మీడియాపై కుట్ర

ప్రత్యర్థి ఎత్తును ముందే ఊహించి, దానికి తగిన ఎత్తును సిద్ధం చేసుకునే ఆట చదరంగం Advertisement ప్రత్యర్థి అసలు ఎత్తే వేయకుండా, చేతులు కట్టేసి, తన ఆట తన చిత్తానికి ఆడేయడంరాజకీయ చదరంగం మీడియా,…

ప్రత్యర్థి ఎత్తును ముందే ఊహించి, దానికి తగిన ఎత్తును సిద్ధం చేసుకునే ఆట చదరంగం

ప్రత్యర్థి అసలు ఎత్తే వేయకుండా, చేతులు కట్టేసి, తన ఆట తన చిత్తానికి ఆడేయడంరాజకీయ చదరంగం

మీడియా, పారిశ్రామిక, కాంట్రాక్టు, రాజకీయం, ఇలా ప్రతి రంగంలోనూ పోటీ లేకుండా చేసుకుంటూ, అడ్డువచ్చిన వారిని పక్కకు తప్పించుకుంటూ, అన్ని విధాల అనుభవిస్తున్న ఏకఛధ్రాథిపత్యాన్ని ఎప్పటికైనా తమ చేతిలోనే వుంచుకోవాలని చూస్తున్న కమ్మ సామాజిక వర్గం అందుకోసం అన్ని వైపుల నుంచి ఎత్తుగడలు వేసుకుంటూవస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించగలిగితే ఇక జగన్ అనే వాడు వుండడు..వైకాపా అనే పార్టీ వుండదు. తెలుగుదేశం అనే పార్టీ రూపంలో రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో వుంచుకున్న కమ్మ సార్వభౌధికారం అలా కొనసాగుతుంది అనే ఆలోచన దిశగా పన్నాగాలు సాగుతున్నాయి. అలాంటి అనేకానే పన్నాగాల్లో మీడియా నియంతృణ అనేది ఒకటి.

రాష్ట్రంలోని మీడియాలో అధిక శాతం తెలుగుదేశం అనుకూల వర్గం చేతిలోనే వున్న సంగతి అందరికీ తెలిసిందే.కేవలం ఒక్క సాక్షి మాత్రమే వేరుగా వుంది. లీడింగ్ పరిస్థితిలో వున్న మీడియాలో తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా వున్న ప్రింట్ మీడియా ఒక్క సాక్షి మాత్రమే. మిగిలిన మీడియాలో ఒకటి రెండు కాస్త న్యూట్రల్ గా వున్నా, అవి ప్రజలకు రీచ్ కావడం లేదు. కానీ సాక్షి వ్యవహారం అలా కాదు. చాలా పక్బడందీగా బాబు పాలన వ్యవహారాలను వెలికి తీస్తోంది..ప్రచురిస్తోంది. అది సాక్షి కదా, వైకాపా మౌత్ పీస్ కదా అని కొట్టిపారేసే వారు కొట్టిపారేసినా, నమ్మేవాళ్ల సంఖ్యకు కూడా తక్కువ లేదు. 

అందుకే మీడియా నియంత్రణకు నిర్మొహమాటంగా నడుం బిగించింది. ముందుగా దాదాపు అన్ని మీడియాలను స్మూత్ గా చక్కబెట్టుకుంటూ వచ్చింది. ఎన్టీవీ వ్యవహారమే ఇందుకు సాక్షి. టీవీ కాలమిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కార్యక్రమానికి నిస్సిగ్గుగా అడ్డుకట్ట వేసిన వైనమే ఇందుకు రుజువు. ఆపైన ఇప్పుడు దాదాపు తెలుగు ప్రింట్..విజువల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత అన్నది దాదాపుగా లేనట్లే. కానీ ఇక మిగిలింది సాక్షి మాత్రమే.

వైకాపా అష్టదిగ్బంధం

వైకాపా వెన్నదన్నులన్నింటినీ దెబ్బతీసే ప్రయత్నంలో పడింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకోసం బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది. వైకాపాకు కీలకం దాని నేత జగన్..అతగాడి ఆర్థిక మూలాలు..పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, అంతకు మించి ప్రయోజనాలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేసే సాక్షి పత్రిక. సో వీటన్నింటిని ఓ పథకం ప్రకారం క్లోజ్ చేయాలనే ఆలోచనతో అధికార తెలుగుదేశం ముందుకు సాగుతోంది. ముందుగా ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించే పని ప్రారంభమైంది. ఆ పని పూర్తి నిజాయతీతో, విశ్వాసవంతగా జరిపే కృషిచేస్తున్నారు. అందులో భాగంగా అవసరమైతే పార్టీలో వున్న వారిని పక్కన పెడుతున్నారు కూడా తాత్కాలికంగానైనా. అలా అయితేనే ఇంకా రావాలని అనుకున్నవారు ఎవరైనా వుంటే, ఆ విధంగా వారికి పూర్తి నమ్మకం కలిగిస్తున్నారు. సెకెండ్ ఫేస్ లో నాయకులను చేర్చుకునే పని సాగుతోంది. ఇలా రావాలనుకునేవారి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తోంది. 

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల వ్యవహారం ఒక పక్కచూస్తూనే జగన్ కేసులను, కేంధ్రంలో తనకున్న పలుకుబడిని వాడుకుంటూ జగన్ ఆర్థిక మూలాలను బిగించే పని ప్రారంభించారు. ఒకేసారి కోట్ల రూపాయిల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.  సరే, ఆ టెక్నికాలిటీస్ వగైరా వ్వవహారాలన్నీ అలా వుంచితే, ప్రస్తుతానికైతే జగన్ ఆర్థిక మూలాలన్నీ బాగా ఇబ్బందుల్లో పడినట్లే. అందులో సందేహం లేదు. అయితే వీటన్నింటి వల్లా జగన్ ఇబ్బందులు పడితే పడొచ్చు కానీ, సాక్షి కాదు. దాని సర్క్యులేషన్, ఆదాయం అలాగే వున్నాయి. పైగా ఇటీవలే సాక్షి మెల్లగా లాభాల బాటలోకి వచ్చింది కూడా. అందువల్ల సాక్షిని నేరుగా టార్గెట్ చేయాల్సిందే తప్ప, ఇలా ఎరౌండ్ ది బుష్ అనే ట్రీట్ మెంట్ పనికిరాదు. అందుకే నేరుగా టార్గెట్ చేసింది. 

ముద్రగడ దీక్ష

ముద్రగడ దీక్ష సమయంలో ప్రభుత్వం నేరుగా కేబుల్ ఆపరేటర్లను ప్రభావితం చేసింది. సాక్షి ఛానెల్ ప్రసారాలు ఆపేసింది. దీంతో సాక్షి రెండువిధాల పోరాటం ప్రారంభించింది. ఒకటి పత్రికా స్వేచ్ఛపై దాడికి ప్రతిగా రాష్ట్ర వ్యాప్త ప్రదర్శనలు.  మరోక్క చట్టబద్ధమైన న్యాయ పోరాటం. ఇదంతా ప్రభుత్వాన్ని కాస్త ఇరకాటంలో పెట్టింది. అందుకే ఇక ప్రభుత్వం నేరుగా కలుగచేసుకోవడం ఆపేసింది. పరోక్ష కార్యాచరణకు తెరతీసింది. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు రంగంలోకి దిగారు. కేబుల్ ఆపరేటర్ల యూనియన్ నాయకులు ప్రభుత్వం వైపు కొమ్ము కాస్తున్నారు. దీంతో చిన్న చిన్న గ్రామాలను ముందుగా టార్గెట్ చేసుకున్నారు. తమ ఆధిపత్యం వున్న గ్రామాలపై ముందుగా దృష్టి పెట్టారు. సాక్షిపత్రిక ఏజెన్సీలను క్యాన్సిల్ చేయించే పనిలో పడ్డారు.

''నేను సాక్షితో పాటు ఆంధ్ర జ్యోతి, ఈనాడు కూడా నాలుగైదు గ్రామాలకు సరఫరా చేస్తాను. కానీ ఎవరన్నది వెల్లడించలేను కానీ, నన్ను పిలిచి సాక్షి ఆపేయమని ఆదేశించారు. దాంతో ఆపేయక తప్పలేదు' విశాఖ జిల్లాకు చెందిన పత్రికల ఏజెంట్ చెప్పిన మాట ఇది. ''సాక్షి తెప్పించడం లేదా అని అడిగే వాళ్లకు ఏం సమాధానం చెప్పలేక, ఏదో ఒకటి చెప్పి తప్పించకుంటున్నాను'' అని అన్నాడతను. పట్టణాలు, వైకాపా జనాలు వున్నచోట ఈ తరహా ఎత్తుగడ సాగదు. కానీ సాగినన్ని చోట్లు సాగుతోంది.

ఇంక మరోపక్క కేబుల్ ఆపరేటర్ల యూనియన్లు కూడా రంగంలోకి దిగాయి. '' నా దగ్గర వున్న సాక్షి కేబుల్ బాక్స్ ను తెచ్చి ఇచ్చేయమని మా యూనియన్ లీడర్లు అడిగారు. సాక్షి ప్రసారాలు వద్దన్నారు..ఎబిఎన్ ఆంధ్ర జ్యోతిని వన్ ఛానెల్ లోనూ, టీవీ 9 ను రెండో స్థానంలో ప్రసారం చేయమని ఆదేశించారు'  అని ఓ కేబుల్ ఆపరేటర్ వివరించారు. '..రేపు ఏ సమస్య వచ్చినా మాకు సాయం చేయాల్సింది వాళ్లే కదా..వాళ్ల మాట కాదని ఏం చేయగలను' అన్నాడు అతను. అలాగే పట్టుకెళ్లి సాక్షి బాక్స్ లు అప్పగించేస్తున్నాం అని మరి కొందరు కేబుల్ ఆపరేటర్లు చెప్పారు. అంటే కేబుల్ ఆపరేటర్ యూనియన్ నాయకుల ద్వారా, పార్టీ నాయకుల ద్వారా ఇటు సాక్షి ఛానెల్ ను, అటు సాక్షి పత్రికను అడ్డుకునే కార్యక్రమం సైలెంట్ గా సాగిస్తున్నారన్నమాట. దీనిని ఏ కోర్టులు మాత్రం ఏ విధంగా అడ్డుకోగలవు?

ఫైబర్ నెట్

ఇక త్వరలో రాబోయే ఫైబర్ నెట్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా విజువల్ మీడియా మొత్తాన్ని తన కంట్రోల్ లో వుంచుకునే పనికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఫైబర్ నెట్ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇంటింటికి ఇంటర్ నెట్ అందించే కార్యక్రమం ఇది.అయితే అక్కడితో ఆగడం లేదు. అదే లైన్ ద్వారా ఛానెళ్లు సరఫరా కూడా చేఫడుతొంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా, కేబుల్ ఆపరేటర్ల యూనియన్ల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.కేబుల్ ఆపరేటర్లకు వాళ్లకు వున్న చానెల్ కనెక్షన్ల సంఖ్య ఆధారంగా ఇంత అని ఖరీదు కడుతున్నారు. ఒక గ్రామంలో రెండు వందల కనెక్షన్లు వుంటే అయిదు లక్షలు అని ఖరీదు కడుతున్నారు. ఆ మేరకు బాండ్లు అందిస్తున్నారు. అగ్రి మెంట్లు చేసుకుంటున్నారు. మరో మూడేళ్ల తరువాత ఫైబర్ నెట్ సంస్థ కావాలి అనుకంటే, ఆ అయిదు లక్షలు అందించి, కేబుల్ నెట్ వర్క్ ను ఆ గ్రామంలో స్వాధీనం చేసుకుంటుంది. అది ముందుస్తు అగ్రిమెంట్ అన్నమాట. 

అంటే ఫైబర్ నెట్ సరఫరాలు కుదరుకుని, అన్ని బాలారిష్టాలు, సమస్యలు తీరిపోయేసరికి రెండు మూడేళ్లు పడుతుంది. అప్పటికి ఎన్నికలు కూడా వస్తాయి. అవసరం అనుకంటే ఈ అగ్రిమెంట్లు, బాండ్లు ఆసరాగా చేసుకుని, కేబుల్ వ్యవస్థను తమ స్వాధీనం చేసుకుంటారన్నమాట. అయితే ఇక్కడ అనేక అనుమానాలు వున్నాయి. ప్రభుత్వం కేవలం ఇంటర్ నెట్ ను గ్రామాలకు వ్యాపింప చేయాలి అనుకుంటే, ఈ తతంగాలు అన్నీ ఎందుకు? గ్రామాల్లోని కేబుల్ వ్యవస్థకు ఎలా ఖరీదు కడుతున్నారు? ఎవరు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు? ఎవరు బాండ్లు ఇస్తున్నారు? దీనిలో కేబుల్ ఆఫరేటర్ సంఘాల నాయకుల ప్రమేయం ఏమేరకు? వారికి ప్రయోజనం ఏమిటి?

అంటే బయటకు రాని వ్యవహారాలు ఏవో జరుగుతున్నాయి. ఎపి ఫైబర్ నెట్ పేరిట ఏదో జరుగుతోంది. అదంతా జనం పసిగట్టేసరికి జరగాల్సిన వన్నీ జరిగిపోతాయి. మొత్తం చానెళ్లపై నియంత్రణ ఎవరో ఒకరి చేతుల్లోకి వెళ్లిపోతుంది. 

నెట్ వ్యవస్థపై

సామాజిక మాధ్యమాలు, నెటిజన్లు వారి అభిప్రాయాలు, వెబ్ మీడియా ఇవన్నీ ప్రస్తుతం కాస్తయినా స్వేచ్ఛగా, స్వతంత్రంగా నడుస్తున్నాయి. వీటిపై నియంత్రణ అంతగా లేదు. ఇప్పుడు ఈ రంగంపై కూడా ప్రభుత్వం మెల్లగా పట్టు సంపాదించాలనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంటర్ నెట్ వ్యవస్థను జనాలకు అందించడం వరకే ఫైబర్ నెట్ కార్యక్రమం పరిమితం అవుతుందా? దాన్ని ప్రభుత్వ నియంత్రణలో వుంచుకుని, కొన్ని సైట్లు వంటివాటిపై ఫైర్ వాల్ వంటి వ్యవస్థలను ప్రయోగిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇలా మొత్తానికి భావ ప్రకటన పై, పత్రికా స్వేఛ్చపై అనథికార కుట్రకు శ్రీకారం చుట్టేసారు. అమలు జరిగిపోతోంది. కానీ ఎటొచ్చీ ఈ వ్యవహారం బయటకు రావడం లేదు అంతంగా. అంతా చాపకింద నీరులా సాగిపోతోంది. మరి జర్నలిస్టు సంఘాలు, రాజ్యాంగ బద్దమైన పాలన కోరుకునే మేధావి సంఘాలు ఇవన్నీ ఎప్పుడు గుర్తించి పోరాటం ప్రారంభిస్తాయో? అలా ప్రారంభించినా దాని వల్ల ఫలితం వుంటుందో? వుండదో?

ఎందుకంటే ఇప్పుడు పేరుకే మనం ప్రజాస్వామ్యంలో వున్నాం..కానీ అమలు అవుతున్నదంతా నియంతృత్వమే. అపరిమిత అధికారం ప్రసాదిస్తున్న వైపరీత్యం ఇది.  దీనికి విరుగుడు అందించేది ఎన్నికల వేళ ప్రజల చైతన్యం మాత్రమే. కానీ ఈ మీడియా నియంతృత్వం ఆ చైతన్యాన్ని ఏ మేరకు అణచివేస్తుందన్నది భవిష్యత్ నే తెలియచేస్తుంది.

ఆర్వీ