగా తనకుతానుగా పవన్ కల్యాణే గతంలో స్టేట్ మెంట్ ఇచ్చుకున్నారు కాబట్టి.
రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఇకపై సినిమాల్లో నటించనని స్వయంగా పవనుడే ఎన్నికలకు ముందు స్వీయ ప్రకటన చేసుకున్నారు. నిజానికి తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, ఎప్పుడూ ప్రజాసేవ పైనే మనసు ఉండేదని అప్పట్లో కబుర్లు చెప్పారు. అలా సెంటిమెంట్ రాజేసి, ఓట్లు కొల్లగొట్టాలని చూశారు. కానీ పవన్ పప్పులుడకలేదు. పోటీచేసిన 2 స్థానాల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోవడంతో వెంటనే మాట-మనసు మార్చుకున్నారు. సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్లి ముఖానికి రంగేసుకున్నారు. ఈ విషయంలో బాబుతో చేసిన సావాసం పవన్ కు బాగా పనికొచ్చింది.
అప్పుడు ఒకలా మాట్లాడి, ఇప్పుడు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టే పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాన్ని ఆయన మరోలా తిప్పికొట్టి ఉంటే బాగుండేది. “మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ నేను సినిమాలు చేయకూడదా” అనే పిచ్చి లాజిక్ పవన్ కు సూట్ అవ్వలేదు.
నిజంగా ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఇంత రాద్దాంతం కూడా ఉండేది కాదు. కానీ ఎన్నికలకు ముందు సినిమాలు మానేస్తానని చెప్పి, ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వెళ్లడమే విమర్శలకు కారణమైంది.
రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఇకపై సినిమాలు చేయనని చెప్పింది పవనే. చెప్పిన మాటకు కట్టుబడకుండా సైలెంట్ గా వెళ్లి ముఖానికి రంగేసుకున్నది పవనే. రాజకీయాల్లోకి వచ్చావు కాబట్టి సినిమాలు మానేయమని అప్పట్లో ఎవ్వరూ డిమాండ్ చేయలేదు.
ఓడిపోయిన తర్వాత వెళ్లి సినిమాలు చేసుకోమని కూడా ఎవ్వరూ సూచించలేదు. అన్నీ పవనే చేస్తున్నారు. ఆయనే అన్నీ అంటున్నారు. పైపెచ్చు ఆయనే ఆవేశపడుతున్నారు. ఇదే పవన్ గతంలో ఇంకో మాట కూడా ఉన్నారు.
జగన్ గెలిచిన తర్వాత స్పందిస్తూ, నిజంగా ఆయన పాలన బాగుంటే తను రాజకీయాల్లో కొనసాగాల్సిన ఆవశ్యకత లేదని, వెళ్లి సినిమాలు చేసుకుంటానని శెలవిచ్చారు. అప్పటి స్టేట్ మెంట్ ను కూడా జనసేనాని ఇప్పుడు ఓసారి గుర్తుకుతెచ్చుకుంటే మంచిదేమో. ఇలా రోడ్డుపై గొంతు చించుకొని, ఆవేశపడాల్సిన అవసరం వచ్చేది కాదు.