18 నెలలు.. మూడుసార్లు తీవ్రవాద దాడులు.. పదుల సంఖ్యలో సామాన్యులు బలి.. ఉగ్రవాదం దెబ్బకి ఫ్రాన్స్ విలవిల్లాడుతోంది. తాజాగా మరో ఎటాక్.. ఈసారి 80 మంది పౌరులు మృతి చెందారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం 'బాస్టిల్ డే' వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా, ఉత్సాహంగా పెద్దయెత్తు పాల్గొంటారని తెలిసి, ఉగ్రవాదులు పక్కా స్కెచ్‌తో దాడికి దిగారు. ఇంకేముంది.? 80 మంది క్షణాల్లో విగతజీవులుగా మారిపోయారు.
ప్రపంచంలో తీవ్రవాదం కొత్త పుంతలు తొక్కుతోంది. ఐసిస్ అనే నరహంతక తీవ్రవాద సంస్థ గొడుగు కిందికి మిగతా తీవ్రవాద సంస్థలు చేరిపోయాయి. మొత్తంగా ప్రపంచాన్ని ఐసిస్ వణికిస్తోంది. ఫ్రాన్స్‌పై తాజా దాడి జరిపింది తామేనంటూ ఐసిస్ ప్రకటించుకుంది. ఓ భారీ ట్రక్‌లో పేలుడు పదార్థాలతో ఈ దాడికి తెగబడింది ఐసిస్. ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది.. అందులోని తీవ్రవాదులు సామాన్యులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడితో ఫ్రాన్స్ షాక్‌కి గురయ్యింది.
ఫ్రాన్స్‌పై తాజాగా జరిగిన ఐసిస్ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడి అత్యంత హేయమని అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోడీ సహా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్రాన్స్‌కి అన్ని విధాలా అండగా వుంటామనీ, ఉగ్రవాదంపై పోరులో కలిసి పనిచేస్తామని వివిధ దేశాలు ఫ్రాన్స్‌కి మద్దతు పలికాయి.
ఏదిఏమైనా, ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశమూ ఐసిస్ పడగ నీడ నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అమెరికా లాంటి కొన్ని దేశాలు మొదట్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయి.. తెరవెనుక వాటికి సహాయ సహకారాలు అందించాయి. సోవియట్ యూనియన్ని విచ్ఛిన్నం చేయడానికి అమెరికా పన్నిన ఈ ఉగ్ర కుట్ర.. ఇప్పుడు ప్రపంచానికి పెను ప్రమాదంగా తయారైంది. ఇప్పుడీ ఐసిస్ ఉగ్ర మూకల ఆట కట్టించడం ఎలా.? సమాధానం లేని ప్రశ్న ఇది.