‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం’ అని మన గురించి మనం చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ రకమైన ట్యాగ్ లైన్ తో మన దేశాన్ని యావత్తు ప్రపంచమూ గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటాం. కానీ.. మన దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతున్న తీరు తెన్నులు ఎలాంటివి? మంచిచెడులు ఏమిటి? మనకు తెలుసు కదా! ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఇంతకు మించిన భ్రష్ట రాజకీయం ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నదోలేదో మనకు తెలుసునా? పాలకుల తలరాతలను నిర్దేశించే ఓటు అనే బ్రహ్మాస్త్రం రూపాయలకు, మద్యానికి అమ్ముడవుతూ ఉండే అసహ్యమైన రాజకీయ వ్యవస్థకు మనం మేలిముసుగుతొడిగి మేడిపండులాగా బాహ్యప్రపంచానికి చూపెడుతూ ఉంటాం.
‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మాది’ అని రొమ్ము విరుచుకుని చెప్పే మనం.. ‘ప్రపంచంలో అతిగొప్ప ప్రజాస్వామ్య దేశం మాది’ అని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలమా?. డెబ్భయి అయిదేళ్ల సుదీర్ఘ స్వాతంత్ర్యభారత ప్రస్థానంలో ఈ పతనం ఎలా మొదలైంది.. ఏ దరికి మనల్ని చేరుస్తుంది? గ్రేట్ ఆంధ్ర విశ్లేషణాత్మక వ్యాసం.
వర్తమానంలోంచి గతంలోకి వెళ్దాం..
కొన్నేళ్ల కిందట.. ఈ దేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ అయిన పార్లమెంటులో ప్రభుత్వ విశ్వాస పరీక్షలో.. ఎంపీ పదవిని వీడి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా, సాంకేతికంగా ఎంపీ పదవికి రాజీనామా అప్పటికి ఇంకా ఇవ్వలేదు గనుక.. ఓటువేసిన తీరుతోనే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. పార్టీ విప్ కు వ్యతిరేకంగా విశ్వాసపరీక్షలో అమ్ముడుపోయిన ఎంపీలు ఓట్లు వేసిననాడు బజారుపాలైంది. అప్పుడు ప్రజలు ఒకసారి నిర్ఘాంతపోయి ఆ పరిణామాలను గమనించారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా దానికి అలవాటు పడ్డారు.
ఆర్థికంగా బలమైన పార్టీలు తమ తమ రాజకీయ అవసరాల కోసం, ప్రత్యర్థి పార్టీలను ఉనికి లేకుండా చేయడం కోసం ఎమ్మెల్యేలను, ఎంపీలను అమ్మడమూ కొనడమూ అనేది ఒక రోజువారీ నిత్యకృత్యంగా మారింది. అంగడిలో సరుకులు ఎలా కొంటామో.. పశువుల సంతలో గేదెలు, ఆవులు, మేకలను ఎలా కొంటామో.. ఎమ్మెల్యేలను కూడా అదే తరహాలో వారికి తగిన ధర చెల్లించగల వారు కొంటారు. ఆ సంతలు ఫైవ్ స్టార్ హోటళ్లలోను, ఫార్మ్ హౌసుల్లోను, బాబాలు స్వామీజీల ఆశ్రమాల్లోను నడుస్తుంటాయి. తమ బేరసారాలు, కొనుగోళ్ల ద్వారా అలాంటి ప్రబుద్ధులంతా భారతప్రజాస్వామ్యానికి ఒక్కొక్కటిగా బట్టలు ఊడదీస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు.
మొన్నటికి మొన్న.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే ఓటు కోసం కోట్ల రూపాయలు ఆశచూపించి.. ఫోనులో అతనికి ధైర్యం చెప్పి నగదుతో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సీనియర్ నాయకుడి సిగ్గుమాలిన తనం చూశాం. నిన్నటికి నిన్న.. హైదరాబాదు శివార్లలో ఫామ్ హౌస్ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి 200 కోట్ల రూపాయల బేరంతో ఓ ముగ్గురు సిద్ధపడ్డారనేది అభియోగం. విచారణ జరుగుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన ప్రభుత్వం కూలదు, ఏడాది దూరంలో ఉన్న ఎన్నికలకు సిద్ధపడక ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి కొనవలసిన అగత్యం ఏమిటో కూడా బోధపడదు.
సరే ఏదైతేనేం.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినట్టుగా సర్వత్రా వినిపిస్తోంది. ప్రజాస్వామ్యం హత్యకు గురవుతున్నట్టుగా.. కొనడానికి ప్రయత్నించిన వారు ప్రజాస్వామ్యాన్ని హత్యచేసి దేశాన్ని కబళించేయాలని చూస్తున్నట్టుగా వైరివర్గం తీవ్రమైన విమర్శలు చేస్తోంది. ఎవరు నిజం? ఎవరు సచ్ఛీలురు? అని తూకం వేసే ముందు ఒప్పుకోవాల్సిన సత్యం ఒకటుంది. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టపరిచే పోకడలకు ఇది పరాకాష్ట!
పరమహంస కథ ఇక్కడ అవసరం..
ఓ తల్లి తన పదేళ్ల కొడుకును రామకృష్ణ పరమహంస వద్దకు తీసుకువచ్చింది. ‘వీడిని చక్కెర తినవద్దని మందలించండి’ అని వేడుకుంది. ‘అమ్మా రేపు తీసుకురా’ అన్నాడాయన. మరురోజు మళ్లీ తీసుకువచ్చింది. ‘బాబూ చక్కెర తినవద్దు’ అని చెప్పాడు పరమహంస. ఆ తల్లి విస్తుపోయింది. ఇంతోటి మాట చెప్పడానికి రెండో రోజు రావాలా అని అడిగింది. ‘తల్లీ! చక్కెర తినే అలవాటు నాకు కూడా ఉంది. వాడికి బుద్ధి చెప్పాలి గనుక.. ముందు నేను తినడం మానుకున్నాను. అందుకే వ్యవధి అడిగాను’ అన్నాడాయన. దాదాపుగా మనలో ప్రతి ఒక్కరూ పరమహంస కాకపోతే మరో యోగికి, బాబాకు ముడిపెట్టి చదువుకున్న కథే ఇది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటి? ఒక అవ్యవస్థను ప్రశ్నించే అర్హత ఎవరికి ఉంటుంది? ఒక పాపాన్ని నిందించే యోగ్యత ఎవరికి ఉంటుంది? ఆ అవ్యవస్థలో, ఆ పాపంలో భాగంలేని వారికి మాత్రమే!
ఇవాళ ఒక ఫాంహౌస్ లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని గగ్గోలు పెడుతున్నామే, కన్నీరు కారుస్తున్నామే.. ఆ వ్యవహారాన్ని తప్పుపట్టే అర్హత ఏ నాయకుడికి ఉంది? ‘మీలో నేరం చేయనివాడు ఎవరో చెప్పండి’ అని నిలదీసిన కవి వాక్యం గుర్తుకు వస్తోంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయని నాయకుడు మన దేశంలో ఎవరున్నారు? మనదేశ ప్రజాస్వామ్యం చిరంజీవి! ఎందరు ఎన్నిసార్లు హత్యచేస్తున్నా, అత్యాచారానికి, మానభంగాలకు పాల్పడుతున్నా.. అది అలా సుభిక్షంగా వర్ధిల్లుతూనే ఉంటుంది. చావకుండా బతికే ఉంటుంది. మరో హత్యకు అవకాశం ఇస్తూనే ఉంటుంది.
హత్య చేయని వాడు ఎవ్వడు?
సామాన్యులకు అర్థం కాని సంగతి ఒకటుంది. ‘ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే మాత్రమే అది ప్రజాస్వామ్య హత్య అవుతుందా? ఓటర్లను కొనుగోలు చేస్తే అది హత్య అనిపించుకోదా?’ అనేదే ఆ సందేహం. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఏ నాయకుడైతే తమకు నిజాయితీగా సేవ చేయగలరని ప్రజలు నమ్ముతున్నారో.. ఆ నాయకుడి గుణగణాలను, చరిత్రను, ప్రజల పట్ల చూపించే శ్రద్ధను అంచనాకట్టి ఓటు వేసే రోజులు ఎన్నడో పోయాయి! ఓట్లను కొనుగోలు చేసే రాజకీయాలు చాలా కాలం కిందటే వచ్చాయి. ఓటు ధర పరాకాష్టకు చేరిందన్నట్లుగా ఆ నడుమ కుప్పం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగిన సందర్భంలో పదివేల రూపాయల వెలకట్టినట్టుగా పుకార్లు వినిపించాయి. అంత ధర అబద్ధం అయినప్పటికీ భారీ మొత్తాలకే ఓట్లను కొన్నారన్నది నిజం. మునుగోడు ఉపఎన్నిక వచ్చేసరికి ఓటు ధర పదివేలుగా ప్రచారం జరిగింది. ‘వాళ్లు పదివేలు ఇస్తారు తీసుకోండి, ఓటు మాత్రం మాకే వేయండి’ అనే చవకబారు, వెకిలి నినాదాలతో పార్టీలు ముందుకు వచ్చాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థను తామే అపహాస్యం చేస్తూ, వారి భాషలో చెప్పాలంటే హత్య చేస్తూ లేదా మానభంగం చేస్తూ ప్రత్యర్థి పార్టీ డబ్బులు ఇస్తున్నదని నిస్సిగ్గుగా చెప్పడమే బేవార్సుతనం! ఇది ఏదో ఒక పార్టీ వారి ఘనకార్యం కాదు. బలంగా తలపడిన అన్ని పార్టీలు తమ తమ ప్రత్యర్థుల మీద నెట్టేసి పదివేల రూపాయల ధర వారు చెల్లిస్తున్నట్లుగా ప్రచారం చేశారు. తద్వారా ప్రత్యర్థి ఓట్లను కొనడానికి వెళితే అధిక డబ్బు చెల్లించేలా ఒక వ్యూహరచన చేశారు. అదంతా ఎలా ఉన్నప్పటికీ ఐదువేల రూపాయలకు ఓట్లను కొన్నది వాస్తవం. ఒక పార్టీ మీదనే నింద వేయవలసిన అవసరం లేదు. ఎవరికి వారు తమకు చేతనైనచోట ఆ ధర పెట్టి ఓట్లను కొనుగోలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని వివస్త్రను చేశారు.
ఈ ఐదు వేల రూపాయల ధర అనేది- ఓటర్లకు తాగించే మద్యానికి అదనం! కేవలం నగదు రూపేణా ముట్ట చెప్పినది. ఇంత ధర ఎలా పలికింది? ఐదువేల రూపాయలు అంటే మాటలా? హైదరాబాదు నగరంలో ఒక నిరుద్యోగ పట్టభద్ర యువకుడు- ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగ ప్రయత్నాల కోసమో హాస్టల్లో ఉండాల్సి వస్తే ఒక నెలకు వసతికి భోజనానికి కలిపి చెల్లించే మొత్తం అది! అంటే ఒక వ్యక్తి ఒక నెల రోజుల భృత్యం! ఒక ఓటుకు ఒక రాత్రికి ముడుపుగా, లంచంగా ముట్టజెప్పి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. ఈ నాయకులేనా హత్యల గురించి, ప్రజాస్వామ్య రాజకీయంలో నైతిక విలువల గురించి మాట్లాడుతున్నది? ఆ మాటలు పలకడానికి వీరికి అసలు ఎలాంటి అర్హత ఉంటుంది? ‘మునుగోడు ఉప ఎన్నిక’ ఒక కొలబద్దగా స్థిరపడవచ్చు. రేపు మరో ఎన్నికలు వస్తే ‘మునుగోడులో ఐదు ఇచ్చారు కదా మీరు కూడా అంతే ఇవ్వాలి’ అని డిమాండ్ చేసే స్థాయికి ప్రజలు వెళ్లవచ్చు! దీనికి అంతూ దరీ ఎక్కడ?
కొనుగోలు ఎలా మొదలైంది?
నిజానికి ఇది మన ఊహకందని సంగతి. ఓట్లను కొనుగోలు చేయడం అనేది ఇవాళ వ్యవస్థీకృత ఏర్పాటు లాగా చలామణిలో ఉన్నది గానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయాన్ని బేరం చేయడం ప్రజల మానప్రాణాలను మించిన ఓటు విలువను ధర కట్టడం ఎన్నడు మొదలైందో ఇదమిత్థంగా తేల్చి చెప్పడం కష్టం! అయితే పెద్దల ద్వారా తెలిసే సమాచారాన్ని బట్టి కొంత సూత్రీకరించగలం.
ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు అన్నింటికీ సెలవు రోజుగా ఉంటుంది. వేతనంతో కూడిన సెలవు. అదే సమయంలో పొట్టకూటి కోసం రోజు కూలీలుగా బతికే వాళ్ళు మాత్రం పనికి వెళితే తప్ప కూలీ దక్కదు. ఎవరో గెలిచి నాయకులుగా మారి తమను ఉద్ధరించడానికి పనిచేస్తారు అంటే అందుకోసం ఒకరోజు కూలిని పణంగా పెట్టే అంత స్తోమత అలాంటి పేదలకు ఉండకపోవచ్చు. అలాంటి నేపథ్యంలో అసంఘటిత రంగంలోని కార్మికులు ఓటింగ్ కు గైర్హాజరు కాకుండా ఉండేందుకు వారికి ఇవ్వడం అనేది తొలినాళ్లలో మొదలైన పద్ధతి.
కూలీ గిట్టింది గనుక పనికి వెళ్లకుండా పోలింగ్కు వెళ్లే సంస్కృతి మొదలైంది. అంటే ఒక పేదవాడి రోజు కూలి మొత్తం ఎంతో అదే ఓటు ధరగా నిర్ణయం అయింది. ఈ ధరల ప్రస్థానంలో కూలీల ధరలకు ఓటు కోసం వెచ్చిస్తున్న ధరలకు అసలు పొంతనే లేకుండా పోతున్నది. ఇవాల్టికి కూడా అసంఘటిత రంగంలో ఉండే కూలీలకు వెయ్యి రూపాయల వరకు దినబత్తెం ఉండగా. ఓటుకు ఐదువేలు చెల్లిస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి??
ఇంత విశృంఖలత ఎలా వచ్చింది?
ఇది కూడా అంచనాగా ఊహించి చెప్పవలసిన పరిణామమే. ఇది వరకటి రోజుల్లో ప్రజలతో మమేకమై, ప్రజలకోసం పనిచేయడమే అలవాటుగా గలవారు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ అన్ని రంగాల్లో లాగానే అక్కడ కూడా రోజులు మారాయి. గతంలో గ్లోబలైజేషన్ సరళీకృత ఆర్థిక విధానాలు పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా అనేక అనేక వ్యాపారాలు భారతదేశంలోకి కూడా రంగ ప్రవేశం చేశాయి. అనేక రంగాలకు చెందిన వారు హఠాత్తుగా సంపన్నులయ్యారు. అధికారంలో ఉండేవారు జరుగుతున్న పరిణామాలను రాగల సంస్థలను గురించి ముందుగానే తెలుసుకోగలుగుతూ ఉంటారు గనుక వారికి అడ్వాంటేజీ వచ్చింది. వారు కూడా హఠాత్తుగా సంపన్నులయ్యారు.
పారిశ్రామిక ప్రగతి పెరిగే కొద్దీ భూమి విలువ కూడా పెరుగుతూ వచ్చింది. రియల్ ఎస్టేట్ అనూహ్యమైన రీతిలో రూపురేఖలు మారిపోయింది. ఎన్నడో కొన్న స్థలాలకు పదిరెట్లు ఇరవై రెట్లు ధరలు పెరగడంతో.. ఎలాంటి ప్రతిభా నైపుణ్యాలు తెలివితేటలు అవసరం లేకుండానే రాత్రికి రాత్రే అపర కుబేరులు అయిపోయిన మహానుభావులు ఉన్నారు. తమ కష్టంతో శ్రమతో నిమిత్తం లేకుండా ఊహించనంత సంపద తమ వద్ద చేరేసరికి దానిని ఏం చేసుకోవాలో తెలియలేదు. విజ్ఞతతో ఎలా ఖర్చు పెట్టాలో వారికి అంతకంటే తెలియదు. ఆ సంపదను కాపాడుకోవడం ఒక్కటే జీవిత పరమార్ధం అయింది.
అధికారంలో ఉన్నవారు అవినీతి చేయకపోయినా కూడా ఆర్థికంగా ఎదగడానికి కొన్ని అపమార్గాలు ఉంటాయనే సంగతి డబ్బున్న వారందరికీ తెలిసిందే. అందరూ అధికార పదవుల మీద, రాజకీయాల మీద కన్నేశారు. ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టి, ఈజీ మనీకి, కష్టం ఎరగని సంపాదనకు అలవాటు పడిన వారంతా ఆ సంపదను రాజకీయాల్లో తగలేసి అధికారంలోకి రావాలని కోరికలు పెంచుకున్నారు. ఒకసారి అధికార వ్యామోహం వారిలో పుట్టిన తర్వాత దానిని చేజిక్కించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారనేది లెక్కలోకి లేకుండా పోతుంది. పైగా అధికారంలో ఉన్న మజాను వారు తెలుసుకున్న వారే గనుక అందుకోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం ప్రారంభించారు. రాజకీయం ధనమయం అయింది. టికెటు కోసం పోటీ ఉన్నప్పుడు పార్టీకి కోట్లలో విరాళాలు ఇచ్చి.. టికెట్ దక్కించుకోవడం ఒక రివాజు అయింది. పార్టీలు ఇలాంటి కొత్త రకం సంపాదనకు అలవాటు పడ్డాయి. టికెటు కోసమే అంత డబ్బు పెట్టాక.. గెలవడానికి ఎంతైనా పెట్టవచ్చుననే తెగింపు వచ్చింది.
ఓటు రేటుకు వేలంపాటలు మొదలయ్యాయి. ఒక పార్టీ 100 ఇస్తే మరో పార్టీ 200.. ఇలా నడిచిన బేరాలు ఒక దశలో 500 వద్ద స్థిరపడ్డాయి. ఓటుకు 500 రూపాయలు అనే ఘనమైన మొత్తాన్ని తెలుగు ప్రజలకు పంచి.. అధికారంలోకి రావడం కొందరికి చెల్లుబాటు అయింది. పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక వనరులను ప్రధానంగా చూడడం మొదలయ్యాక.. ‘ఒక ఓటుకు ఎంత పెట్టి కొనగలరు?’ అనేది టికెట్ ఎంపికలో ఒక కీలక ప్రశ్న అయింది. ఓటుకు వెయ్యి, రెండువేలు అనేది మెజారిటీ నియోజకవర్గాలలో కనీస ధరగా మారింది. ఒకసారి ఓటును అమ్ముకోవడం మొదలైన తర్వాత.. ప్రజలకు నాయకులను నిలదీసే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? అదే జరుగుతుంది ఇప్పుడు!
ప్రజలను కొనడం ఒక రివాజు అయినప్పుడు, ఎమ్మెల్యేలను కొంటే దాన్ని చిత్రంగా, తప్పులాగా ఎందుకు చూడాలి? అది కూడా రివాజు అని మనం అలవాటు పడాలి! దేశాన్ని ఉద్ధరించడానికి నాయకులు ఎవరెంత పనిచేస్తున్నారో మనకు తెలియదు గానీ.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి మాత్రం అందరూ తమ వంతు చేయి వేస్తున్నారు. ప్రజాస్వామ్యం పతనావస్థలో పాతాళాలను మనం ఇవాళ చూస్తున్నాం. ఈ దారిద్ర్యం ఇవాళ పుట్టినది కాదు.. ఇవాళ అంతమయ్యేది కూడా కాదు. ఆదిమధ్యాంతాలను నిర్దిష్టంగా తేల్చి చెప్పలేని విరాట్రూపంలోకి మన ప్రజాస్వామ్యం భ్రష్టత్వం చేరుకుని ఉంది. సంస్కరణలు కింద మొదలు కావాలా? పైన మొదలు కావాలా? అనే చర్చ తరచుగా జరుగుతుంటుంది. శుష్కమైన చర్చ అదంతా! అసలు ఎక్కడో ఒకచోట మొదలైతే చాలు!
ఓటు కోసం నోట్లు ఆశ చూపినప్పుడు.. ‘వద్దు’ అని చెప్పగల మనిషి వస్తే.. ప్రతిరోజూ హత్యకు గురవుతున్న ప్రజాస్వామ్యానికి అతడు రక్షకుడు అవుతాడు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు’ అనేవన్నీ మనల్ని మోసం చేసే పడికట్టు మాటలు. అలాంటి వాడు మాత్రమే దేవుడు.
.. ఎల్. విజయలక్ష్మి