ప్రకాశం జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గంలో కన్నా కర్ణాటక రాజధాని బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారనే టాక్ ఇప్పటిదేమీ కాదు. ముందుగా ఈ జాబితాలో దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు బాగా వినిపించింది. దర్శిలో గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాల్ నియోజకవర్గంలో అస్సలు ఉండరనే పేరుంది. ఆయన స్థానంలో ఆయన సోదరుడు స్థానికంగా రాజకీయం చేస్తూ ఉంటారని, వేణుగోపాల్ బెంగళూరుకు పరిమితమై అక్కడ వ్యాపారాలను చూసుకుంటున్నారనే టాక్ ఉంది.
మరి ఆయన సంగతేమో కానీ.. కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ మాత్రం అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు. ఆయన ఉన్నట్టుండి బెంగళూరు నుంచి ఏపీలోకి తన మందీ మార్భలంతో ప్రవేశించే ప్రయత్నం చేయడంపై వార్తలు వచ్చాయి. కరోనా లాక్ డౌన్ వేళ ఏపీలోకి దాదాపు 40 మందితో ప్రవేశించే ప్రయత్నం చేశారని ఆయనపై వార్తలు వచ్చాయి. ఆయనను ఏపీ పోలీసులే అడ్డుకోవడం, చివరకు ఆయనను-ఆయన కుటుంబాన్ని ఏపీలోకి పంపించి, మిగతా వాళ్లను మాత్రం తిరిగి కర్ణాటకకు పంపేశారు పోలీసులు.
అయితే ఇక్కడ వచ్చే డౌటేమిటంటే.. ఈ ఎమ్మెల్యేకు ఇన్ని రోజులకు గానీ సొంత నియోజకవర్గం గుర్తుకు రాలేదా అని? పరిస్థితి చూస్తుంటే ఈయన చాన్నాళ్లుగా బెంగళూరులోనే ఉన్నట్టున్నారు. లాక్ డౌన్ కు ముందు నుంచినే అక్కడున్నట్టున్నారు. ఇన్నాళ్లూ వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఎలాగూ లాక్ డౌన్ పొడిగించారు కాబట్టి.. ఇక ఉండలేక అనుచరగణంతో సొంత నియోజకవర్గం బాట పట్టారు. అంతగా నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటే.. ఏదో ఒక వెహికల్ లో సింపుల్ గా వెళ్లి ఉంటే ఇలా దొరికే వారు కాదేమో, ఏకంగా 40 మంది అనుచరులను వేసుకుని వెళ్లడంతో రాద్ధాంతం తప్పలేదు.
అయినా ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు నియోకవర్గాల్లో లేకపోవడం ఏమిటి? చాలా మంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నారు. కొందరు రిస్క్ తీసుకోకుండా ఇళ్ల నుంచినే వాకబు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఏదో రకమైన సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉన్నారు. ఈ రెండు కేటగిరిల్లోనూ కాకుండా.. మధుసూదన్ యాదవ్ మాత్రం బెంగళూరుకు ఇన్నాళ్ల పాటు పరిమితం అయిపోయి, ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు.