ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గరం గరం అయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ అలసత్వంపై ఆయన మండిపడ్డారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ కోసం నాడు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. నేడు ఆరు రోజుల్లో పూర్తయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వ్యాక్సిన్ సాకు చూపి అడ్డుకుంటున్నారని నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు.
ఈ ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసి కోవిడ్‌పై దృష్టి పెట్టాలని ప్రభుత్వం అనుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. రానున్న కొత్త కమిషనర్‌ను కూడా తాము ఇదే కోరుతామని సజ్జల తెలిపారు. తాను ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న దృష్ట్యా, తక్కువ సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించలేనని నిమ్మగడ్డ చెప్పిన సంగతి తెలిసిందే.
పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని, కావున ఈ సమయంలో జోక్యం చేసుకోదలుచుకోలేదని నిమ్మగడ్డ తెలివిగా తప్పించుకున్నారు.
కొత్త కమిషనర్ భుజస్కంధాలపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఉందని నిమ్మగడ్డ నేడు చెప్పారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.