బాబును అరెస్ట్ చేసే తీరు ఇదా?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌- సీమెన్స్‌ ప్రాజెక్టులో అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి ఏ1 నిందితుడు చంద్ర‌బాబునాయుడు అరెస్ట్ తీరు వైసీపీకి రాజ‌కీయంగా న‌ష్టం తీసుకొచ్చేలా వుంది. చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నంద్యాల‌లో ఉన్నారు. చుట్టూ వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు,…

స్కిల్‌ డెవలప్‌మెంట్‌- సీమెన్స్‌ ప్రాజెక్టులో అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి ఏ1 నిందితుడు చంద్ర‌బాబునాయుడు అరెస్ట్ తీరు వైసీపీకి రాజ‌కీయంగా న‌ష్టం తీసుకొచ్చేలా వుంది. చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నంద్యాల‌లో ఉన్నారు. చుట్టూ వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉండ‌గా, అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ అధికారులు వెళ్ల‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ వ్య‌వ‌హారంలో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ప్ర‌భుత్వం గుర్తించింది. దీనిపై నిగ్గు తేల్చేందుకు మంత్రి వ‌ర్గ ఉన‌సంఘం విచార‌ణ చేప‌ట్టింది. అనంత‌రం  2020 డిసెంబర్‌ 10న విజిలెన్స్‌ విచారణ, 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత ఈ కేసును 2021 డిసెంబర్‌ 9న సీఐడీకి బదిలీ చేశారు.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా చంద్ర‌బాబునాయుడు, ఏ2గా అచ్చెన్నాయుడిని చేర్చారు. అవినీతికి పాల్ప‌డిన కేసులో నిందితుల‌ను అరెస్ట్ చేయ‌డంపై ఎవ‌రికీ అభ్యంత‌రాలు వుండాల్సిన అవ‌స‌రం లేదు. అయితే అరెస్ట్ చేసే తీరు బాగుండాలి. చంద్ర‌బాబును అరెస్ట్ చేయాల‌ని అనుకుంటే, ఆయ‌న జ‌నం మ‌ధ్య‌లో వున్న స‌మ‌యంలోనే చ‌ర్య‌లు చేప‌ట్టాలా? చంద్ర‌బాబు చుట్టూ పెద్ద సంఖ్య‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉండ‌గా, అరెస్ట్ ఉద్రిక్త‌త‌కు దారి తీయదా? ఈ మాత్రం స్పృహ సీఐడీకి లేదా?

చంద్ర‌బాబు అరెస్ట్‌పై నంద్యాల న‌డిరోడ్డులో హైడ్రామాకు తెర‌లేచింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడైన చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న లాయ‌ర్లు, ఇత‌ర నాయ‌కులు న‌డివీధిలో నిలిచి అరెస్ట్ చేయ‌డానికి వ‌చ్చిన సీఐడీ అధికారుల‌ను ప్ర‌శ్నిస్తుండడాన్ని అన్ని చాన‌ళ్లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నాయి. ఇలాంటి చ‌ర్య‌లు చంద్ర‌బాబునాయుడికి రాజ‌కీయంగా మైలేజీ పెంచ‌డానికే త‌ప్ప‌, అధికార పార్టీ సాధించేది ఏమిటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

ఒక‌పైపు త‌మ నాయ‌కుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. నంద్యాల‌లో చంద్ర‌బాబును అరెస్ట్ చేశారనే ప్ర‌చారం త‌ప్ప‌, ఆయ‌న్ను అక్క‌డి నుంచే ఇంత వ‌ర‌కూ త‌ర‌లించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నంద్యాల న‌డివీధిలో చంద్ర‌బాబును అట్లే కూచోపెట్టి చ‌ర్చిస్తే టీడీపీకి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగించ‌డం త‌ప్ప మ‌రేమీ జ‌ర‌గ‌దు. 

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడే అరెస్ట్ చేయాల‌న్న ఆలోచ‌న ఎవ‌రిదో కానీ, ఇంత బుద్ధి త‌క్కువ ప‌నులు చేయ‌డం వైసీపీ ప్ర‌భుత్వానికే చెల్లు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.