దొంగల్ని పట్టే స్థావరంలోనే దొంగతనం

ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగని ఘటన ఇది. అక్రమార్కుల అంతు తేల్చే సంస్థగా, క్లిష్టమైన కేసుల్ని పరిష్కరించే ఏజెన్సీగా గుర్తింపు తెచ్చుకున్న సీబీఐలోనే దొంగతనం జరిగింది. అది కూడా అలాంటిలాంటి చోరీ కాదు. ఏకంగా…

ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగని ఘటన ఇది. అక్రమార్కుల అంతు తేల్చే సంస్థగా, క్లిష్టమైన కేసుల్ని పరిష్కరించే ఏజెన్సీగా గుర్తింపు తెచ్చుకున్న సీబీఐలోనే దొంగతనం జరిగింది. అది కూడా అలాంటిలాంటి చోరీ కాదు. ఏకంగా వంద కిలోల బంగారం మాయం.

ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది?

2012లో చెన్నైలోని సురానా కార్పొరేషన్ లిమిటెడ్ పై సీబీఐ కేసు వేసింది. అక్రమాల వెలికితీతలో భాగంగా 400 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బిస్కెట్లు, నగల రూపంలో ఉన్న ఆ బంగారాన్ని చెన్నైలోని సీబీఐ ఆఫీస్ లో ఉన్న సేఫ్ లాకర్ లో పెట్టి తాళం వేశారు. ఆ తాళాన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి కూడా అందించారు.

కట్ చేస్తే.. 2013లో సురానా కంపెనీపై మరో కేసు నమోదైంది. ఈ కేసు కోసం 2012లో సీజ్ చేసిన బంగారాన్ని ఇటు ట్రాన్సఫర్ చేస్తే సరిపోతుందని సీబీఐ వాదించింది. లాకర్ లో బంగారం అలానే ఉంది, కేసు మాత్రం ఇటు బదిలీ అయింది. అయితే ఈ కేసును 2015లో కోర్టు కొట్టేసింది. లాకర్ లో ఉన్న బంగారాన్ని డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కు అప్పగించాలని తీర్పుచెప్పింది.

సరిగ్గా ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. సురానా కంపెనీ, తన బ్యాంక్ కు రుణాలు ఎగవేసిందని, దాదాపు 1160 కోట్ల రూపాయల రుణం బాకీ ఉన్నందున, సీబీఐ ఆధీనంలో ఉన్న బంగారాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది.

తాజా పరిస్థితేంటి?

ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ లో ఎస్బీఐకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సురానా కంపెనీ ఏఏ బ్యాంకులకు రుణాలు ఎగవేసిందో, ఆ బ్యాంకులకు బంగారాన్ని పంచాలనే ఆదేశాలకు అనుగుణంగా.. అధికారుల సమక్షంలో లాకర్ తెరిచారు. తీరా తూకం వేస్తే ఏకంగా 100 కిలోల బంగారం మాయమైనట్టు తేలింది.

వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి వంద కిలోల బంగారం మిస్సయింది. దీనిపై ఇప్పుడు మరో కేసు నమోదైంది. సీబీఐ ఆఫీస్ లో మాయమైన బంగారం ఆచూకి కనిబెట్టేందుకు, ఎస్పీ ర్యాంక్ అధికారితో దర్యాప్తు చేపట్టాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 8 ఏళ్లుగా జరుగుతున్న వరుస పరిణామాలతో ఆ బంగారం ఎక్కడ, ఎలా మిస్సయిందనేది మిస్టరీగా మారింది.

మ‌రో జోస్యం వ‌దిలిన స‌బ్బం