విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం గట్టిగా ఒక వైపు చెబుతోంది. మరో వైపు చూస్తే ఉక్కు కార్మికులు అమ్మడానికి మీరెవరు, కొనడానికి వారెవరు అంటూ గత నలబై రోజులుగా ఉద్యమాన్ని చేస్తున్నారు.
న్యాయంగా అయితే ఉక్కు ఉద్యమం వల్ల ఉత్పత్తి పడిపోవాలి. కానీ ఇక్కడ కార్మికుల పట్టుదలతో ఉత్పత్తి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మార్చి 23న విశాఖ ఉక్కు కర్మాగారంలో హాట్ మెటల్ 20,400 మెట్రిక్ టన్నుల దాకా ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డుల దిశగా సాగింది.
ఇక ఇదే హాట్ మెటల్ ఉత్పత్తిలో ఈ నెల ఆరున 20, 350 మెట్రిక్ టన్నులు సాధిస్తే తమ రికార్డును తామే ఉక్కు కార్మికులు కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే బద్ధలు కొట్టారు. అంతే కాదు ఈ రెండు రికార్డులు గత మూడు దశాబ్దాల ఉక్కు చరిత్రలో ఎన్నడూ చూడనివే కావడం విశేషం.
ఇక ఈ మార్చి నెలాఖరు నాటికి మూడు వందల కోట్ల రూపాయల మేరకు లాభాలను ఆర్జించి కేంద్రానికి చూపించాలని కూడా ఉక్కు కార్మికులు పట్టుదలగా ఉన్నారు. మొత్తానికి నష్టాలు అంటూ తెగనమ్మడానికి కేంద్రం చూస్తే లాభాల బాటలో ఉక్కుని చూపిస్తూ ఎలా అమ్ముతారు అంటూ కార్మిక లోకం ప్రశ్నిస్తోంది.