జనసేనాని పవన్‌కల్యాణ్‌ను నమ్మి మోసపోతున్నామా?… టీడీపీలో అంతర్మథనం మొదలైంది. పూటకో మాట మారుస్తున్న పవన్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచుతాడనే భయం, ఆందోళన టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో తమ వెంట నడుస్తాడనే నమ్మకం టీడీపీలో సన్నగిల్లుతోంది. ఇటీవల చంద్రబాబుతో భేటీ సందర్భంలో కలిసి పని చేస్తామని నమ్మబలికిన పవన్, ఇప్పుడు ప్రధాని మోదీతో చర్చించిన తర్వాత స్వరంలో మారిందని టీడీపీ గుర్తు చేస్తోంది.
జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పవన్ కోరడం ఆశ్చర్యంగా వుందని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదపడతాడనే నమ్మకంతోనే అతనికి విపరీతమైన ప్రచారాన్ని కల్పిస్తున్నామని, కానీ ఆయన వైఖరి చూస్తుంటే వంచించేలా ఉన్నాడనే అనుమానాలు బలపడుతున్నాయి. టీడీపీ అంతరంగాన్ని రెండుమూడు రోజులుగా ఎల్లో చానళ్లలో విశ్లేషకుల మాటల రూపంలో చూడొచ్చు.
రెండో అతిపెద్ద పార్టీ అయిన టీడీపీని కాదని, బీజేపీ వెంట పవన్ వెళ్లడం ఏంటని విశ్లేషకుల రూపంలో ఉన్న టీడీపీ ఏజెంట్లు నిలదీస్తున్నారు. బీజేపీని రోడ్ మ్యాప్ అడగడం అజ్ఞానం అవుతుందని తప్పు పడుతున్నారు. అలాగే పవన్‌కు విపరీతమైన ప్రచారం ఇస్తూ తప్పు చేస్తున్నారని, ఎల్లో చానల్ డిబేట్‌లోనే వారు ప్రశ్నించడం గమనార్హం. ఇంతకాలం జగన్ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనంటూ ఎల్లో బ్యాచ్ అభిమానాన్ని చూరగొప్ప పవన్, ప్రధానితో భేటీ తర్వాత యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోందనే వాదన బలపడుతోంది.
అసలే పవన్‌కల్యాణ్‌కు స్థిరత్వం వుండదు. ఎప్పుడెలా మాట్లాడ్తారో, నడుచుకుంటారో ఆయనకే తెలియదు. అలాంటి పవన్‌ను నమ్ముకోవడం అంటే టీడీపీ బలహీనతను బయట పెట్టుకున్నట్టే. పవన్‌ను అంత సులువుగా బీజేపీ జారవిడుచుకోదని టీడీపీ భావిస్తోంది. టీడీపీని బలహీనపరచడమే ధ్యేయంగా పని చేస్తున్న బీజేపీ, తమ వైపు పవన్‌ను పంపుతుందని అనుకోవడం అజ్ఞానం అవుతుందని ఇప్పుడిప్పుడే టీడీపీకి జ్ఞానోదయం అవుతోంది.
ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో కనీస పార్టీ నిర్మాణం లేని పవన్‌పై ఆధారపడడం కంటే ప్రజల్ని నమ్ముకుని, వారితో మమేకం కావడమే మంచిదనే ఆలోచనలో టీడీపీ వుంది. ఆ దిశగా కార్యాచరణ చేపట్టేందుకు కసరత్తు చేయనుంది.