అన్నీ సమస్యలే.. స్కూల్స్ ఎలా తెరుస్తారు?

తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయి కాబట్టి లాక్ డౌన్ ఎత్తేస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని రంగాల్లో పూర్తిగా లాక్ డౌన్ ను ఉపసంహరించారు. అయితే పాఠశాలలకు సంబంధంచి మాత్రం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా…

తెలంగాణలో కేసులు తగ్గుతున్నాయి కాబట్టి లాక్ డౌన్ ఎత్తేస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని రంగాల్లో పూర్తిగా లాక్ డౌన్ ను ఉపసంహరించారు. అయితే పాఠశాలలకు సంబంధంచి మాత్రం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

అన్ లాక్ లో భాగంగా పాఠశాలలు కూడా తెరుస్తామంటే అది మరింత ప్రమాదం అంటున్నారు నిపుణులు. ప్రైవేట్ స్కూల్స్ సంగతి పక్కనపెడితే.. ప్రభుత్వ పాఠశాల్ని వచ్చేనెల 1వ తేదీ నుంచి తెరవడం ఆత్మహత్యసదృశంగా చెబుతున్నారు. దీనికి సంబంధించి తెరపైకొస్తున్న సమస్యలేంటో చూద్దాం.

సమస్య-1 – థర్డ్ వేవ్ ముప్పు

దేశంలో థర్డ్ వేవ్ తప్పనిసరిగా ఉంటుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది కూడా ఎంతో దూరంలో లేదు. మరో 6 వారాల నుంచి 8 వారాల్లోపే ''మూడో ముప్పు'' పొంది ఉందని గట్టిగా చెబుతున్నారు. 

మరోవైపు  ఈసారి చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇలాంటి టైమ్ లో స్కూల్స్ తెరవాలనే ఆలోచన అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు.

సమస్య-2 – చిన్నారుల టీకా

పెద్దోళ్లు టీకాలు వేయించుకుంటున్నారు. చిన్నారలకు ఇప్పటివరకు టీకా అందుబాటులోకి రాలేదు. కనీసం టీకాలు ఇప్పించైనా స్కూల్స్ తెరిస్తే సబబుగా ఉంటుంది.

టీకాలు కూడా ఇవ్వకుండా స్కూల్స్ కు చిన్నారుల్ని పంపిస్తే, అది మరింత ప్రమాదానికి దారితీస్తుంది.

సమస్య-3 – పాఠశాలల్లో శానిటైజేషన్

ప్రైవేట్ స్కూల్స్ సంగతి పక్కనపెడితే.. ప్రభుత్వ బడుల్లో శానిటైజేషన్ సంగతి అందరికీ తెలిసిందే. చాలా ప్రభుత్వ పాఠశాల్లో బాత్రూమ్స్ కూడా లేవు.

ఓపక్క శుభ్రతపై ఎలాంటి దృష్టి పెట్టకుండా, మరోవైపు పాఠశాలలు తెరిస్తే కోరి ముప్పు కొనితెచ్చుకోవడమే.

సమస్య-4 – పుస్తకాల్లేవ్..!

వీటితో పాటు పుస్తకాల సమస్య కూడా వేధిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలకు కోటి 43 లక్షల పుస్తకాలు అవసరమైతే వాటిలో ఇప్పటివరకు సగం మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.

ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లల కోసం పుస్తకాలం టెండర్లు ఇంకా మొదలుకాలేదు. షాపుల్లో బుక్స్ లేవు. ఇలాంటి టైమ్ లో క్లాసుల నిర్వహణ సాధ్యమేనా?

సమస్య-5 – భౌతిక దూరం అసంభవం

ఇక అత్యంత ముఖ్యమైన భౌతిక దూరం సాధ్యమేనా అనేది ఇక్కడ ప్రశ్న. చిన్న గదుల్లో పదుల సంఖ్యలో పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పే పరిస్థితుల్లో భౌతిక దూరం ఎలా అమలౌతుంది. ఒకవేళ కష్టపడి అమలు చేసినా, పిల్లలు పాటిస్తారా?

ఈ అంశాలేవీ పరిశీలించకుండా వచ్చేనెల 1 నుంచి స్కూల్స్ తెరుస్తామంటోంది ప్రభుత్వం. విద్యార్థులు ఆన్ లైన్ లోనే చదువుకుంటారా లేక స్కూల్స్ కు వస్తారా అనే అంశంపై నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకే వదిలేయాలని నిర్ణయించినట్టు లీకులు వస్తున్నాయి. 

ఒకవేళ పాఠశాలలకే వచ్చి చదువుకోవాలంటే పేరెంట్స్ అంగీకార పత్రం ఇవ్వాలంటూ మరికొన్ని లీకులు వస్తున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వమే గట్టిగా ఓ నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతోంది?  తమకు సమ్మతమే అంటూనే కొన్ని కొర్రీలు పెడుతున్న ఉపాధ్యాయ-విద్యార్థి సంఘాలు సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నాయి.?