ప్రియుడి మోజులోనో..అక్రమ సంబంధం నేపథ్యంలోనో.. భర్తలను హత్యలు చేయించిన భార్యలు బోలెడంత మంది వార్తల్లోకి ఎక్కి ఉంటారు. అక్రమ సంబంధానికి అడ్డని పిల్లలను చంపుకున్న మహిళలు, మగవాళ్లు కూడా ఉండనే ఉంటారు. ఈ విషయంలో మగవాళ్లను కూడా వెనకేసుకు వచ్చేలా ఏమీ లేదు పరిస్థితి.
అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యలను హత్య చేసిన భర్తలూ ఉండనే ఉంటారు. అయితే కుటుంబ ప్రాధాన్యత ఉండే మన సమాజంలో అక్రమ సంబంధాల కోసమో, ప్రియుడి మోజులోనో భర్తను హత్య చేయించే స్త్రీలు మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.
ఈ విషయంలో ఈ మధ్యకాలంలో వార్తలకు ఎక్కిన పలు కేసులు విస్మయాన్ని కలిగించాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గఫార్ బేగ్ అనే యువకుడి హత్య వెనుక షాకింగ్ ఫ్యాక్ట్ ను బయట పెట్టారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో మరణించిన గఫార్ బేగ్ గురించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు 24 గంటల్లోపు వ్యవధిలోనే బయటపడ్డాయి.
కోటకందుకూరు సమీపాన రోడ్డు పక్కన యువకుడి మృతదేహం అనే సమాచారం అందుకున్న పోలీసులు మొదట అది రోడ్డు ప్రమాదం అనుకున్నారు. అయితే మృతుడికి కత్తిపోట్లు ఉండటంతో.. విచారణ మొదలైంది. అతడి కాల్ డేటాను బయటకు తీయగానే మొత్తం వ్యవహారం బయటపడింది.
హత్యకు గురి కావడానికి ముందు.. అతడు తనకు కాబోయే భార్యతో సమావేశం అయినట్టుగా కాల్ డేటాను బట్టి తెలిసింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. తొందరగానే కథ బయటకు వచ్చింది. డిగ్రీ సెకెండియర్ చదువుతున్న ఒక యువతితో గఫార్ బేగ్ కు ఇటీవలే పెళ్లి కుదిరిందట.
ఆ అమ్మాయికి కాలేజీలో మరో యువకుడితో ప్రేమ ఉందట. ఇంట్లో వాళ్లు బలవంతం మీద ఆమెకు పెళ్లి కుదిర్చారట. గఫార్ బేగ్ కు పెళ్లి వద్దని చెబితే పోయేదేమో, అయితే ఆ యువతి అలా కాకుండా చాలా కిరాతకంగా ఆలోచించినట్టుగా ఉంది. ఆమె ప్రియుడు, అతడి స్నేహితులు ఇద్దరు కలిసి.. గఫార్ ను హత్య చేసేందుకు ప్రణాళిక రచించి అమలు చేసినట్టుగా పోలీసుల విచారణలో బయటపడిందట.
చాలా ప్లాన్డ్ గా గఫార్ ను ఒక చోటకు పిలిపించి, అతడితో కొన్నాళ్లుగా సన్నిహితంగానే ఉంటూ, ఆ అమ్మాయి అతడి హత్యలో పాలుపంచుకుంది. పెళ్లి కుదిరాకా తన ఎఫైర్ గురించి అతడికి చెప్పలేదు, అంతటితో ఎఫైర్ కూడా ముగించకుండా, కాబోయే భర్తను హత్య చేయిస్తే పెళ్లి ఆగిపోతుందనేంత కిరాతకంగా ఒక టీనేజ్ యువతి ఆలోచించిందంటే, ప్రియుడితో కలిసి అంత కుట్రను అమలు చేసిందంటే.. ఇంత కిరాతకంగా ఆలోచిస్తున్నారా! అనే ఆశ్చర్యం కలుగుతుంది.
కాబోయే భర్తకు ఫోన్ చేసి.. తనను చూడాలని ఉందంటూ చెప్పి, ఒక చోటకు పిలిపించుకుందట ఆ యువతి. అతడేమో ఆ అమ్మాయిపై ప్రేమతో స్వీట్లు, ఫ్రూట్స్ కూడా పట్టుకుని వచ్చాడట. దాదాపు రెండు గంటల పాటు వారిద్దరూ ఏకాంతంగా గడిపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
తనకు కాబోయే భార్యకు తనపై చాలా ప్రేమ ఉందనే ఉత్సాహంలో ఆ భేటీని ముగించుకుని సింగిల్ గా బైక్ మీద వెళ్లిన అతడికి ఆమె ఉచ్చు పన్నింది. దారిలో తన వాళ్లను పంపి.. హత్య చేయించింది. ఈ కుట్రలో కీలక భాగస్వామి అయ్యింది ఆ యువతి.
ప్రియుడి మోజులో ఉన్న వారు భర్తను అంటే ఎలాగూ వదిలించుకోలేక హత్య చేయించారంటే అదో రకమైన కిరాతకం. కానీ మరీ కాబోయే భర్తనే హత్య చేయించిందంటే మాత్రం.. ఆ యువతి మామూలు కిరాతకురాలు కాదేమో! ఈ హత్యలో మొత్తం ముగ్గురు యువకులు పాలుపంచుకున్నారని పోలీసులు నిర్ధారిస్తున్నారు.
ఇలాంటి హత్యలకు కూడా చేతులు కలిపే స్నేహితులు ఉన్నారంటే.. యువతలో కొంతమంది ఎంత పెడధోరణిలో ఆలోచిస్తున్నారో, ఇంతటి దారుణాలకు కూడా ఒడిగట్టేందుకు వెనుకాడటం లేదనే అంశాలు ఆందోళన రేపుతాయి.