వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్ పని చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అధినేతగా పవన్ చర్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన పార్టీ ‘జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు’ పేరుతో లేఅవుట్ల సందర్శన చేపట్టింది. ఇందులో భాగంగా పవన్‌కల్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
నామ్‌కే వాస్తేగా ఇళ్ల నిర్మాణం ఉందని ఆయన విమర్శించారు. జగనన్న ఇళ్లకు భూ సేకరణలోనే భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తికావడం లేదని ఆయన వాపోయారు. లబ్ధిదారులు దారుణంగా మోసపోతున్నారన్నారు. పేదలకు ఇళ్లనే నిర్మించలేనివారు మూడు రాజధానులు నిర్మిస్తారా అని ప్రశ్నించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంతో కాలనీలను సందర్శించడానికి వచ్చే వైసీపీ నేతలను నిలదీయాలని పవన్‌కల్యాణ్ కోరారు. ఇంత వరకూ బాగుంది.
అసలు పవన్‌కు జగనన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రశ్నించే నైతిక హక్కు వుందా? అనే ప్రశ్న తలెత్తింది. జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి కరోనా మహమ్మారిని కారణంగా అధికార పార్టీ చెబుతోంది. ఇంకా జగన్ పాలనకు ఏడాదిన్నర సమయం వుంది. ఈ లోపు ఎంత వరకు పూర్తి చేస్తారో చూద్దాం. ఇక పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… పార్టీని స్థాపించి 9 ఏళ్లు పూర్తయిందని, ఇంత వరకూ నిర్మాణమే జరగలేదనే చర్చ మొదలైంది.
2014 సాధారణ ఎన్నికలకు ముందు మార్చి 14న జనసేన పార్టీని పవన్‌కల్యాణ్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి 9 నెలల్లో అధికారాన్ని సొంతం చేసుకున్నారు. సినీ రంగం నుంచే వచ్చిన పవన్‌కల్యాణ్ మాత్రం 9 ఏళ్లు పూర్తయినా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. జనసేన అనే పార్టీ ఇంటి నిర్మాణాన్ని పట్టించుకోని పెద్ద మనిషి, జగన్ ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై బండ వేయడం ఏంటని నిలదీస్తున్న పరిస్థితి.
175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల జనసేన ఇన్‌చార్జ్‌లను కూడా నియమించుకోలేని అసమర్థత పవన్‌కల్యాణ్‌ది అని ఎద్దేవా చేస్తున్నారు. జనసేన ఇంటి పునాదులు అంటే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నాయా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలేసి, చంద్రబాబు పార్టీతో పొత్తు నమ్ముకుని జగన్ ప్రభుత్వంపై విమర్శలతో కాలం గడపడం జనసేనానికే చెల్లిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
కనీసం తనకంటూ ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా ఎంచుకోలేని దుస్థితిలో ఉన్న పవన్‌కల్యాణ్, పేదల గృహ నిర్మాణాలపై రాజకీయం చేయడం తగునా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చిన పవన్‌కల్యాణ్…. తొమ్మిదేళ్లవుతున్నా పార్టీ నిర్మాణం ఎందుకు చేయలేదని ఎవరు ప్రశ్నించాలనే నిలదీత ఎదురవుతోంది.
రాజకీయాల్లో ఏ మాత్రం బాధ్యత లేని ఏకైక నాయకుడిగా పవన్ గిన్నీస్ రికార్డ్‌కు ఎక్కే అవకాశాలున్నాయనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. నానా తంటాలు పడుతూ పార్టీని ఎప్పటికప్పుడు పునర్నించుకుంటున్న టీడీపీ, బీజేపీలను బ్లాక్ మెయిల్ చేసుకుంటూ, రాజకీయ పబ్బం గడుపుకునే విద్య పవన్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే వ్యంగ్య కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
పవన్‌కల్యాణ్ మాటల్లో ఉన్నంత చురుకుదనం చేతల్లో కనిపించదనే వాదన వుంది. 2017, డిసెంబర్ 23న తన పార్టీ ఆశయాల గురించి పవన్ చేసిన ట్వీట్ గురించి తెలుసుకుందాం.
‘కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సాంప్రదాయం.. సంస్కృతులను కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. ఇవి దేశపటిష్టతకు మూలాలు – ఇవే ‘జనసేన’ సిద్ధాంతాలు’ అంటూ పవన్‌కల్యాన్ ట్వీట్ చేశారు. చదువుకోడానికి బాగుంది. అయితే పవన్ ఆ దిశగా పార్టీని నిర్మించిన దాఖలాలు ఎక్కడున్నాయి. టీడీపీ, బీజేపీని కలపడం ద్వారా కనీసం తాను ఎమ్మెల్యేగా గెలవొచ్చనే తపన తప్ప, పార్టీ నిర్మాణం గురించి ఆలోచిస్తున్న దాఖలాలే లేవు. ఈయన గారు జగనన్న ఇళ్ల గురించి మాట్లాడ్డం అంటే… దెయ్యాలు వేదాలు వల్లించడమే.
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ అని చెప్పిన మహాకవి గురజాడ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని జనసేన నిర్మాణంపై పవన్‌కల్యాణ్ దృష్టి పెట్టడం మంచిది. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్టుగా… పార్టీనే నిర్మించుకోలేని పవన్‌కల్యాణ్, 2024లో జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానని ప్రగల్భాలు పలకడం అతిశయోక్తి కాక మరేంటి? కావున ముందు తన గురించి ఆలోచిస్తే పవన్‌కే మంచిది.