దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు!

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ రాజకీయంగా చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా పదవిని పొందగల హక్కు సంపాదించుకున్నప్పటికీ ఆమె…

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ రాజకీయంగా చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా పదవిని పొందగల హక్కు సంపాదించుకున్నప్పటికీ ఆమె కల నెరవేరడం లేదు. బారాస ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రకరకాలుగా ఉంది. 

గద్వాలో 2018 ఎన్నికల్లో డికె అరుణను ఓడించిన క్రిష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన స్థానంలో డికె అరుణ ఎన్నికైనట్టుగా ప్రకటించాలని హైకోర్టు తీర్పు చెప్పిన దరిమిలా.. ఆ తీర్పు ఆచరణలోకి రావడం అనేది దుస్సాధ్యంగా మారుతోంది. హైకోర్టు తీర్పును కేసీఆర్ సర్కారు నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు. 

పాపం డికె అరుణ పరిస్థితి దయనీయంగా తయారైంది. తనను ఓడించిన భారాస అభ్యర్థి బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి ఎన్నికల అక్రమాల మీద ఆమె నాలుగేళ్లకుపైగా సుదీర్ఘ న్యాయపోరాటం సాగించి.. చిట్టచివరకు ఆయన అనర్హుడు అని తేల్చారు. దేవుడు వరమిచ్చినా కూడా పూజారి వరమివ్వలేదన్న చందంగా.. హైకోర్టు  తీర్పు ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం లేదా అసెంబ్లీ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. 

దీంతో డికె అరుణ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణం క్రిష్ణమోహన్ ను అనర్ముడిగా ప్రకటించి.. డికె అరుణతో ప్రమాణం చేయిచాంలని అసెంబ్లీ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అయినా అది ఇప్పుడే అమలవుతుందా లేదా చెప్పడం కష్టం. 

నిజానికి తెలంగాణలో రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇలాంటి తీర్పులు వచ్చాయి. కొత్తగూడెంలో అప్పట్లో కాంగ్రెసు తరఫున గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తేల్చింది. ఆయన స్థానంలో అప్పట్లో భారాస తరఫున పోటీచేసి ఓడిపోయిన జలగం వెంకటరావును ఎమెల్యేగా ప్రకటించాలని పేర్కొంది. అయితే గెలిచిన తర్వాత భారాసలో చేరిపోయి ప్రస్తుతం కేసీఆర్ ప్రాపకంలోనే ఉన్న వనమా సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. జలగం వెంకటరావు ప్రమాణం ఆగింది. దానికి తగ్గట్టుగా.. కొత్తగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొత్తగూడెం నుంచి జలగం పేరునే కేసీఆర్ ధ్రువీకరించడంతో.. ఆయన తరఫు నుంచి పెద్దగా అసమ్మతి లేకుండా సద్దుమణిగిపోయింది. 

కానీ గద్వాల ఎన్నిక, డికె అరుణ విషయంలో అలా కాదు. అరుణ విషయంలో కోర్టు తీర్పును గౌరవించడం అంటే.. భారాస ఒక ఎమ్మెల్యేను కోల్పోవడం కింద అవుతుంది. అందుకు బహుశా భారాసకు ఇష్టంలేకపోవచ్చు. అందువల్లనే తీర్పును అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టులో గెలిచిన తర్వాత కూడా అటు సుప్రీం కోర్టుకు, ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇటు అసెంబ్లీ కార్యదర్శి వద్దకు తిరుగుతూ డికె అరుణ అలుపెరగని పోరాటం చేయాల్సి వస్తోంది.