హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేగింది. 153 గ్రాముల కొకైన్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. వీటిని సరఫరా చేస్తున్న నైజీరియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడ్ని ప్రశ్నించగా మరోసారి డాడీ బాయ్ పేరు తెరపైకొచ్చింది.
డాడీ బాయ్.. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు కీలక వ్యక్తి. ఇది ఇతడి మారుపేరు మాత్రమే. హైదరాబాద్ దందాల్లో ఇతడిదే బిగ్ హ్యాండ్. నిజానికి ఇతడ్ని గతంలో పోలీసులు పట్టుకున్నారు. బయటకొచ్చిన తర్వాత తన మకాంను బెంగళూరు, గోవాలకు మార్చేశాడు.
మకాం మార్చినా దందా మాత్రం ఆపలేదు. హైదరాబాద్ కు సంబంధించి గుడ్ స్టఫ్ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేశాడు. అందులోనే ఆర్డర్స్ స్వీకరించడం, నైజీరియన్ వ్యక్తి జేమ్స్ తో డెలవరీ చేయడం స్టార్ట్ చేశాడు.
అయితే ఈసారి డాడీ బాయ్ కు హైదరాబాద్ నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది. ఏకంగా 153 కొకైన్ పిన్స్ కావాలనేది ఆ ఆర్డర్ సారాంశం. వీటికి ఎండీఎంఏ డ్రగ్ అదనం. ఈ వాట్సాప్ మెసేజీలను డీకోడ్ చేసిన పోలీసులు, చాకచక్యంగా డెలివరీ బాయ్ జేమ్స్ ను అరెస్ట్ చేశారు.
అయితే ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ ను ఎవరు ఆర్డర్ చేశారనే విషయం ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎప్పట్లానే ఈ సారి కూడా కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు, మరికొంతమంది ప్రముఖుల తనయుల పేర్లు బయటకొస్తున్నాయి. ఈ ప్రముఖులు ఎవరనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సిటీలోని ప్రముఖ స్టార్ హోటల్స్, నెక్లెస్ రోడ్, డ్రైవ్ ఇన్ స్పాట్స్ ను డెలివరీ కేంద్రాలుగా గుర్తించారు పోలీసులు. ఈమధ్య కాలంలో ఇంత మొత్తంలో హైదరాబాద్ లో కొకైన్ పట్టుబడడం ఇదే తొలిసారి.