ఒకటా.? రెండా.? వెతుకుతూ పోతోంటే, కుప్పలు తెప్పలుగా తప్పులు కన్పిస్తున్నాయి. ఒకదాన్ని మించి, ఇంకోటి.. ఒక్కమాటలో చెప్పాలంటే, అదో పాపాల పుట్ట. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ శాఖలపై ప్రత్యేక దృష్టిపెట్టి సమీక్షలు జరుపుతోంటే, ఆ సమీక్షల్లో కల్లు చెదిరిపోయే వాస్తవాలు కన్పిస్తున్నాయట. పథకాల పేరుతో అడ్డగోలుగా దోపిడీ జరిగిందనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో, ఆయా అంశాలపై ఎలా చర్యలు తీసుకోవాలన్నదానిపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది.
'ప్రస్తుతానికైతే వ్యవస్థల ప్రక్షాళన మీద దృష్టి పెడదాం. లోపాల్ని సవరిద్దాం. అనుమానాస్పద నిర్ణయాల్ని సమీక్షిద్దాం. అడ్డగోలు కేటాయింపులపై చర్యలు ఖచ్చితంగా వుంటాయి. కానీ, దానికన్నా ముందు.. వీలైనంత త్వరగా సమీక్షలు పూర్తవ్వాలి. కొన్ని ప్రాజెక్టులు తాత్కాలికంగా ఆగాల్సి వస్తే, ఆపుదాం. పథకాల విషయంలోనూ ఇదే పద్ధతి పాటిద్దాం..' ఇలా సాగుతోందట ముఖ్యమంత్రి సమీక్షల వ్యవహారం.
నిజమే మరి, సరిగ్గా ఎన్నికలకు ముందర పదవి పోతుందన్న భయంతో, సర్వేల్ని చూసిన ఆందోళనతో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కేటాయింపులు జరిపిన సంగతి తెల్సిందే. అవన్నీ, కొత్త ప్రభుత్వానికి సంకటంగా మారాయి. చాలా పథకాల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగించలేమన్న భావన అధికారుల నుంచి వ్యక్తమవుతోంటే, ముఖ్యమంత్రి మాత్రం ఏం చేయగలరు.? సంక్షేమ పథకాలే కాదు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే వుండడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోందట ముఖ్యమంత్రికి.
క్షణం తీరికలేకుండా రోజంతా తాను సమీక్షలు నిర్వహిస్తోంటే, అధికారులు సైతం అలుపూ సలుపూ లేకుండా పనిచేస్తుండడం ముఖ్యమంత్రికీ ఆశ్చర్యం కల్గిస్తోంది. అదే సమయంలో, తాము చెబుతున్న విషయాల్ని ముఖ్యమంత్రి అవగతం చేసుకుంటున్న తీరుకి అధికారులూ ఆశ్చర్యపోతున్నారట. 'లెక్కలు తేలుతున్నాయ్.. పాపాల పుట్ట కదులుతోంది.. ముందుంది ముసళ్ళ పండగ..' అంటూ సమీక్షల నుంచి బయటకొస్తున్న లీకులు చూస్తోంటే, అతి త్వరలోనే అక్రమార్కులపై వైఎస్ జగన్ ప్రభుత్వం కొరడా ఝుళిపించడం ఖాయంగానే కన్పిస్తోంది.
'ఏమన్నా చేస్కోండి, కక్షసాధింపు చర్యలకు దిగితే ఎలా ఎదర్కోవాలో మాకు తెలుసు.. వైఎస్సారే మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు..' అంటూ టీడీపీ నేతలు ప్రస్తుతానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు గానీ.. లోలోపల తెలుగు తమ్ముళ్ళ భయం బద్దలవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చేమో.!