భారతీయులలో మోడీకి ఉన్నట్టే ట్రంపుకి కూడా భక్తులు ఉన్నారు. ప్రత్యేకంగా వారికోసమే ఈ వ్యాసం.
ఒక నాయకుడి స్వార్థం, నిర్వాకం దేశాన్ని ఆ దేశ ప్రజల్ని చివరికి ప్రపంచాన్ని కూడా ఎలా దెబ్బతీయగలదో స్థలాభావం వలన మిగిలిన అన్ని విషయాలు పక్కనబెట్టి ఒక్క కరోనా విషయం మాత్రమే చర్చించి విశదం చేయడానికే ఈ వ్యాసం.
1. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఒక వైరస్, వైద్యశాస్త్ర నిపుణుల టీముని చైనాలో ఉంచి అక్కడ ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో, ఎలాంటి వైరసులు ప్రారంభమయి వృద్ధిచెందుతున్నాయో గమనించి అమెరికాకు, చైనాకు, ప్రపంచానికి తెలియచెప్పి, వాటిని ఎలా నివారించాలో రిపోర్ట్ చేసేవాళ్ళు. చైనా అబద్ధాలు చెప్పినా ఈ టీమ్ నిజాలు బట్టబయలు చేసేవాళ్ళు. ట్రంప్ 2016లో గెలవగానే చేసిన మొట్టమొదటి కార్యం ఆ టిముని వెనక్కి పిలవడం. ఎప్పుడో 2019 ఆగస్ట్ నెలలో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తి చెందిన కొవిడ్-19ని 2020 జనవరి దాకా చైనా కప్పిపుచ్చగలిగింది.
2. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తనకు దెబ్బతగిలుతుందనే భయంతో, గెలవాలనే స్వార్థంతో ట్రంప్, తన సపోర్టర్లు ఈ భయంకరమైన కరోనా పైన ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసి చూస్తే అధికారం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ప్రాణాలను పణం పెట్టారో లెక్కలేదు. ఒక్కొక్క అబద్దం తేదీలతో సహా…..
3. జనవరి 22, 2020 – మొట్టమొదటి కరోనా కేసు అమెరికాలో రిపోర్ట్ అయింది. దీనికి ట్రంప్ ప్రతిస్పందన – ఇదేమీ వ్యాప్తి చెంది మహమ్మారి కాదు. అంతా నియంత్రణలో ఉంది.
4. జనవరి 28, 2020 – అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రైయన్ ట్టంపుకి హెచ్చరిక “కరోనా మహమ్మారి నీ నాయకత్వ జీవితంలో నువ్వు చూడబోతున్న అత్యంత అరుదైన ముఖ్యమైన ప్రమాదకరమైన అంశం. తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి”.
5. ఫిబ్రవరి 7, 2020 – జర్నలిస్ట్ బాబ్ వుడ్వర్డ్ తో ట్రంప్ – ఈ కరోనా చాలా ప్రమాదకరమైంది. గాలిలొ కూడా వ్యాప్తి చెంది ప్రాణాలను హరిస్తుంది. కానీ తనకు నిజం తెలిసి కూడా అదేరోజు, బయటి ప్రపంచానికి తను చెప్పింది మాత్రం “కరోనా ఏమీ పెద్ద రోగం కాదు ఫ్లూ లాంటిది వస్తుందీ పోతుంది దీనికోసం ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. (వ్యాపారాలను మనసులో పెట్టుకుని) అందరూ అందరినీ కలవొచ్చు”. ప్రజలను జాగ్రత్త పడమని, మాస్కులు పెట్టుకుని, సామాజిక దూరం పాటించి అవసరముంటే తప్ప బయట ఎక్కువగా తిరగొద్దు అని ఆయన చెప్పుంటే అమెరికాలో ఇప్పటివరకూ చనిపోయిన ఆరు లక్షల మందిలో కనీసం ఐదు లక్షల మంది బతికుండేవాల్లు.
6. ఫిబ్రవరి 29, 2020 – అమెరికా సర్జన్ జనరల్ జెరోం ఆడంస్ – పిచ్చిల్ల లాగా అందరూ మాస్కులు కొని పెట్టుకోకండి. ఏ ఉపయోగం ఉండదు. (కానీ, చెప్పకనే చెప్పిన నిజం మాత్రం) మనకు చాలా తక్కువ మాస్కులున్నాయి. అవి ఆరోగ్య సిబ్బందికి అవసరం. అంటే, అమెరికా లాంటి దేశం యుద్ధ ప్రాతిపదికన మాస్కులు తాయారు చెయ్యడం, ప్రజలకు పంపిణీ చేయడం లాంటి ఏ చర్యలూ తీసుకోలేదు.
7. మార్చ్ 9, 2020 – ట్రంప్ ట్వీట్ – అమెరికాలో ఫ్లూతో ప్రతియేడు వేలలో చనిపోతారు. ఇప్పటివరకూ కరోనాతో చనిపోయింది 22 మంది మాత్రమే. (గాలిలొ వ్యాప్తి చెందుతుంది అని తనకు పూర్తిగా తెలిసినా) కరొనాను పూర్తిగా లైట్ తీసుకోండి ఏమీకాదు. మాస్కులోద్దు ఏమీ వద్దు.
8. ఏప్రిల్ 3, 2020 – అమెరికన్ సిడిసి సంస్థ తన పంథాను మార్చుకుని అమెరికన్లు అందరూ బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోండి అని ట్రంప్ కరోనా సమావేశంలో ట్రంప్ ప్రత్యక్షంగా ఉన్నప్పుడే చెప్పింది. దానికి వెంటనే ట్రంప్ “ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకోండి, కానీ నేను మాత్రం మాస్క్ పెట్టుకొను”. ఇది ఒక నాయకుడు తన ప్రజలకు ఇలాంటి మహమ్మారి విషయంలో ఇచ్చే సందేశం కాకూడదు.
9. ఇక ఏప్రిల్ నుండి తన అధ్యక్ష ఎన్నికల కోసం ఇండోర్ స్టేడియంలలో వేలమంది ప్రజలు మాస్కులు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా ప్రచారం నిర్వహించి కరోనా వ్యాప్తికి పూర్తిగా కృషి చేశాడు.
10. సెప్టెంబర్ 26, 2020 – వైట్ హౌస్ రోజ్ గార్డెన్లొ ఒక వెయ్యి మంది సపోర్టర్లతో సుప్రీం కోర్టు జస్టిస్ విషయంలో పెద్ద పార్టీ చేసి తనకు, తన భార్యకు కూడా కరోనా వైరస్ తెచ్చుకున్నాడు.
11. వాల్టర్ రీడ్ హాస్పిటల్ అనే పెద్ద అధునాతన హాస్పిటల్లో 50కి పైగా పెద్ద పెద్ద డాక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన వైద్యంతో, ఫార్మా కంపెనీలు తనకు ఇచ్చిన అధునాతన ప్రయోగాత్మక మందులతో కోలుకుని వెనక్కి వచ్చిన ట్రంప్ మొట్టమొదటగా చేసింది మాస్కుని లాగేసి మీకు కూడా కరోనా వస్తే ఏమీ కాదు నాకులాగానే మీకు కూడా నయమైతుందని నమ్మబలకడం. కానీ, సామాన్య ప్రజలకు ఆయనకు అందిన వైద్యంలొ వెయ్యో ఒంతు కూడా అండదని ఆయనకు తెలిసి కూడా అబద్ధాలు ప్రచారం చేశాడు. కొన్ని నగరాలలో, కొన్ని రాష్ట్రాలలో ఐసీయి బెడ్లు కూడా దొరకక అంబులెన్సులు పేషెంట్లను ఎక్కించికొలేదు. ప్రజలకు ఏమైనా సరే నేను మాత్రం గెలవాలనేదే ట్రంప్ స్వార్థం.
12. ఓడిపోయిన తరవాత కూడా ట్రంపుకి ప్రజాక్షేమం అస్సలు పట్టలేదు అనడానికి నిదర్శనం కూడా ఉంది.
అమెరికాలో, ప్రపంచ వ్యాప్తంగా వాక్సిన్లు అంటే ఎంతో కొంత భయం ఉంది. దాన్ని తగ్గించడం కోసం అమెరికాలో ఇంకా బతికే ఉన్న ఐదుగురు అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా, బైడన్లు మీడియా ముందు ప్రజలకు కనబడేలా వాక్సిన్ తీసుకున్నారు. కానీ, ట్రంప్, తన భార్య మాత్రం ఎవరికీ కనబడకుండా రహస్యంగా వాక్సిన్ తీసుకుని తనంటే ఇష్టపడే తన మద్దతుదారులతో నమ్మకం కలిగించకుండా ఉంచడం ద్వారా వైరసుని వ్యాప్తి చేయడానికి సిద్ధపడటం నిజమైన నేర ప్రవృత్తి మాత్రమే.
ట్రంప్, తన టీమ్ అమెరికాకు ప్రపంచానికి కరోనా విషయంలో చేసినది అతిపెద్ద ద్రోహం. ఇక జాత్యహంకార విషయంలో చేసింది మాత్రం ఏ మాత్రం తక్కువ కాదు. ఇవన్నీ తెలియని అయోమయంలో ఉన్న మోడీ భక్తులు “ట్రంప్ మోడీ దోస్తు, మేము గుడ్డిగా సపోర్ట్ చేస్తాం” అని అంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు?
ట్రంప్ ఫిబ్రవరి 2020 భారత్ యాత్ర వరకు కళ్ళు మూసుకుని ఉన్నాగాని తర్వాత కరోనా విషయంలో కళ్ళు తెరిచి దేశాన్ని హడావిడిగా జాగృత పరచడానికి మోడీ, రాష్ట్రంలో వైరస్ని ఎదుర్కోవడానికి వైఎస్ జగన్ చేసిన కృషిలో అమెరికాలో సగం చేసినా ట్రంప్ మళ్ళీ తప్పక గెలిచేవాడు. దీన్లో ఏ మాత్రం సందేహం లేదు. తను కూర్చున్న కొమ్మనే తనే నరుక్కున్నాడు. పర్యవసానంగా అమెరికా, ప్రపంచం నరకయాతన అనుభవిస్తున్నారు.
గురవా రెడ్డి, అట్లాంటా