మగధీర తరువాత చేయాల్సిన సినిమా ‘గోవిందుడు’

గోవిందుడు అందరి వాడేలే…కృష్ణవంశీ-రామ్ చరణ్- బండ్ల గణేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ప్రారంభంలో ఎన్ని వదంతులు వినిపించాయో, విడుదల నాటికి అంత పాజిటివ్ టాక్ సంతరించుకున్న సినిమా ఇది. ఈ సినిమా దసరా…

గోవిందుడు అందరి వాడేలే…కృష్ణవంశీ-రామ్ చరణ్- బండ్ల గణేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ప్రారంభంలో ఎన్ని వదంతులు వినిపించాయో, విడుదల నాటికి అంత పాజిటివ్ టాక్ సంతరించుకున్న సినిమా ఇది. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 1న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ మీడియాతో మచ్చటించారు. ఆ విశేషాలు

ఫ్యామిలీ జోనర్

మగధీర తరువాత ఫ్యామిలీ జోనర్లో ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ ఎందుకో ఎంతకీ కుదరలేదు. ఇప్పటికి వీలయింది. ఎంతో మంది దర్ళకులతో ఈ జోనర్ పై డిస్కస్ చేసాను. ఏమాత్రం రెగ్యులర్ ఫార్మాట్ మిక్స్ కానీ ఫ్యామిలీ సినిమా చేయాలని నా కోరిక. కానీ అందరూ మిక్స్ చేసి చేయాలన్నారు. కృష్ణ వంశీ మాత్రమే  పూర్తిగా ఆ జోనర్ లోనే చేద్దామని ముందుకు వచ్చారు. గత కొంత కాలంగా కృష్ణ వంశీ సినిమాలు బాగా ఆడి వుండకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన విఫలమైనట్లు కాదు. ఆయన ఎంచకున్న సబ్జెక్ట్ లు విఫలమయ్యాయి. నాకు ఆయన సినిమాలు నిన్నేపెళ్లాడుతూ, మురారి, చందమామ చాలా ఇష్టం. అడియో ఫంక్షన్ లో కృష్ణవంశీ బరెస్ట్ అయ్యారంటే దానికి మీనింగ్ వుంది. నిజానికి మగవాళ్లు అలా బరస్ట్ కావడం అరుదు. అందుకే మగవాళ్లకే ఎక్కువ హార్ట్ ఎటాక్ లు వస్తాయి. 

పరుచూరి సాయం

కృష్ణవంశీ అందించిన కథకు, పరుచూరి బ్రదర్స్ చాలా సాయం చేసారు. కథ, స్క్రీన్ ప్లే మాత్రం కృష్ణవంశీదే. అయితే దానికి వీలయినన్ని చోట్ల మంచి ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం, ఇలాంటి వన్నీ పరుచూరి బ్రదర్స్ చేసారు. కృష్ణవంశీ నటుల నుంచి వీలయినంత పిండుతారంటారు..కానీ మేమే ఆయనను పిండేసాం ఈ సినిమా కోసం. మమ్మల్ని ఎంత వాడాలో అంతా వాడుకోమన్నాం. ఓ పాటలో అయితే మరీనూ.

ప్రకాష్ రాజ్ తో కొత్తదనం

ప్రకాష్ రాజ్ ను ఈ మధ్యకాలంలో సరిగ్గా వాడుకోలేదు. ఈ సినిమాతో ఆ కొరత తీరిపోయింది. తాత పాత్రకు రాజ్ కిరణ్ అనుకున్నాం. కొంత షూట్ చేసాం. కానీ మాకు సంతృప్తి కలగలేదు. నేటివిటీ మిస్ అయిన ఫీలింగ్. దాంతో ప్రకాష్ రాజ్ గారిని చేర్చాం. దాంతో సినిమా లెవెల్ మారిపోయింది. ఆయన కూడా కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చారు. దాంతో చాలా బాగా డెవలప్ అయింది కథ. 

కథలు నచ్చలేదు

బోయపాటి శీను రెండు కథలు చెప్పారు. నచ్చలేదు. శ్రీను వైట్లతో ప్రాధమిక చర్చలు మాత్రమే జరిగాయి. ఏదైనా మంచి కథ తెస్తే అప్పుడు ఆలోచించాలి. ఇప్పటికైతే ఏమీ లేదు. మణిరత్నం మంచి కథే చెప్పారు కానీ, నాకు నప్పదు. అందుకే వదిలేసాను. కావాలంటే ఆ సినిమా తమిళ్ లో వస్తుంది కదా, మీరే చూసి చెప్పండి నా నిర్ణయం కరెక్టో కాదో. ప్రస్తుతానికి గోపీ మోహన్, కోన వెంకట్ చెప్పిన కథ మాత్రం ఓకె చేసాను. దాన్ని వచ్చే ఏడాది సెట్ పైకి తీసుకెళ్తాము. దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. త్వరలో చేస్తాం.

కొరటాల శివతో

నేను సాధారణంగా అంత సులువుగా సినిమాలు కమిట్ కాను. అడ్వాన్స్ లు తీసుకోను. నిర్మాత బండ్ల గణేష్ బలవంతం కారణంగా కొరటాల శివ సినిమాకు కొబ్బరి కాయ కొట్టాల్సి వచ్చింది. గణేష్ మంచి రోజు అంటూ తెగ బలవంతం చేసాడు. కానీ ఏమయింది? అయినా ఎప్పటికైనా కొరటాల శివతో సినిమా చేస్తాను. 

నిర్మాత కావాలన్నది అమ్మ కోరిక

నేను నిర్మాత కూడా కావాలన్నది అమ్మ కోరిక. అందుకోసమే డాడీ 150 సినిమా నేను నిర్మిస్తున్నాను. దానికి చాలా కథలు విన్నాం. నచ్చలేదని కాదు కానీ, పూర్తి ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయాలని చూస్తున్నాం. డాడీ కొంచెం ఖాళీ అయితే మొదలు పెట్టేస్తాం. దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలో నిర్ణయిస్తాం.

సెంటిమెంట్లు బ్రేక్ చేస్తుంది

ఎనిమిదో సినిమా తెలుగు హీరోలకు గండం అని నేనూ విన్నాను. నాకు అలాంటి నమ్మకాలేం లేవు. అయినా గోవిందుడు అన్నింటినీ బ్రేక్ చేసి, విజయం సాధిస్తుంది. సినిమా ఇంతవరకు పూర్తిగా చూడలేదు. డబ్బింగ్, రీరికార్డింగ్ అప్పుడు కొంచెం కొంచెం చూసాను. 30న మమ్మీ డాడీలతో కలిసి చూస్తాను. 

సీతారామయ్య…

సీతారామయ్య మనవరాలు సినిమా ఈ సినిమాకు ఇన్స్ పిరేషన్ అయితే కావచ్చు కానీ, దానికీ దీనికి సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్త సంఘటనలతో కూడిన కొత్త సినిమా. ఎక్కడా మరీ హెవీ కాకుండా అక్కడిక్కడ లైట్ చేసుకుంటూ వచ్చాం క్లయిమాక్స్ కూడా ఎమోషనల్ గా వుంటుంది తప్ప, హెవీ కాదు. 

బిజినెస్ మైండ్ కాదు.

నాది బిజినెస్ మైండ్ కాదు. నేను సినమాలకు, ఓ కళాకారుడిగా సరిపడే మైండ్ సెట్ తో పెరిగాను. కానీ నా భార్య, కొందరు సన్నిహితుల కోసం ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. నా వైఫ్ బిజినెస్ కు అనుగుణంగా పెరిగింది. ఆమె అంతా నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చింది. అయినా అందులో నాది చాలా చిన్న స్టేక్. ఒక విధంగా బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా.

చెబితేనే చూస్తాను.

నేను పత్రికలు, వెబ్ సైట్లు చూడను. మా వాళ్లు ఎవరైనా ఫలానా పత్రిక, ఫలానా వెబ్ సైట్ చూడండి..ఫలానా వార్త వుందీ అంటే చూస్తాను. నా సోషల్ నెట్ వర్కింగ్ వ్యవహారాలు కూడా వాళ్లే చూస్తారు. ఆ విషయాల్లో నేను చాలా పూర్. అయినా విమర్శలు, పాజిటివ్, నెగిటివ్ ఏమైనా ఈజీ గా తీసుకుంటాను. గోవిందుడుపై వచ్చిన వార్తలు దాని ఇంప్రూవ్ మెంట్ కే పనికొచ్చాయి.

రాజకీయాలు వద్దు

ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను. సినిమాల్లో నా ఇంప్రూవ్ మెంట్ డాడీ ప్రశంసించే స్థాయికి చేరుకుంది. డాడీ ఆయన కెరియర్ లో ఫుల్ బిజీగా గడిపారు. నా కోరిక కూడా అదే. సినిమాల్లో ఊపిరి సలపనంత బిజీగా వుండాలి. అలా అని నెంబర్ వన్, టూ అలాంటి లెక్కలు లేవు. మంచి నటుడు..మంచి సినిమాలు అనుకోవాలంతే. అలా అని నిర్మాతల డబ్బులతో ప్రయోగాలు చేయను. వాళ్లకి నాలుగు డబ్బులు వచ్చే సినిమాలే చేస్తాను.

చాణక్య

[email protected]