అమెరికా తెలుగు ఇళ్లల్లో మరో ‘పడమటి సంధ్యారాగం’

అమెరికాలో తెలుగువారి జీవితం అనగానే ఒక తరం వాళ్లకి ఠక్కున మెదిలే చిత్రం “పడమటి సంధ్యారాగం”. అది జంధ్యాల అపురూప సృష్టి. పూర్తిగా 1985-88 నాటి తెలుగువారి అమెరికా జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిన…

అమెరికాలో తెలుగువారి జీవితం అనగానే ఒక తరం వాళ్లకి ఠక్కున మెదిలే చిత్రం “పడమటి సంధ్యారాగం”. అది జంధ్యాల అపురూప సృష్టి. పూర్తిగా 1985-88 నాటి తెలుగువారి అమెరికా జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిన సెంటిమెంటుతో కూడిన హాస్యభరిత చిత్రమది. 

ఎందుకో కానీ ఆ తర్వాత అమెరికా నేపథ్యంలో చాలా సినిమాలొచ్చినా అవన్నీ మామూలు కథలే తప్ప అక్కడివారి జీవితాలకి అద్దం పట్టే విధంగా ఏ కథకుడూ, దర్శకుడూ ప్రయత్నించలేదెందుకో. 

గమనిస్తుంటే ఆ దిశగా పలు కథలు ఉన్నాయనిపిస్తోంది. 

నిజంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చెప్పుకుందాం. ఇవి అమెరికాలోని తెలుగు వారికి సుపరిచితమైనవే. ఇండియాలో ఉన్న చాలామందికి మాత్రం ఇది కొత్త సమాచారమే. 

అట్లాంటాలో 53 ఏళ్ల తండ్రి. ఆయన కూతురికి 26. ఆమె అక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి. తన జీవిత భాగస్వామిని తానే చూసుకుంటుందని అనుకుంటే ఆమె తన పెళ్లి చేసే బాధ్యత తండ్రి మీదే పెట్టింది. తెలుగు అర్థమవుతుంది కానీ ఫ్రీగా మాట్లాడలేదు. అమెరికన్  కల్చర్లో ఒదిగిపోయిన అమ్మాయి. 

విషయం తెలిసి ఇప్పుడా అమ్మాయికి బంధువులు, స్నేహితుల ద్వారా ఇండియానుంచైతే విపరీతమైన సంబంధాలొస్తున్నాయి. 28-31 వయసు మధ్యలో ఉండి, మంచి జాబ్ చేస్తూ, అమెరికా వెళ్లే కలలతో ఉంటూ, సేం క్యాస్ట్ లో చాలా మంది అబ్బాయిలు ఆమెను పెళ్లి చేసుకోవడానికి లైన్ కడుతున్నారు. 

ఆమెను చేసుకుంటే జీవితం పచ్చగా ఉంటుందో లేదో తెలీకపోయినా, పచ్చ కార్డు (అదేనండీ, గ్రీన్ కార్డ్) వస్తుందన్నది మాత్రం తెలుసు. అమెరికాలో హెచ్1బితో 15-20 ఏళ్లు బతికినా గ్రీన్ కార్డ్ వస్తుందన్న గ్యారెంటీ లేని రోజులివి. అలాంటిది పెళ్లి చేసుకున్న వెంటనే గ్రీన్ కార్డొస్తుందంటే మామూలు విషయం కాదు కదా ఇండియన్ అబ్బాయిలకి! 

అయితే ఈ ఇండియన్ కుర్రాళ్లల్లో ఎవ్వరూ కూడా తన కూతురికి సెట్టవుతారన్న నమ్మకం అమ్మాయి తండ్రికి లేదు. ఎందుకంటే ఇండియాలోనే పుట్టి పెరిగిన అబ్బాయికి, ఈ అమ్మాయికి మొదట అడ్డమొచ్చేది కమ్యూనికేషన్. ప్రేమ వివాహాలైతే ఇదేమీ పెద్ద అడ్డంకి కాదు. కానీ అరేంజ్డ్ మేరేజులో ఇది ఒక సమస్యే. పోనీ దానిని పెద్దగా లెక్కలోకి తీసుకోకపోయినా అమెరికన్ కల్చర్లో ఇమిడిన అమ్మాయిని అర్ధం చేసుకుని మసలుకునే అబ్బాయి అయ్యుండాలి. కన్వెన్షనల్ గా ఆలోచిస్తే కష్టం. కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తాయి. అతని కోసం అమ్మాయి తన పద్ధతులు మార్చుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ దానికి కూడా ఒప్పుకుని ఏ అబ్బాయి అయినా ముందుకొచ్చినా కూడా గ్రీన్ కార్డ్ వచ్చే వరకు నటించి తర్వాత విడాకులిచ్చి పోతాడేమో అని ఇంకొక భయం. అందుకని ఇండియన్ అబ్బాయిలు క్యూకట్టినా వాళ్లని పట్టించుకోవట్లేదు ఈ తండ్రి. 

మరెలా? చేస్తే గీస్తే అమెరికాలో ఇండియన్ కుటుంబంలో పుట్టి పెరిగిన అబాయికిచ్చే చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇక్కడే తెలుగు సంఘాలు ఉపయోగపడేది. నాటా, ఆటా, తానా, నాట్స్ లాంటి సంఘాలు ప్రతి కన్వెన్షన్ లోనూ “వివాహ వేదిక” కూడా నిర్వహిస్తుంటారు. అక్కడంతా ఈ అమ్మాయి తండ్రిలాంటివాళ్లే వస్తుంటారు. వాళ్ల పిల్లల్ని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పరిచయం చేసుకోవడం, కులం, మతం, పట్టింపు మొదలైనవి చెప్పుకోవడం…ఇదే తంతు.

అయితే ఇక్కడ ఇంకొక తిరకాసు ఉంది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అబ్బాయిలకి తెలుగు అమ్మాయిలు కంటికి ఆనట్లేదుట. ఎందుకంటే వాళ్లకుండే ఆప్షన్స్ అంతర్జాతీయ స్థాయి. తెలుగు అమ్మాయిల్ని డేట్ చెయ్యాలన్నా, లవ్ చెయ్యాలన్నా కూడా నామోషీగా ఫీలయ్యేవాళ్లే ఎక్కువట. అమ్మాయిల విషయంలో కూడా అంతే. స్వజాతి మీద వ్యామోహం తొలి తరం వాళ్లకే తప్ప మలి తరం వాళ్లల్లో అధికశాతం మందికి ఉండట్లేదు. 

అందుకే చూడండి…ఎప్పుడో 1970ల్లో తెలుగు సంఘాలు మొదలైనా, ఇప్పటికి వరకు ఇండియా నుంచి వలసొచ్చిన తొలి తరం వాళ్ళే వాటిని నడుపుతున్నారు తప్ప అమెరికాలోనే పుట్టి పెరిగిన వాళ్ల సంతానం ఆ బాధ్యతలు తీసుకోవట్లేదు. అది వాళ్లకి నామోషీ! 

చాలామందికి అమెరికాలో ఎన్నారైలు అంటే ఇండియానుంచి వలస వెళ్లిన తొలి తరం వాళ్లే ఎక్కువగా పరిచయం ఉంటారు. అక్కడ పుట్టిన వాళ్ల పిల్లల మనోభావాలతో పెద్దగా పరిచయముండదు. ఆ మాటకొస్తే ఆ తల్లిదండ్రులకే తమ పిల్లల ఇష్టాఇష్టాల మీద పూర్తి క్లారిటీ ఉందడు. అలాంటి కల్చర్ షాక్ లో బతుకున్న తెలుగు తల్లిదండ్రులే దాదాపు అందరూను!

ఎంత ప్రయత్నించినా కోరుకున్న వరుడు దొరకని తల్లిదండ్రులెందరో ఉన్నారు. వాళ్లకి ఉభయతెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన కుటుంబం నుంచి ఏ అబ్బాయో దొరికితే ఇక ఆనందానికి అవధులు ఉండట్లేదు. జీవితానికి ఇంతకంటే ఏమీ అక్కర్లేదనుకుంటున్నారు. ఒకవేళ అలా కుదరకపోతే, తెలుగు కాకుండా ఏ సౌత్ ఇండియన్ కుటుంబంలోని అబ్బాయి అయినా సంతోషంగా చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. 

అదీ కాని పక్షంలో, నార్త్ ఇండియన్ అయినా హాయే అనుకుంటున్నారు. 

అదీ దొరక్కపోతే ఇక చేసేది లేక ఊరుకుంటున్నారు.

ఇప్పుడు కాకపోతే తర్వాతైనా సదరు అబ్బాయో, అమ్మాయో ఏ తెల్లవాళ్లనో చేసుకున్నా ఓకే అనుకుంటున్నారు తప్ప.. నల్లజాతీయుల్ని, ఇతర దేశాలకి చెందిన ముస్లిం జాతీయుల్ని మాత్రం తమ కుటుంబంలో కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు మనవాళ్లు. నల్లవాళ్లని చేసుకుంటే మనవలు నల్లగా పుడతారని ఒక బెంగ. ముస్లిం దేశాలవాళ్లైతే ఎదురయ్యే ఇబ్బందుల్ని ఊహించుకుని మరొక భయం. 

ఆఖరికి తమ పిల్లలు స్వలింగవిహాహాలు కాకుండా, పైన ఉదహరించిన ఆ రెండు జాతుల వాళ్లూ కాకుండా..ఎవర్ని చేసుకున్నా ఓకే అనుకుంటున్నారు తెలుగు తల్లిదండ్రులు. సంబంధం వెతికిపెట్టమని ఆ బరువు తమ మీద వేస్తే మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. 

ఇదీ అమెరికాలోని తెలుగు ఇళ్లల్లో పెళ్ళీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి. 

ఇక్కడ చెప్పుకున్న తండ్రిగా ఏ మురళీశర్మనో పెట్టుకుని..ఇక్కడ దాకా కథ నడిపి..ఆ తర్వాత కథని వినోదాత్మకంగా ఎలా ముగిస్తారో ఆలోచించుకుని మన దర్శకులు చక్కని సినిమా చేస్తే మరొక తరానికి పడమటిసంధ్యారాగం అవుతుంది. ఏమంటారు! 

పద్మజ అవిర్నేని