ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'కూల్చివేతల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఉండవల్లి ప్రజావేదిక కూల్చివేత దెబ్బకి కబ్జా రాయుళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మరీ ముఖ్యంగా కృష్ణానది కరకట్టకి సంబంధించి చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న దరిమిలా, కబ్జారాయుళ్ళు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. అక్రమ కట్టడాలకు వైఎస్ జగన్ సర్కార్ నోటీసులు జారీ చేస్తోంటే, 'మా భవనాలు సక్రమం..' అంటూ అనుమతుల వివరాల్ని తెలుపుతూ ఆయా భవనాల ఎదుట బోర్డులు పెడుతున్నారు కబ్జా రాయళ్ళు.
చిత్రమేంటంటే, నిన్న మొన్నటిదాకా చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమేనని పరోక్షంగా ఒప్పుకున్న తెలుగు తమ్ముళ్ళు కూడా ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. 'అది చంద్రబాబు సొంత నిర్మాణం కాదు. అందులో చంద్రబాబు అద్దెకు వుంటున్నారంతే. పైగా, ఆ భవనానికి అన్ని అనుమతులూ వున్నాయి. భవన యజమాని ప్రభుత్వ నోటీసులకు వివరణ ఇస్తారు..' అంటూ తెలుగు తమ్ముళ్ళు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
ఈ రోజు ఉదయం నుంచే నోటీసులు అందించే ప్రక్రియ ప్రారంభించిన అధికారులకు తాజా పరిణామాలు ఒకింత వింతగా కనిపిస్తున్నాయి. అయితే, ఆక్రమణలకు పాల్పడి.. ఆ తర్వాత అధికారుల్ని ప్రలోభపెట్టి, అధికార దర్పం ప్రదర్శించి అనుమతులు పొందిన బాపతే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ అవి సక్రమ భవనాలు కానే కావని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది.
ఓ పక్క, ఇల్లు ఖాళీ చేసేసి ఇంకో చోటకి వెళ్ళిపోయేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచించుకుంటూనే, ఇంకోపక్క.. లింగమనేని రమేష్ (చంద్రబాబు నివాసం తాలూకు యజమాని) ద్వారా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా వ్యూహరచన చేస్తుండడం పచ్చ రాజకీయాలకు పరాకాష్ట. ఓ అద్దె భవనం నుంచి ఇంకో భవనంలోకి మారేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు లాంటి నాయకుడికి. పైగా, వివాదాల నుంచి తప్పించుకునే ఆస్కారం కూడా వుంటుంది. కానీ, అలా వెళితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.?
వీలైనంత యాగీ చేసి, వ్యవహారం కూల్చివేతలదాకా వస్తే.. తద్వారా సింపతీ పొందాలన్నది చంద్రబాబు మార్కు రాజకీయ వ్యూహం. ఇలాంటి రాజకీయ వ్యూహాలు పన్నబట్టే, అధికారం కోల్పోయి.. 23 మంది ఎమ్మెల్యేలతో మిగిలింది తెలుగు దేశం పార్టీ.