రాజకీయం అంటేనే జంపింగ్-జపాంగ్. ఏ పార్టీ గెలుస్తుందని అంచనాలు బాగుంటే చివరి నిముషంలో ఆ పార్టీలోకి జంప్ అయిపోతుంటారు నేతలు. ఓ పార్టీలో టిక్కెట్ దొరక్కపోతే మరో పార్టీకి షిఫ్ట్ అయిపోతుంటారు. ఇదంతా ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత కూడా జంపింగ్ లకు పెద్ద సమస్యేమీ లేదు.
అధికార పార్టీలోకి షిఫ్ట్ అయ్యే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏపీలో కోకొల్లలు. అయితే అలాంటి రాజకీయ నేతలందరికీ ఇకపై గడ్డు కాలం రాబోతోంది. వచ్చే ఎన్నికలనాటికి గోడ దూకే వ్యవహారాలు వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
జగన్ నిర్ణయం తెలిసిందే..?
వలస నేతలపై జగన్ నిర్ణయం ఏంటనేది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏర్పాటుచేసిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే తమ నిర్ణయమేంటో క్లియర్ గా చెప్పేశారు. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చి జగన్ కి జై కొట్టినా, వారికి ఇంకా వైసీపీ కండువా కప్పలేదంటే ఆ విషయంలో జగన్ నిబద్ధత అర్థం చేసుకోవచ్చు. పదవికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటానని అంటున్నారు జగన్.
గత ఎన్నికల్లో చివరి నిముషంలో పార్టీలోకి వచ్చినవారు కూడా వైసీపీ టికెట్లు సాధించారు. కానీ 2024కి అలాంటి పరిస్థితి ఉండదు. వైసీపీలోనే ఫుల్ కాంపిటీషన్ ఉండబోతోంది. ఇక బయటినుంచి వచ్చినవారికి సర్దుబాటు చేసే అవసరం కానీ, అవకాశం కానీ ఆ పార్టీకి లేదు. దీంతో సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్దాం అనుకునే బాపతు నాయకుల పాచిక పారదు.
మరి చంద్రబాబు పరిస్థితేంటి..?
చంద్రబాబు మాత్రం ప్రతి ఎన్నికలకు వలస నేతలనే నమ్ముకున్నారు. నిజానికి ఆయన రాజకీయమే వలసల మయం. 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన వైసీపీ ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్లాగా బేరమాడి మరీ కొనేశారు. దాని ఫలితాన్ని 2019లో చవిచూశారు. ఇటీవల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే విషయంలో బాబు తన మాట వినలేదని ఫలితం అనుభవించారని బహిరంగంగానే చెప్పారు.
ఈ సంగతి పక్కనపెడితే, ఈసారి పార్టీ క్యాడర్ నుంచి బాబుకు నిరసన తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతర్గత నివేదికల్లో ఇదే విషయం బయటపడింది కూడా. 2019 ఎన్నికల టైపులో 2024లో కూడా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే, క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ మొత్తం చెల్లాచెదురు అయ్యేలా ఉంది. ప్రతిసారి ఇలా వలస నేతల్ని ఎంకరేజ్ చేస్తూ పోతుంటే.. పార్టీలో ఏళ్లుగా కాచుక్కూర్చున్న నేతల పరిస్థితి ఏంటనే ప్రశ్న కాస్త గట్టిగానే వినిపిస్తోంది.
దీనికితోడు ఏఏ నియోజకవర్గాల్లో చంద్రబాబు వలసల్ని ప్రోత్సహించే అవకాశం ఉందో, ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల దగ్గర ఇప్పటికే కొంత సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగా వాళ్లు ఇప్పట్నుంచే బాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అటు లోకేష్ ను కూడా సంప్రదిస్తున్నారు. సో.. ఇలాంటి టైమ్ లో బాబు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే నేతలపై పెద్దగా ఆశలు పెట్టుకోకపోవచ్చు. అది తన పార్టీ మనుగడకే ఇబ్బంది.
బీజేపీ, జనసేన విషయం ఏంటి..?
ఏపీలో బీజేపీ, జనసేన నుంచి బయటకు వెళ్లే నాయకులే కానీ, పార్టీలోకి వచ్చే కొత్తవారు కనిపించడంలేదు. ఆ పార్టీలు అధికారంలోకి వస్తాయన్న నమ్మకం లేదు, అసలు పార్టీ అధ్యక్షులైనా గెలుస్తారనే ఆశ లేదు. సో.. ఈ రెండు పార్టీలు వలసల్ని ప్రోత్సహిస్తాయని కానీ, వలస నేతలు ఈ పార్టీలపై నమ్మకంతో చేరతారని కానీ అంచనా వేయలేం.
వృద్ధనారీ పతివ్రత తరహాలో.. అవకాశాలు లేక చాలామంది అదే పార్టీలో కొనసాగి, నిబద్ధత -నిజాయితీ గల నాయకులు అనిపించుకోవడం మినహా మరో అవకాశం ఉండకపోవచ్చు.