నాకు కులం లేదు, నాకు కులాన్ని అంటగట్టకండి అంటూ గొప్పలు చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లెక్కలు వేసుకుని, ఏరికోరి, కాపులు అధికంగా వున్న రెండు నియోజకవర్గాలు ఎంచుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు ఈ రెండింటిలో కాపులు అధికంగా వున్న, కాపుల అడ్డా అనుకున్న భీమవరంలో ఆయనకు గట్టి ఝలక్ తగులుతున్నట్లు కనిపిస్తోంది.
కొణిదెల ఫ్యామిలీ కాపుల పేర్లు చెప్పి రాజకీయాలు చేయడం తప్ప వాళ్లకు చేసింది ఏదీ లేదన్న నగ్న సత్యాన్ని ఆ సామాజిక వర్గం గమనించింది. గతంలో చిరంజీవికి షాక్ ఇచ్చింది ఆ వర్గం. ఇప్పుడు పవన్ కు కూడా గట్టి షాక్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
లేస్తే మనిషిని కాదు అన్నట్లు పవన్ రంకెలు వేసారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందుగా చాలా తెలివిగా బాబుకు కలిసి వచ్చేలా, జగన్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసారు. ఆఖరికి దేవుడి దయవుంటే జగన్ గెలవకూడదన్నట్లు కూడా మాటలు తూలారు.
ఇప్పుడు జనసేన ఎన్నికల ఫలితాల వేళ సోది లొకి కూడా లేకపోయింది. తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి తొక్కిసిన ఓటర్లు జనసేనను తిప్పి తిప్పి కొట్టారు. అభిమానులు, వంది మాగధులను చూసుకుని పవన్ అంతా తన బలం అనుకున్నారు. ఇప్పుడు అసలు బలం ఎంతో తెలిసిపోయింది.
తమ తమ దైనిక వ్యవహారాలకు వేరే కులాలతో అంటకాగుతూ, అవసరాల కోసం కాపుల ఓట్ల మీద, సంఖ్య మీద ఆధారపడే కొణిదెల కుటుంబానికి ఈ విధంగా కాపులు రెండోసారి షాక్ ఇచ్చారు.