cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

జగన్ గారూ.. ఇది మీ వారి చేతకానితనం కాదా?

జగన్ గారూ.. ఇది మీ వారి చేతకానితనం కాదా?

‘కొత్త విధానం’ అనేది జగన్ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయినట్లుగా ఉంది. ‘‘కొత్త విధానం తెస్తాం’’ అనే పడికట్టు పదం వాడడం ద్వారా.. ‘పాత ప్రభుత్వం చేసిందంతా చండాలమే’ అని ప్రజల ఎదుట నిరూపించాలని సర్కారు భావిస్తున్నది. రాజకీయంగా ఇది వారికి అవసరం కావచ్చు. పాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో ఏమాత్రం లోటుపాట్లు ఉన్నప్పటికీ వాటిని చక్కదిద్ది ప్రజలకు సరైన రీతిలో సేవలు అందించడం తప్పని అనలేం.

కానీ.. ‘కొత్తవిధానం’ తెస్తాం అనే ముసుగులో ప్రజలకు అందుతున్న సేవలను నిలిపివేయడానికి గానీ, అంతరాయం కలిగించడానికి గానీ ప్రభుత్వానికి హక్కులేదు. అలా జరిగితే అది వారి చేతగానితనం అవుతుంది. చేతగానితనం మంత్రులదో అధికారులదో కావొచ్చు గాక..  కానీ ఆ అపకీర్తి మాత్రం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఆపాదించబడుతుందనేది నిజం. ఇప్పుడు అన్న క్యాంటీన్లను మూసివేసే నిర్ణయం ద్వారా అలాంటిదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

జగన్ ప్రభుత్వం వచ్చాక టెండరు పనులను నిలిపేశారు. ఇసుక తీరువాలు ఆపేశారు. తాజాగా పోలవరం పనుల్లో నవయుగ, బెకం సంస్థల కాంట్రాక్టుల్ని కూడా రద్దుచేశారు. వీటన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోగలరు. ఆయా పనుల్లో ఏదో ఒక అవినీతి జరుగుతోంది గనుక.. అది తమ దృష్టికి ఇప్పుడే వచ్చింది గనుక.. పనులు నిలిపేసి దానిని చక్కదిద్దడానికి జగన్ సర్కారు కష్టపడుతోందని నమ్మగలరు.

కానీ అన్న క్యాంటీన్ల విషయం అలా కాదు. ఇది అవినీతి కారణంగా మూతపడలేదు. ఆహార సరఫరా సంస్థతో ప్రభుత్వ ఒప్పందం ముగిసిపోయినందున గురువారం నుంచి మూతపడ్డాయి. నిరుపేదలకు అయిదు రూపాయలకు భోజనం అందించే ఈ పథకం నిలిచిపోవడం.. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఇబ్బంది కలిగించే విషయం అంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం మారిన తర్వాత పథకానికి పేరుమార్చి రాజన్న పేరుతో నడపితే ఎవరూ తప్పుపట్టరు. కానీ ఏకంగా అన్న క్యాంటీన్లను మూసివేయడం అనేది సబబుగా కనిపించడం లేదు.

జనం ఎక్కువగా ఉండే బస్ కాంప్లెక్సులు, ఆస్పత్రులు వంటి చోట వీటిని ప్రారంభిస్తామని మంత్రి బొత్స ఇటీవల శాసనసభలో చెప్సారు. మంచిదే.. దీనివల్ల ఆర్తులకు, దీనులకు, పేదలకు ఉపయోగం ఉంటుంది. అలాచేస్తే శెభాష్ అనాల్సిందే. కానీ.. అందుకోసం.. ఉన్నవి మూసేయడం ఎందుకు? ప్రస్తుతం ఉన్నవి అంతగా ఉపయోగం లేని ప్రాంతాల్లో ఉన్నాయని సర్కారు భావిస్తే గనుక.. కొత్తవి ఏర్పాటుచేసే వరకు వీటిని కొనసాగించాలి కదా? కానీ.. కొత్తవాటికోసం అలాంటి ప్రయత్నం ఇంకా మొదలుపెట్టకుండానే.. ఒప్పందం గడువు ముగిసిన వెంటనే వాటిని మూసేయడం మాత్రం ఖచ్చితంగా చేతగానితనమే.

అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×